ఉరుముతున్నపెనుముప్పు

శతాబ్ది సంక్షోభంగా ప్రతీతమైన కొవిడ్‌ మహమ్మారి బారిన పడి విలవిల్లాడిన ప్రపంచ దేశాలు ఇప్పటికీ కాలూ చేయీ కూడదీసుకోనేలేదు. ఇటువంటప్పుడు త్వరలో పెను ఆర్థిక ఉత్పాతం దాపురించనుందన్న నూరియల్‌ రుబీనీ సంచలనాత్మక భవిష్య వాణి, యావత్‌

Published : 28 Sep 2022 00:56 IST

శతాబ్ది సంక్షోభంగా ప్రతీతమైన కొవిడ్‌ మహమ్మారి బారిన పడి విలవిల్లాడిన ప్రపంచ దేశాలు ఇప్పటికీ కాలూ చేయీ కూడదీసుకోనేలేదు. ఇటువంటప్పుడు త్వరలో పెను ఆర్థిక ఉత్పాతం దాపురించనుందన్న నూరియల్‌ రుబీనీ సంచలనాత్మక భవిష్య వాణి, యావత్‌ మానవాళికీ చేదు కబురు! ప్రపంచం నలుమూలలా చాపకింద నీరులా ఆర్థిక మాంద్యం విస్తరించి వృద్ధిరేటు అంచనాలు తెగ్గోసుకుపోతాయన్నది, డాక్టర్‌ డూమ్‌గా పేరొందిన విఖ్యాత ఆర్థికవేత్త రుబీనీ హెచ్చరిక సారాంశం. ఈ ఏడాది చివర్లో అమెరికాలో మహామాంద్యం రెక్కవిప్పి విశ్వమంతటా కమ్మేసి 2023 కడదాకా కొనసాగనుందన్న ఆయన అంచనాలిప్పుడు గగ్గోలు పుట్టిస్తున్నాయి. 2008 నాటి అమెరికా ఆర్థిక మాంద్యాన్ని ముందుగానే ఊహించి హెచ్చరించింది ఆయనే! వాస్తవానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై మానవాళికి తీవ్ర ఇక్కట్లు వాటిల్లనున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) నివేదిక నాలుగు నెలల క్రితమే ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ ఏడాది చివరికి వివిధ నూనెలు, తిండిగింజలు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు తదితరాల ధరవరలు ప్రజ్వరిల్లుతాయని, నికర వేతనాలు కుంగిపోతాయన్న నివేదికాంశాలు అప్పట్లో వెలుగుచూశాయి. అదే సమయంలో భీకర మాంద్యం పెచ్చరిల్లనుందన్న ప్రబల సంకేతాలు, 2008 నాటి అమెరికా మహా సంక్షోభాన్ని స్ఫురణకు తెస్తున్నాయి. ఆనాడు మాంద్యం కోరసాచి, జనబాహుళ్యం ఆదాయాలు కుంగి, ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. ఎగవేతలు ముమ్మరించి ఎన్నో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బోర్డు తిప్పేశాయి. ఆ ప్రకంపనల ప్రభావం భారత్‌ లాంటి దేశాల్లో ఐటీ, స్థిరాస్తి రంగాలపైనా ప్రసరించింది. అదే తరహాలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలి, దేశాలకు దేశాలే కిందుమీదులయ్యే దుర్దినాలు వాటిల్లనున్నాయంటున్న రుబీనీ- అనేక బ్యాంకులు, సంస్థలు తుడిచిపెట్టుకుపోతాయనీ ఊహిస్తున్నారు. భయంకర దావానలంలా మహామాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టనుందని డబ్ల్యూటీఓ సారథి ఎంగోజీ ఒకాంజో ఇవేలా తాజా వ్యాఖ్యలూ స్పష్టీకరిస్తున్నాయి!

మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక సుమారు పదేళ్లకు 1929 సెప్టెంబరులో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజీ కుప్పకూలడంతో రాజుకున్న మహా మాంద్యం దేశదేశాల్ని అతలాకుతలం చేసింది. 2008 సెప్టెంబరులో అమెరికా సంస్థల రుణ క్లేశాలపై సమాచారం గుప్పుమనగానే ఆసియా, ఐరోపా ప్రధాన మార్కెట్లు ఒక్కుదుటున కుదుపులకు లోనయ్యాయి. కొవిడ్‌ సంక్షోభం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయంగా అపశకునాలు ప్రస్ఫుటమవుతున్నాయి. గిరాకీ చతికిలపడి జర్మనీలో కంపెనీలనేకం గుడ్లు తేలేస్తున్నాయి. పలు దేశాల్లో ద్రవ్యోల్బణానికి రెక్కలు మొలిచాయి. పారిశ్రామికోత్పత్తి మందగించే సూచనలు గోచరిస్తున్నాయి. డాలరు మారకం విలువ జోరెత్తి శ్రీలంక నుంచి లాటిన్‌ అమెరికా వరకు వివిధ దేశాలు రుణ వాయిదాలు చెల్లించే సామర్థ్యం కొరవడి ఎగవేతలకు పాల్పడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం, చైనా ‘జీరో కొవిడ్‌’ విధానాలతో సరఫరా గొలుసుల విచ్ఛిన్నం మొదలు, వడ్డీరేట్ల పెంపుదల వరకు భిన్నాంశాలు మాంద్యం కోరలకు పదును పెట్టేవేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి నేల చూపులు చూస్తూ, జనం వీపులపై ధరల వాతలు తేలుతున్న దశలో- ‘తక్కిన వారితో పోలిస్తే ఇక్కడి పరిస్థితి మెరుగు’ అనే దుర్భ్రమల వ్యాప్తి... చేదు నిజాలకు మసిపూసి మారేడు చేయడమే. ఆర్థిక వృద్ధి సడలుతున్నప్పుడు- ఇంధనంపై పన్నులతోపాటు జీఎస్‌టీనీ తగ్గించి, అర్హత కలిగిన సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నగదు ప్రోత్సాహకాలు సమకూర్చి, పేదలకు ఉచిత ఆహార పథకాల్నీ విస్తరించాలన్న మేలిమి సూచనలు ప్రభుత్వానికి శిరోధార్యం. వీలైనంతగా ఉపాధి కల్పన, ఆహార భద్రత, ధరల నియంత్రణలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడమే- దేశంలో మాంద్యం రూపేణా ప్రజానీకానికి తగిలేకముకు దెబ్బలకు సరైన విరుగుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.