ప్రజారోగ్యానికి పొగ

పోషకాహార లోపంతో ఇప్పటికే జనభారతం జబ్బులపాలవుతోంది. అది చాలదన్నట్లు పొగాకు, మద్యానికి బానిసలవుతున్న వారి సంఖ్య పోనుపోను పెచ్చరిల్లుతోంది. రకరకాల క్యాన్సర్ల విజృంభణకు అది అంటుకడుతోంది. ముఖ్యంగా, ధూమపానంతో పాటు ఖైనీ, గుట్కా, జర్దా వంటి నమిలే పొగాకు ఉత్పత్తుల మూలంగా కొన్నేళ్లుగా దేశీయంగా నోటి క్యాన్సర్‌ దాడి తీవ్రతరమైంది. భారతావనిలో పురుషులను...

Published : 06 May 2024 01:27 IST

పోషకాహార లోపంతో ఇప్పటికే జనభారతం జబ్బులపాలవుతోంది. అది చాలదన్నట్లు పొగాకు, మద్యానికి బానిసలవుతున్న వారి సంఖ్య పోనుపోను పెచ్చరిల్లుతోంది. రకరకాల క్యాన్సర్ల విజృంభణకు అది అంటుకడుతోంది. ముఖ్యంగా, ధూమపానంతో పాటు ఖైనీ, గుట్కా, జర్దా వంటి నమిలే పొగాకు ఉత్పత్తుల మూలంగా కొన్నేళ్లుగా దేశీయంగా నోటి క్యాన్సర్‌ దాడి తీవ్రతరమైంది. భారతావనిలో పురుషులను పట్టిపీడిస్తున్న క్యాన్సర్లలో మొదటి స్థానం దీనిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నివేదించింది. నోటి క్యాన్సర్‌ మూలంగా ఇండియాలో ఏటా యాభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. సంవత్సరానికి లక్ష మంది కొత్తగా ఆ వ్యాధి బారిన పడుతున్నారు. అర్ధాంతర మరణాలకు కారణమవుతూ ఎన్నో కుటుంబాల్లో శోకాగ్నులు రగిలిస్తున్న నోటి క్యాన్సర్‌ వల్ల దేశార్థికానికీ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. టాటా మెమోరియల్‌ సెంటర్‌ తాజా అధ్యయనం ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా నోటిక్యాన్సర్‌ మరణాల్లో మూడింట రెండొంతులు భారత్‌లోనే సంభవిస్తున్నాయి.  పనిచేసే వయసులోని వ్యక్తుల దుర్మరణాల మూలంగా ఇండియా ఏటా రూ.46 వేల కోట్ల మేరకు ఉత్పాదకతను నష్టపోతోంది. వ్యాధి నిర్ధారణలో చోటుచేసుకుంటున్న జాప్యం- నోటి క్యాన్సర్‌ పీడితులకు ప్రాణాంతకమవుతోంది. దేశీయంగా వెలుగు చూస్తున్న క్యాన్సర్‌ కేసుల్లో మూడో వంతుకు పొగాకే కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పొగాకు వల్ల పోటెత్తుతున్న వ్యాధులు, మరణాల వల్ల ఇండియా ఏటా జీడీపీలో ఒక శాతాన్ని కోల్పోతోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తంజేసింది. ప్రజానీకానికి ‘పగాకు’ అయిన పంటకు దూరమయ్యేలా రైతాంగానికి ప్రత్యామ్నాయాలు చూపడం, దాని వినియోగాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వాల ఉదాసీనత- సామాజిక విధ్వంసాన్ని సృష్టిస్తోంది.  

దేశవ్యాప్తంగా 27శాతం వయోజనులు పొగాకును వినియోగిస్తున్నట్లు అంచనా! వారిలో 92శాతం ఖైనీ, గుట్కా, బీడీ వంటివాటికి అలవాటు పడ్డారు. పొగాకు ఉత్పత్తుల తయారీ, సరఫరాలను కట్టడిచేసేందుకు పదహారేళ్ల కిందటే ఇండియా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.  అయినప్పటికీ ఖైనీ, గుట్కా వంటి అతిప్రమాదకర ఉత్పత్తులు విపణిలోకి విచ్చలవిడిగా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బాలలూ వాటి కోరల్లో చిక్కుతుండటం తీవ్రంగా ఆందోళనపరిచేదే. హుక్కా, ఈ-సిగరెట్‌ వంటి వాటికి ఇటీవలి కాలంలో యువత ఎక్కువగా ఆకర్షితమవుతోంది. అవీ ఆరోగ్యాన్ని గుల్లచేస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుల బాదుడును పెంచడం ద్వారా వాటి వినియోగాన్ని నియంత్రించవచ్చునని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.  కానీ, పొగాకు దుష్పరిణామాలను అడ్డుకోవడంలో ఈ వ్యూహం ఏమాత్రం పనిచేయడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ధారిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తులపై పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమవుతున్న ప్రతి వంద రూపాయలకు సమాంతరంగా రూ.816ను ఇండియా పోగొట్టుకొంటున్నట్లు లోగడే వెలుగులోకి వచ్చింది. లోపభూయిష్ఠమైన చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వ్యాపారులు కొందరు- నమిలే పొగాకు ఉత్పత్తులతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి కోట్లకు పడగలెత్తుతున్న కర్కశులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి. అందుకుగాను శాసనాలను పదును తేల్చాలి. పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళిస్తూ, బీడీ కార్మికులకూ ఇతర ఉపాధి మార్గాలు చూపించాలి. ప్రాణాలు తోడేసే పొగాకు గుప్పిట్లో నవతరం చిక్కువడకుండా పాఠశాల దశ నుంచే విస్తృతావగాహన కల్పించాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.