Updated : 05 Feb 2022 05:27 IST

Land Scam: వందెకరాల పందేరం

జనగామ జిల్లాలో భూదాన్‌ భూముల అన్యాక్రాంతం
ఎసైన్డ్‌ భూమిలో యథేచ్ఛగా ప్లాట్లు
రెండేళ్లుగా ఒక్కో స్థలాన్ని కాజేస్తున్న వైనం
గుండు పాండురంగ శర్మ
ఈనాడు - వరంగల్‌

వి భూదానోద్యమం కింద ఇచ్చిన భూములు.. వంద ఎకరాలకు పైగా ఉన్న వీటిపై రియల్‌ మాఫియా కన్నుపడింది. రెండేళ్లుగా ఒక్కో స్థలాన్ని కాజేస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు పంచాయతీ పరిధిలో 206 సర్వే నంబరులో 110 ఎకరాల భూమి ఉంది. భూదాన ఉద్యమ సమయంలో ఆచార్య వినోబా భావేకు నెల్లుట్ల కేశవరావు అనే భూస్వామి ఈ భూములను దానంగా ఇచ్చారు. 1975లో ప్రభుత్వం వీటిని.. భూముల్లేని 44 మంది దళితులకు ఎసైన్‌ చేసింది. వీళ్లందరికీ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భూదాన యజ్ఞబోర్డు హక్కు పత్రాలను అందజేసింది. ఇదంతా గుట్ట ప్రాంతం కావడంతో భూమి పొందిన వారు వీటిని సాగు చేయలేదు. 1991లో రఘునాథపల్లి రెవెన్యూ కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చేయడంతో ఈ భూములకు సంబంధించిన రికార్డులు కూడా కాలిపోయాయి. అనంతరం వీటిపై వివాదం నెలకొంది. లబ్ధిదారులు తమ భూములు తమకే కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరడంతో గత సంవత్సరం అప్పటి తహసీల్దారు భూదాన యజ్ఞ బోర్డుకు లేఖ రాశారు. ఈ భూములకు సంబంధించిన రికార్డులను అందజేస్తే సర్వే చేపడతామని అందులో పేర్కొన్నారు. లబ్ధిదారులు సైతం హైదరాబాద్‌లోని భూదాన యజ్ఞ బోర్డు కార్యాలయం, రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి తమకు ఎసైన్‌ చేసిన భూములకు పట్టాలు చేసివ్వాలని కోరారు. భూదాన బోర్డు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు..
ఇన్నాళ్లూ ఎవరూ సాగు చేయకపోవడంతో ప్రభుత్వం భూదాన్‌ భూముల్లో ఉపాధి హామీ పథకం కింద మొక్కలను పెంచింది. సేద్యపు కుంటలను తవ్వించారు. విత్తన బంతులను కూడా వీటిపై చల్లారు. తాజాగా ఈ ప్రాంతంలోని భూముల ధరలు ఎకరానికి రూ.30 లక్షలకుపైగా పలుకుతుండటంతో రియల్‌ మాఫియా రంగప్రవేశం చేసింది. ప్రభుత్వ రికార్డుల్లో ఎసైన్డ్‌ భూమిగా ఉన్న 206 సర్వే నంబరులో వెంచర్లు చేయడం ప్రారంభించారు. గతంలో ఉపాధి హామీ కింద పెంచిన మొక్కలను తొలగించి.. కుంటలను పూడ్చేసి గుట్టల ప్రాంతాన్ని చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. ఈ భూములను లబ్ధిదారులు తమకు విక్రయించినట్టు స్టాంపు కాగితాలపై పలువురు స్థానికుల సంతకాలు తీసుకొని కోట్ల విలువైన భూదాన్‌ భూముల్ని కాజేస్తున్నారు. విద్యుత్తు స్తంభాలు వేయించారు. రహదారులు నిర్మించి ఫార్మ్‌ ల్యాండ్లుగా విక్రయిస్తున్నారు.


206 సర్వే నంబరు రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉండటంతో భూమిని ఇక్కడ చూపి, మరికొన్ని సర్వే నంబర్లు, బై నంబర్లు వేసి పట్టాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భూదాన్‌ భూములను ధరణి వెబ్‌సైట్‌ గూగుల్‌ మ్యాపులో పరిశీలించగా, భూమిని చదును చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దందాపై విచారణ చేస్తే ఇందులో పాత్ర ఉన్న వారి పేర్లు బయటకు వస్తాయి.


ఇవి భూదాన్‌ భూములే
- అన్వర్‌, తహసీల్దారు, రఘునాథపల్లి

రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబరు 206 నిషేధిత భూమిగా ఉంది. ఇవి భూదాన్‌ భూములే. అంటే ఎసైన్డ్‌ భూములే. వీటిని కొనడం, అమ్మడం చెల్లదు. క్రయవిక్రయాలు జరిగినట్టు మా దృష్టికి రాలేదు. ఫిర్యాదు వస్తే సర్వే చేసి చర్యలు తీసుకుంటాం.


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని