icon icon icon
icon icon icon

Amethi and Raebareli: 24 గంటల్లో అమేఠీ, రాయ్‌బరేలీపై నిర్ణయం: కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ 24 గంటల్లో అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్‌ నాయకుడు వెల్లడించారు. 

Published : 01 May 2024 15:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో అభ్యర్థులను 24 గంటల్లో ప్రకటిస్తామని కాంగ్రెస్‌ (Congress) వెల్లడించింది. ఆ పార్టీ నాయకుడు జైరామ్‌ రమేష్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్‌ (Congress) సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ నిర్ణయాధికారాన్ని కట్టబెట్టిందన్నారు. ‘‘ఇక్కడ ఎవరూ భయపడటం లేదు.. పారిపోవడం లేదు’’ అని జైరామ్‌ రమేష్‌ వ్యాఖ్యానించారు. 

తాజాగా మంగళవారం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల జాబితాలో కూడా అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల ఊసే లేదు. ఫలితంగా ఇక్కడి అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్‌ నెలకొంది. దీంతో ఈ జాప్యంపై అమేఠీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ‘‘గాంధీ కుటుంబాన్ని అమేఠీ కోరుకుంటోంది’’ అంటూ పార్టీ ఆఫీస్‌ ఎదుట నినాదాలు చేశారు. ఇక ఈ రెండు స్థానాల్లో మే 20న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు 3వ తేదీ వరకే గడువుంది. 

2004 నుంచి వరుసగా మూడుసార్లు అమేఠీకి ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ ఓటమి పాలయ్యారు. అప్పుడు భాజపా నుంచి నెగ్గిన స్మృతి ఇరానీ ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాయ్‌బరేలీకి 2004 నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించి ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం- రాయ్‌బరేలీలో పోటీ చేసేందుకు ప్రియాంకాగాంధీ సుముఖంగా ఉన్నారు. సోదరి వరసయ్యే ప్రియాంకపై అక్కడినుంచి పోటీ చేయడానికి భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ నిరాకరించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

మరోవైపు రాహుల్‌ మాత్రం అమేఠీ బరిలో దిగడంపై ఇంకా ఎటూ తేల్చనట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేశారు. అక్కడ పోలింగ్‌ ముగిసింది. అమేఠీలోనూ ఆయన పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img