icon icon icon
icon icon icon

Doubtful voters: ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?

అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది.

Published : 25 Apr 2024 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ కొందరు ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ అస్సాంలో మాత్రం పరిస్థితి భిన్నం. భారత పౌరులుగా ఫారెనర్స్‌ ట్రిబ్యునల్‌ ప్రకటించినప్పటికీ.. ఓటు వేయలేకపోతున్నామని పలువురు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో తమ పేరు వద్ద ‘సందేహాస్పద ఓటరు’ను తొలగించకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ ‘డీ’ ఓటరు అనే విషయాన్ని పరిశీలిస్తే..

ఎవరు వీళ్లు..?

అస్సాంలోని బరాక్‌ లోయ ప్రాంతంలో ఉన్న కరీంగంజ్‌, సిల్చర్ నియోజకవర్గాలు బంగ్లాదేశ్‌తో 129 కి.మీ సరిహద్దు కలిగి ఉన్నాయి. పొరుగు దేశం నుంచి వచ్చిన ఎంతో మంది హిందూ బెంగాలీలు ఈ లోయ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇలా వచ్చిన వారిలో భారత పౌరులుగా నిరూపించుకునేందుకు అవసరమైన ఆధారాలను చూపించలేని వారిని ‘డీ’ ఓటరు లేదా సందేహాస్పద ఓటర్లుగా పేర్కొంటారు. ఫారినర్స్‌ ట్రిబ్యునల్‌లో పెండింగులో ఉన్న లేదా ట్రిబ్యునల్‌ విదేశీయులుగా ప్రకటించిన వారిని ఈ జాబితాలో చేరుస్తారు. అస్సాంలో ‘డీ’ ఓటరు అనే భావనను కేంద్ర ఎన్నికల సంఘం 1997లో తీసుకువచ్చింది. ఇక్కడ తప్పితే దేశంలో మరే రాష్ట్రంలో ఇది ఉండదు.

సుమారు లక్ష మంది..

అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. సందేహాస్పద ఓటర్లకు సంబంధించిన వేలాది కేసులు ఫారినర్స్‌ ట్రిబ్యునల్‌ వద్ద పెండింగులో ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో దాదాపు 86వేల మందిని విదేశీయులుగా ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. వీరందరూ అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీల్లేదు.

ప్రచారానికి ‘డీ ఓటరు’ వేడి..

ఎన్నికలు పూర్తైన ఆరు నెలల్లోగా బెంగాలీ హిందువులు ఎదుర్కొంటున్న పౌరసత్వ సమస్యతోపాటు డీ ఓటరు ట్యాగ్‌ తొలగిస్తామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అక్కడి ఓటర్లుకు హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఏఏ ప్రకారం పౌరసత్వ సమస్య పరిష్కారమైతే.. బెంగాలీ హిందువుల డీ-ఓటరు సమస్య సమసిపోతుందని సిల్చార్‌ భాజపా అభ్యర్థి పేర్కొంటున్నారు. అయితే, డీ ఓటరును తొలగించాలా? లేదా అనే అంశం సుప్రీం కోర్టులో పెండింగులో ఉందని కరీంగంజ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి హఫీజ్‌ అహ్మద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img