icon icon icon
icon icon icon

నర్సాపూర్‌లో ‘చేతులు’ కలిసేనా..!

శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి నర్సాపూర్‌ భారాస అభ్యర్థిత్వం విషయంలో తీవ్రమైన ఉత్కంఠ కొనసాగింది

Updated : 10 Nov 2023 12:20 IST

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి నర్సాపూర్‌ భారాస అభ్యర్థిత్వం విషయంలో తీవ్రమైన ఉత్కంఠ కొనసాగింది. ఆ పార్టీలో సయోధ్య కుదరడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇపుడు కాంగ్రెస్‌లో అసమ్మతి చల్లారడం లేదు. అభ్యర్థిత్వం ఖరారై రాజిరెడ్డికి బీ-ఫాం ఇచ్చినా, ప్రతిష్టంభనకు తెరపడటం లేదు. ఆయనకు పోటీగా గాలి అనిల్‌కుమార్‌ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు.
నలుగురు అర్జీలు: టికెట్‌ కోసం పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి,  ఆంజనేయులుగౌడ్‌, రవీందర్‌రెడ్డి అర్జీలు పెట్టుకున్నారు. వీరిలో గాలి అనిల్‌కుమార్‌, రాజిరెడ్డిల పేర్లను మాత్రమే కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంది. అయితే గాలిఅనిల్‌కుమార్‌, ఆంజనేయులుగౌడ్‌, రవీందర్‌రెడ్డి మొదటి నుంచి ఐక్యంగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ముగ్గురిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా పనిచేస్తామని ప్రకటించారు. రాజిరెడ్డి మాత్రం ఒంటరిగా ముందుకు సాగారు. ఆయనకే అవకాశం రావడంతో,  అనిల్‌కుమార్‌ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  
నిరసన సెగ: పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని కోవర్టులకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ గాలి అనిల్‌కుమార్‌ వర్గీయులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గాంధీభవన్‌ ఎదుట ఆందోళన చేపట్టి, కొందరు కార్యకర్తలు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడ్డారు. నర్సాపూర్‌లో పలుమార్లు సమావేశాలు జరిపి ఆవుల అభ్యర్థిత్వంపై పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చారు. పలుమార్లు పార్టీ పెద్దలను కలిసి వచ్చారు. ఇది జరుగుతుండగానే రాజిరెడ్డికి అధిష్ఠానం బీఫాం అందజేసింది. రాజిరెడ్డి వారితో సంప్రదింపులకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒంటరిగానే ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రాజిరెడ్డికి బీఫాం కేటాయించాక గాలి వర్గం తమ ఆందోళనను తీవ్రతరం చేసింది.    
పోటాపోటీగా నామినేషన్లు: నామపత్రాల సమర్పణ ప్రారంభం కావడంతో ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ పోటా పోటీగా సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ తనకు అధిష్ఠానం నుంచి అనుమతి ఉండటంతోనే నామినేషన్‌ వేసినట్లు చెబుతున్నారు. తనకు తప్పక బీఫాం వస్తుందని ఆశిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తానే అభ్యర్థిగా ఉంటానని, రాజిరెడ్డి ధీమాగా ఉన్నారు. ఈనేపథ్యంలో గురువారం గాలి అనిల్‌ వర్గీయులు గాంధీభవన్‌కు వెళ్లి ముఖ్యనేతలైన ఖర్గే, రేవంత్‌, బట్టిలతో సంప్రదింపులు జరుపుతున్నారు. చర్చలు ఓ కొలిక్కి వస్తాయని పేర్కొంటున్నారు. ఇద్దరు నేతలు పోటీ పడుతుండడం, పంతం వీడక పోవడంతో కార్యకర్తలు, నాయకులకు ఎటూ పాలుపోవడం లేదని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img