కాళేశ్వరం సహా అన్ని కుంభకోణాలపై విచారణ

భాజపా అధికారంలోకి రాగానే అవినీతిపరులను కటకటాల వెనక్కి పంపడం ఖాయమని పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. భారాస పాలన అవినీతి, కుంభకోణాలమయంగా మారిందని అన్నారు.

Updated : 21 Nov 2023 06:58 IST

కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం
వర్గీకరణతో మాదిగలకు న్యాయం చేస్తాం
భాజపా అగ్రనేత అమిత్‌షా

ఈనాడు, వరంగల్‌, కరీంనగర్‌- మెట్‌పల్లి, కోరుట్ల, నాచారం-న్యూస్‌టుడే: భాజపా అధికారంలోకి రాగానే అవినీతిపరులను కటకటాల వెనక్కి పంపడం ఖాయమని పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. భారాస పాలన అవినీతి, కుంభకోణాలమయంగా మారిందని అన్నారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, ఓఆర్‌ఆర్‌, మియాపూర్‌ భూములు, పాస్‌పోర్టులు, గ్రానైట్‌ కుంభకోణాలపై రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడగానే విచారణ చేసి అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన జనగామ, జగిత్యాల జిల్లా కోరుట్లలలో నిర్వహించిన భాజపా ఎన్నికల విజయ సంకల్ప సభల్లో అమిత్‌షా ప్రసంగించారు. బైరాన్‌పల్లి అమరవీరులకు నివాళి అర్పించారు. రాత్రి ఉప్పల్‌ భాజపా అభ్యర్థి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు మద్దతుగా నాచారంలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈయన వెంట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉన్నారు. ఈ సభల్లో అమిత్‌షా మాట్లాడారు. ‘‘భాజపా తెలంగాణ ప్రజల పార్టీ. ప్రస్తుతం జరుగుతున్నవి శాసనసభ ఎన్నికలైనప్పటికీ.. రానున్న అయిదేళ్లలో తెలంగాణ, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని గుర్తించాలి. నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నిర్ణయం తీసుకుని తెలంగాణకు విముక్తి కలిగించారు. సీఎం కేసీఆర్‌.. ఒవైసీకి భయపడి తెలంగాణ విమోచన   దినాన్ని అధికారికంగా నిర్వహించడంలేదు. బైరాన్‌పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్తూపం నిర్మిస్తాం. కాంగ్రెస్‌, భారాసలు బలహీనవర్గాలకు అన్యాయం చేశాయి. కేసీఆర్‌ దళితుడిని సీఎంను చేస్తామని చెప్పి చేయలేదు. కానీ కుమారుడిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భాజపా మాత్రం బీసీని సీఎం చేసే బాధ్యతను చేపట్టింది. భారాస గుర్తు కారు.. దీని స్టీరింగ్‌ మాత్రం ఒవైసీ చేతిలో ఉంది. కాంగ్రెస్‌, భారాస, ఎంఐఎంలు కుటుంబ పార్టీలు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసి కుటుంబపాలన నుంచి విముక్తి కల్పించాలి. ప్రధాని మోదీ పాలనలో జీ-20 సదస్సు నిర్వహణతో ప్రపంచంలో దేశ గౌరవం పెరిగింది. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన పార్లమెంట్‌ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి ప్రారంభించుకున్నాం. చంద్రయాన్‌తో మువ్వన్నెల జెండా చంద్రుడి వరకు చేరింది. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని అయిదో స్థానంలోకి తీసుకువచ్చిన ఘనత మోదీకే దక్కుతుంది.

బీసీ సీఎం భాజపా లక్ష్యం

తెలంగాణలో సామాజిక న్యాయం లక్ష్యంగా బీసీని ముఖ్యమంత్రిగా నియమించాలని భాజపా నిర్ణయించింది. మాదిగ సమాజానికి రిజర్వేషన్లలో అన్యాయం జరిగింది. దీన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మాదిగలకు న్యాయమైన రిజర్వేషన్ల కోసం వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మతపరమైన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాం. పసుపుబోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రతి క్వింటా ధాన్యం రూ.3,100 మద్దతు ధరతో కొంటాం. పంటల బీమా ప్రీమియంకు రైతులు ఒక్క పైసా కట్టాల్సిన అవసరంలేదు. రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్న మహిళలకు ఏటా 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. పేదలకు రూ.10 లక్షల వరకు వైద్యానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. భాజపా ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అయోధ్య దర్శనం చేయిస్తుంది. అర్వింద్‌ను గెలిపిస్తే పెద్ద పదవి ఇచ్చే బాధ్యత మాది.

హామీల అమలేది?

రాష్ట్రంలో 24 వేల టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. 7 లక్షల పేదలకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పి చేపట్టలేదు. రుణమాఫీ అమలు చేయలేదు. భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో తెలంగాణను అగ్రస్థాయి రాష్ట్రంగా నిలుపుతాం’’ అని అమిత్‌షా అన్నారు.


సీఎం కేసీఆర్‌ హామీల అమలును విస్మరించారు. జనగామలో పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు వంటి హామీలనూ నెరవేర్చలేదు. అక్కడ భూఆక్రమణలకు మాత్రం పాల్పడ్డారు.


ఏటా సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి అమరవీరులకు నివాళి అర్పిస్తాం. బైరాన్‌పల్లి, పరకాల అమరవీరుల త్యాగాలను గుర్తిస్తూ ఏటా ఆగస్టు 27ను దుశ్చర్యదినంగా నిర్వహిస్తాం.

అమిత్‌ షా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని