icon icon icon
icon icon icon

ఒక్కలిగలపై పట్టు కోసం!

కర్ణాటకలో తొలి విడత ఎన్నికలు ఓ సామాజికవర్గ నేతల  ఆధిపత్యానికి సవాలుగా మారాయి. ఈనెల 26న 14 స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా.. ఇందులో అత్యధిక స్థానాల్లో ఒక్కలిగలు నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్నారు.

Published : 22 Apr 2024 04:17 IST

కర్ణాటకలో సామాజిక ఆధిపత్య సమరం
ఈనాడు, బెంగళూరు

కర్ణాటకలో తొలి విడత ఎన్నికలు ఓ సామాజికవర్గ నేతల  ఆధిపత్యానికి సవాలుగా మారాయి. ఈనెల 26న 14 స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా.. ఇందులో అత్యధిక స్థానాల్లో ఒక్కలిగలు నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్నారు. విధానసభ, లోక్‌సభ.. ఎన్నికలు ఏవైనా ఆయా పార్టీల్లో ఒక్కలిగ వర్గానికి ప్రాధాన్యం కల్పించడం పార్టీలకు ఓ సవాలే.

వారికి వారే పోటీ

కన్నడనాట రాజకీయాలను శాసించే ప్రముఖ వర్గాల్లో లింగాయత్‌ తర్వాత ఒక్కలిగలే. వీరు రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో వీరి ప్రభావం ఉంటుంది. మండ్య, హాసన, మైసూరు, బెంగళూరు గ్రామీణ, తుమకూరు, కోలారు, చిక్కబళ్లాపుర, చిక్కమగళూరులో కనీసం 40 శాతం, చిత్రదుర్గ, శివమొగ్గ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో 30 శాతం ఓట్లు వారివే. మండ్య జిల్లాలో సగానికి సగం ఈ వర్గానికి చెందినవారే. తాజా ఎన్నికల్లోనూ నాలుగు స్థానాల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ ఈ వర్గానికి చెందినవారే. ఆరు చోట్ల కనీసం ఒకరు ఒక్కలిగ వర్గం నుంచి బరిలో ఉన్నారు. హాసనలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ (జేడీఎస్‌)- శ్రేయస్‌ పాటిల్‌ (కాంగ్రెస్‌) తలపడుతున్నారు. మండ్యలో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్‌)- వెంకటరమణే గౌడ (కాంగ్రెస్‌), బెంగళూరు గ్రామీణలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ (కాంగ్రెస్‌)- హెచ్‌.డి.దేవెగౌడ అల్లుడు డాక్టర్‌ సి.ఎన్‌.మంజునాథ్‌ (భాజపా) సవాళ్లు విసురుకుంటున్నారు. బెంగళూరు ఉత్తరలో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె (భాజపా)- రాజ్యసభ మాజీ సభ్యుడు రాజీవ్‌గౌడ (కాంగ్రెస్‌) ప్రధాన ప్రత్యర్థులు. మాజీ మంత్రి కె.సుధాకర్‌ (భాజపా) చిక్కబళ్లాపుర నుంచి, మైసూరులో యదువీర్‌ ఒడెయార్‌కు పోటీగా ఎం.లక్ష్మణ్‌ ఒక్కలిగ సముదాయానికి ప్రతినిధులుగా రంగంలో ఉన్నారు.

పొత్తు మతలబు..

గత రెండు లోక్‌సభ ఎన్నికల నుంచి భాజపా ఉత్తర ప్రాంతం కంటే దక్షిణంపైనే దృష్టి సారిస్తోంది. బెంగళూరు పరిధిలోని 4 నియోజకవర్గాల్లో కనీసం 3 స్థానాలను సులువుగా గెలుచుకోగలిగిన భాజపా మండ్య, కోలారు, హాసన, బెంగళూరు గ్రామీణ, తుమకూరు, చిక్కబళ్లాపురలో శ్రమించాల్సి వచ్చేది. అందుకోసమే పార్టీలో ఒక్కలిగ నాయకులకు ప్రాధాన్యమిస్తోంది. 2023 ఎన్నికల సమయంలో ఒక్కలిగ ఆరాధ్య యోధుడుగా భావించే కెంపేగౌడ విగ్రహ స్థాపన, ఓబీసీలోని ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లు తొలగించి ఆ సదుపాయాన్ని ఒక్కలిగలకు ఇవ్వడం.. తదితర ప్రయత్నాలు చేసింది. ఆ ఎన్నికల్లో భాజపా నుంచి గెలిచిన ఒక్కలిగ అభ్యర్థులు 8 మందే. కాంగ్రెస్‌ అన్ని వర్గాలనూ ఆకట్టుకుని ఘన విజయం సాధించడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించకుండా ఉండేందుకు జేడీఎస్‌తో పొత్తుకు సిద్ధమైంది. అంతకు ముందే ఈ వర్గానికి చెందిన ఆర్‌.అశోక్‌ను విపక్ష నేతగా నియమించిన భాజపా.. ఒక్కలిగలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ఆధిపత్య పోరు

రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కలిగలకు ఆధిపత్యం వహిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది.. జనతాదళ్‌ మాత్రమే. పాత మైసూరులోని కనీసం 4 జిల్లాలో ఆ పార్టీకి ఒక్కలిగలు వెన్నుదన్నుగా ఉన్నారు. 2023 విధానసభ ఎన్నికల్లో వీరి ఆధిపత్యానికి కాంగ్రెస్‌ గండికొట్టింది. ఒక్కలిగ ప్రభావం అధికంగా ఉండే 4 జిల్లాల్లో జేడీఎస్‌ హాసన మినహా మరే చోటా ప్రభావం చూపలేకపోయింది. ఒక్కలిగ జిల్లాగా పేరున్న మండ్యలోనూ 8 అసెంబ్లీ స్థానాల్లో ఆరింట కాంగ్రెస్‌ నెగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాల్లోనూ భాజపా జాతీయ సమీకరణాల కారణంగా  అత్యధిక స్థానాలు గెలుచుకోగలిగినా వాటిల్లో ఒక్కలిగలకు ఇచ్చే ప్రాధాన్యం అంతంత మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపా 25 స్థానాల్లో గెలిచినా అందులో ఒక్కలిగలు కేవలం నలుగురే.

నాయకుల సమరం

కాంగ్రెస్‌కు అతి పెద్ద ఓటు బ్యాంకు అహిందలే (అట్టడుగు, హిందళిత, దళితులే). ఆ వర్గానికి సిద్ధరామయ్య ఎలాగూ పెద్ద దిక్కుగా ఉన్నారు. డీకే శివకుమార్‌ రూపంలో పీసీసీ సారధి అయిన ఒక్కలిగ నాయకుడు కాంగ్రెస్‌కూ దొరికినట్లైంది. ఆయన సారధ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ 135 నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో ఈ పార్టీలో ఒక్కలిగ పెద్దలు ప్రధాన భూమిక కోసం సమరాన్ని మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి కుర్చీ జారవిడుచుకున్న డీకే శివకుమార్‌.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం 15 స్థానాలైనా దక్కేలా చేస్తే మరింత బలపడతారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఈ స్థాయి విజయాన్ని అందకుండా చేసేందుకు ఇదే వర్గానికి చెందిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి చెమటోడుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img