icon icon icon
icon icon icon

ఓడిన చోటా నెగ్గాలి..

అసెంబ్లీ సమరంలో ఓడిన 54 అసెంబ్లీ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ స్థానాల నుంచి అధికంగా ఓట్లు రాబట్టాలని ముమ్మర యత్నాలు చేస్తోంది.

Published : 24 Apr 2024 05:12 IST

అసెంబ్లీ ఎన్నికల్లో 54 చోట్ల కాంగ్రెస్‌కు అపజయం
ఈ లోక్‌సభ సమరంలో ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
పోలింగ్‌ కేంద్రాల వారీగా కార్యాచరణ
ఇన్‌ఛార్జి మంత్రులు, సమన్వయకర్తలకు అధిష్ఠానం నిర్దేశం
ఈనాడు - హైదరాబాద్‌

అసెంబ్లీ సమరంలో ఓడిన 54 అసెంబ్లీ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ స్థానాల నుంచి అధికంగా ఓట్లు రాబట్టాలని ముమ్మర యత్నాలు చేస్తోంది. ఈ విషయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎలా ముందుకెళ్లాలో అధిష్ఠానం నిర్దేశించింది. ఆ ప్రకారం నాడు ఓటమికి కారణాలను విశ్లేషించుకొని, అన్ని వర్గాలను కలుపుకొంటూ అదే నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆధిక్యం సాధించేందుకు కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. నేతలు పోలింగ్‌ కేంద్రాల వారీగా అప్పుడు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే లెక్కలు తీస్తున్నారు. ఓట్లలో వెనుకబడిన పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ముఖ్యమైన కార్యకర్తలను స్థానిక నేతలను అభ్యర్థులు, రాష్ట్ర నేతలు అప్రమత్తం చేస్తున్నారు. బాగా పనిచేసే కార్యకర్తలను గుర్తించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఇందిరమ్మ సంక్షేమ కమిటీల్లో స్థానం కల్పిస్తామని పార్టీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి తీసుకెళ్లడానికి ఇందిరమ్మ కమిటీలే కీలకపాత్ర పోషిస్తాయని నేతలు వారికి వివరిస్తున్నారు.

చేరికలపై దృష్టి...

శాసనసభ ఎన్నికల్లో కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోని మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ఉదాహరణకు ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు ఖానాపూర్‌లో మాత్రమే నెగ్గింది. ఓడిన ఆరు నియోజకవర్గాల్లో ఇప్పుడు మెజార్టీ సాధించడమే అసలైన సవాలుగా మారింది. కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని సిరిసిల్ల, హుజూరాబాద్‌, కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో భారాస ఎమ్మెల్యేలున్నారు. వాటిల్లో మెజార్టీ సాధించడాన్ని సవాలుగా తీసుకుని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన చోట ఇతర పార్టీలకు చెందిన స్థానిక నేతలు పార్టీలో చేరుతున్నందున బలం పుంజుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోని భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఓడిపోయింది. అక్కడ భారాస నుంచి నెగ్గిన ఎమ్మెల్యే తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. దాంతో ఖమ్మం లోక్‌సభ స్థానంలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నట్లైంది. గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, ఇతర నేతలు, కార్యకర్తలు భారాస, భాజపాల నుంచి కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికొక ముఖ్యనేతను సమన్వయకర్తగా నియమించి ఎన్నికల ప్రచారంపై అధిష్ఠానం ఆరా తీస్తోంది. ఎలా వ్యవహరిస్తే నెగ్గుకొస్తామనే అంశంపై సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు పార్టీకి నివేదిస్తున్నారు.

ఖర్చులకు వెనకాడుతున్న నేతలు..

కాంగ్రెస్‌ నెగ్గిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. వీలును బట్టి వారు ప్రచార ఖర్చులను సైతం కొంతమేర భరిస్తున్నారు. అక్కడక్కడ కొందరు ఎమ్మెల్యేలు తాము అసెంబ్లీ ఎన్నికల్లోనే బాగా ఖర్చుపెట్టినందున ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థులే ఖర్చు భరిస్తే ప్రచారాన్ని పర్యవేక్షిస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేని మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం ప్రచార ఖర్చులన్నీ లోక్‌సభ అభ్యర్థులు, మంత్రులే భరించాల్సి వస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలనే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులుగా పార్టీ నియమించింది. తాము భారీగా ఖర్చు పెట్టినా అసెంబ్లీకి వెళ్లలేకపోయామని, ఇప్పుడు మళ్లీ వ్యయం చేయడానికి సొమ్ముల్లేవని కొందరు ముందుకు రావడం లేదు.


భారీ మెజార్టీలను మళ్లించాలని...

అసెంబ్లీ ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాల్లో భారాస భారీ మెజార్టీలతో నెగ్గింది. ఇప్పుడు ఆ ఆధిక్యాన్ని తగ్గించి కాంగ్రెస్‌ వైపు ఓట్లు మళ్లించాలనేది పార్టీ ప్రణాళిక. ఉదాహరణకు గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోని కుత్బుల్లాపూర్‌లో భారాసకు 85,576, కూకట్‌పల్లిలో 70,387, మల్కాజిగిరిలో 49,530, సికింద్రాబాద్‌లో 45,240, ముషీరాబాద్‌లో 37,797, మహేశ్వరంలో 26,187, ఎల్బీనగర్‌లో 22,305 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీచేస్తున్న నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆర్మూర్‌లో భాజపాకు 29,669, భారాసకు బాన్సువాడలో 23,464, నిజామాబాద్‌లో 15,387, బాల్కొండలో 4,530 ఓట్ల మెజార్టీ వచ్చింది. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి పోటీచేస్తున్న నాగర్‌ కర్నూల్‌ స్థానం పరిధిలోని అలంపూర్‌లో భారాసకు 30,573 ఓట్ల మెజార్టీ వచ్చింది. అలాంటిచోట్ల అధికంగా ఓట్లు రాబడితేనే కాంగ్రెస్‌ ఇప్పుడు నెగ్గుతుందని భావించి ఆ మేరకు పోలింగ్‌ కేంద్రాల వారీగా ప్రచార ప్రణాళికలు అమలుచేస్తున్నట్లు రాష్ట్ర నేతలు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img