icon icon icon
icon icon icon

నాలుగు చోట్ల కాలుమోపని కమలం

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నాలుగు ప్రాంతాల్లో అసలు పోటీ చేయడంలేదు. అందులో లక్షద్వీప్‌, మేఘాలయ, నాగాలాండ్‌, కశ్మీర్‌ ఉన్నాయి. అక్కడి 7 సీట్లు మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్నిచోట్లయినా భాజపా బరిలోకి దిగుతోంది.

Published : 29 Apr 2024 04:07 IST

కశ్మీర్‌లో పోటీకి దూరం  
మిత్రపక్షాలకు మేఘాలయ, నాగాలాండ్‌, లక్షద్వీప్‌ల కేటాయింపు

'

ఈనాడు, దిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నాలుగు ప్రాంతాల్లో అసలు పోటీ చేయడంలేదు. అందులో లక్షద్వీప్‌, మేఘాలయ, నాగాలాండ్‌, కశ్మీర్‌ ఉన్నాయి. అక్కడి 7 సీట్లు మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్నిచోట్లయినా భాజపా బరిలోకి దిగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 443 స్థానాల్లో ఆ పార్టీ పోటీపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, ఝార్ఖండ్‌, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపుర్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి సీట్లు సర్దుబాటు చేసుకొని బరిలోకి దిగింది. మిగతాచోట్ల ఒంటరిగానే పోటీపడుతోంది. 1996లో 471 లోక్‌సభ స్థానాల్లో భాజపా పోటీచేసింది. ఆ తర్వాత ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం.  

వ్యూహాత్మక నిర్ణయం

370 అధికరణాన్ని రద్దు చేశాక కశ్మీర్‌ ప్రాంతంలో జరుగుతున్న తొలి ఎన్నికలకు భాజపా దూరంగా ఉంది. అక్కడున్న మూడు సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపలేదు. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ‘370’ రద్దు పట్ల కశ్మీర్‌ లోయలోని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత లోక్‌సభ ఎన్నికల్లో కనిపిస్తే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తాము ఇక్కడ దేశభక్త పార్టీలకు మద్దతిస్తామని జమ్మూకశ్మీర్‌ భాజపా అధ్యక్షుడు రవీందర్‌ రైనా ప్రకటించారు. జమ్మూలోని రెండు స్థానాల నుంచి మాత్రం భాజపా పోటీలో ఉంది. అనంత్‌నాగ్‌-రాజౌరీ, శ్రీనగర్‌, బారాముల్లా స్థానాల నుంచి కాంగ్రెస్‌ కూడా పోటీచేయడం లేదు. పొత్తులో భాగంగా వాటిని నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు కేటాయించింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ అక్కడ ఒంటరిగా పోటీచేస్తోంది.

మేఘాలయలోని రెండు సీట్లను ఎన్డీయే మిత్రపక్షం నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి, నాగాలాండ్‌లోని ఒక్క సీటును నేషనల్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీకి, లక్షద్వీప్‌లోని ఒక సీటును అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి భాజపా కేటాయించింది. ఇవి మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఎక్కడోచోట కమలం పార్టీ రంగంలోకి దిగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో 443 స్థానాల్లో పోటీచేస్తున్న భాజపా ఇప్పటివరకు 435 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలి, కైసర్‌గంజ్‌ స్థానాలున్నాయి. రాయబరేలి నుంచి కాంగ్రెస్‌ ప్రకటించే అభ్యర్థిని చూశాక బలమైన ప్రత్యర్థిని దించాలని భాజపా భావిస్తోంది. కైసర్‌గంజ్‌ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వివాదాస్పద నేత, భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ను కొనసాగించాలా? మరో అభ్యర్థిని రంగంలోకి దించాలా? అని ఆ పార్టీ యోచిస్తోంది. ఇతనిపై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img