icon icon icon
icon icon icon

హోరాహోరీ స్థానాల్లో ఉద్ధృత ప్రచారంతో ఢీ

తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌.. ఉత్తర తెలంగాణ, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఆరు నియోజకవర్గాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించి పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు తెలిసింది.

Published : 06 May 2024 03:28 IST

ఆరు లోక్‌సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి
అగ్రనేతల పర్యటనలూ ఎక్కువగా అక్కడే
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌.. ఉత్తర తెలంగాణ, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఆరు నియోజకవర్గాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించి పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు తెలిసింది. దీనికి తగ్గట్లుగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ లోక్‌సభ స్థానాల పరిధిలో ప్రచారం ఉద్ధృతం చేయడంతో పాటు పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకల ప్రచార సభలను కూడా ఎక్కువగా ఈ స్థానాల్లోనే ఏర్పాటు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, మంత్రులు, లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జులు పాల్గొని నియోజకవర్గాల వారీగా సమీక్షించినట్లు తెలిసింది. తాజా సర్వే అంశాలు, ఇన్‌ఛార్జుల నివేదికల ఆధారంగా చర్చించినట్లు సమాచారం. ప్రచారం, నాయకుల మధ్య సమన్వయం, ఏయే వర్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది, వనరులు.. ఇలా అన్ని అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. 9 లోక్‌సభ స్థానాల్లో పార్టీకి ఆధిక్యం ఉందని వ్యూహకర్త సునీల్‌ కనుగోలు నివేదించినట్లు సమాచారం. మరో 6 చోట్ల గట్టిపోటీ ఉందని, నువ్వా నేనా అన్న పరిస్థితికి వచ్చామని, ఈ స్థానాల్లో బాగా పని చేయాలని నిర్ణయించుకొని ఆ మేరకు కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌, మరో లోక్‌సభ స్థానంలో బాగా వెనకబడి ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ‘ఈ రెండూ మినహాయిస్తే... మిగిలిన వాటిలో ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలి. స్థానిక నాయకులు మరింత ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలి. కొన్ని వర్గాల వద్దకు ఇంకా ఎక్కువగా వెళ్లాలి’ అని నిర్ణయించినట్లు తెలిసింది.

భారాస ముఖ్య నేతలను చేర్చుకుంటూ...

అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం పరిధిలో కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచింది. భారాస, భాజపాల కంటే రెండు లక్షల ఓట్లు తక్కువగా వచ్చాయి. ఉద్యమ నేపథ్యం గల ఆత్రం సుగుణను ఇక్కడ అభ్యర్థిగా ఎంపిక చేయడం, అసెంబ్లీ సెగ్మెంట్లలోని భారాస ముఖ్య నాయకులను చేర్చుకోవడం, ప్రచార ఉద్ధృతి పెంచడం వల్ల కాంగ్రెస్‌ ప్రధాన పోటీదారుగా ఎదిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు బహిరంగసభల్లో ప్రసంగించారు. ఆదివారం నిర్మల్‌లో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభ జరిగింది. రేవంత్‌ కూడా పాల్గొన్నారు. ఈ సభకు ముందే నిర్మల్‌కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఎలాగైనా ఆదిలాబాద్‌ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో పార్టీ పని చేస్తోంది. మంత్రి సీతక్క ఇన్‌ఛార్జిగా అక్కడే మకాం వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కక అసంతృప్తికి గురై బరిలోకి దిగి సస్పెండ్‌ అయిన వారిని తిరిగి చేర్చుకొన్నా, కొందరు నాయకుల అభ్యంతరంతో తిరిగి పెండింగ్‌లో పెట్టడం లాంటివి ప్రభావం చూపుతాయని, ఇలాంటి సమస్యలను కూడా పరిష్కరించాలని కొందరు నాయకులు అధిష్ఠానం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది.


సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకూ అధిక ప్రాధాన్యం

జహీరాబాద్‌, నిజామాబాద్‌లపైన కూడా కాంగ్రెస్‌ మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఈ నెల 10న ఎల్లారెడ్డిలో జరిగే సభలో ప్రియాంక పాల్గొనే అవకాశం ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌ స్థానాలతోపాటు మహబూబ్‌నగర్‌పై కూడా పార్టీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే ఐదుసార్లు మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్‌ శనివారం కూడా కొత్తకోట రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే రాహుల్‌ సభ నిర్వహించారు. 9న కరీంనగర్‌తోపాటు సరూర్‌నగర్‌లో జరిగే రోడ్‌షోకు కూడా హాజరవుతారు. సరూర్‌నగర్‌ మల్కాజిగిరి పరిధిలో ఉంది. ఈ నెల 10న ప్రియాంకాగాంధీ జహీరాబాద్‌ పరిధిలోని ఎల్లారెడ్డి; చేవెళ్ల పరిధిలోని తాండూరు; మహబూబ్‌నగర్‌ పరిధిలోని షాద్‌నగర్‌ సభల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు కూడా కాంగ్రెస్‌ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ అసెంబ్లీ స్థానానికి ఇన్‌ఛార్జిగా పెట్టినట్లు తెలిసింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి సభలు కూడా ఈ ఆరేడు ఎంపీ స్థానాల్లోనే ఎక్కువగా ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు భాజపా అగ్రనాయకత్వం కూడా ఈ నియోజకవర్గాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img