icon icon icon
icon icon icon

సుదీర్ఘకాలం ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా..

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగారు. 

Published : 13 Nov 2023 07:29 IST

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగారు. వీరిలో కొన్ని కుటుంబాలకు చెందిన వారు జిల్లా రాజకీయాలతో పాటు ఇతర జిల్లాల్లో సైతం పోటీ చేసి గెలుపొందటం విశేషం. ఇలా విజయాలు సాధించిన నాయకులపై ప్రత్యేక కథనం.

 - ఖమ్మం గాంధీచౌక్, ఖమ్మం నగరం, న్యూస్‌టుడే

పువ్వాడ నాగేశ్వరరావు.. అజయ్‌కుమార్‌

సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు 1989, 1994 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఓ పర్యాయం ఎమ్మెల్సీగా చేశారు. ఆయన కుమారుడు పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇదే నియోజకవర్గం నుంచి 2014 కాంగ్రెస్, 2018లో తెరాస(ప్రస్తుత భారాస)నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం భారాస అభ్యర్థిగా మూడోసారి బరిలో నిలిచి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

‘మల్లు’ సోదర త్రయం..

  • ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) మాజీ అధ్యక్షుడు దివంగత మల్లు అనంతరాములు మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1980, 1989 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.
  • అనంతరాములు సోదరుడు మల్లు రవి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో 2008లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇదే జిల్లాలోని నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గం నుంచి 1991, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.
  • అనంతరాములు మరో సోదరుడు మల్లు భట్టివిక్రమార్క 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన ఉప సభాపతిగా పని చేశారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న ఆయన నాలుగోసారి పోటీ చేస్తున్నారు.

‘జలగం’ కుటుంబం నుంచి నలుగురు

  • మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దివంగత జలగం వెంగళరావు... కుటుంబం నుంచి మొత్తం నలుగురు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయాలు సాధించారు.
  • జలగం వెంగళరావు 1962, 1967, 1972లో వేంసూరు, 1978లో సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 1984, 1989 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు.
  • వెంగళరావు సోదరుడు జలగం కొండలరావు 1957లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977, 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలిచారు.
  • వెంగళరావు కుమారుడు జలగం ప్రసాదరావు 1983, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పని చేశారు.
  • వెంగళరావు మరో కుమారుడు జలగం వెంకట్రావు కాంగ్రెస్‌ నుంచి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి, ఆ తర్వాత 2014లో కొత్తగూడెం నుంచి తెరాస నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

‘రాంరెడ్డి’ సోదరుల ‘పాంచ్‌’పటాక

  • సుజాతనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి 1996 ఉప ఎన్నికతో పాటు ఆ తర్వాత జరిగిన 1999, 2004, పాలేరు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు విజయాలు సాధించారు. పాలేరు నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. సహకార, ఉద్యానశాఖ మంత్రిగా కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. మొత్తం అయిదు పర్యాయాలు శాసన సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
  • రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1985, 1989, 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా తుంగతుర్తి, 2009లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పని చేశారు. 1994లో ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు చెరో ఐదు పర్యాయాలు గెలుపొందటం అరుదైన విషయం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img