icon icon icon
icon icon icon

పాలమూరు పందెం కోళ్లు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో మొత్తం 201 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన అనంతరం పాలమూరులో మొత్తం 238 మంది అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్‌ అధికారులు తేల్చారు.

Updated : 21 Nov 2023 14:17 IST

తేలిన ప్రధాన పార్టీల అభ్యర్థులు
ముఖ్య నేతలతో ఇక ప్రచార హోరు
ఈనాడు, మహబూబ్‌నగర్‌

మ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో మొత్తం 201 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన అనంతరం పాలమూరులో మొత్తం 238 మంది అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్‌ అధికారులు తేల్చారు. ఇందులో 37 మంది తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్‌ అధికారులు బుధవారం ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌లో 8 మంది నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులెవరో తేలడంతో ఇక ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. ఎన్నికలకు మరో 15 రోజులే ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు.  

భారాస.. సీఎం కేసీఆర్‌ సభలు

అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ సభల ద్వారా భారాస ప్రచారం చేస్తోంది. జడ్చర్ల, అచ్చంపేట, వనపర్తి, దేవరకద్ర, గద్వాల, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం ప్రజా ఆశీర్వాద సభలు ఇప్పటికే ముగిశాయి.19న అలంపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌, 22న మహబూబ్‌నగర్‌లో సభలున్నాయి. సీఎం కాకుండా కేటీఆర్‌, హరీశ్‌రావును కూడా నియోజకవర్గాలకు తీసుకొచ్చి ప్రచారం చేపట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా భారాస ఎన్నికల క్యాంపెయిన్‌ ఇన్‌ఛార్జిలను నియమించింది.  

రంగంలోకి ముఖ్య నేతలు..

కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఇప్పటికే  పలుమార్లు ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్‌లో రాహుల్‌గాంధీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా, కల్వకుర్తి, జడ్చర్లలో బస్సు యాత్ర ద్వారా కూడలి సమావేశాల్లో పాల్గొన్నారు. అలంపూర్‌, గద్వాల, మక్తల్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. త్వరలో మిగతా నియోజకవర్గాల్లో కర్ణాటకకు చెందిన ముఖ్యనేతలు సహా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సభలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన ఏఐసీసీ ప్రతినిధులను సమన్వయకర్తలుగా నియమించారు. వీరూ నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్‌ గెలుపు కోసం వ్యూహాలు చేస్తున్నారు.

భాజపా అగ్రనేతలతో..

షెడ్యూల్‌ కంటే ముందే మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పాలమూరులో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జిల్లాకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 18న అమిత్‌షా బహిరంగ సభను గద్వాలలో ఏర్పాటు చేశారు. మిగతా నియోజకవర్గాల్లో ప్రముఖులు వచ్చి ప్రచారం చేయనున్నారు. మహబూబ్‌నగర్‌, గద్వాల, కల్వకుర్తి, కొల్లాపూర్‌, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాలపై ఆ పార్టీ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img