Mallikarjun Kharge: ‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఘాటుగా బదులిచ్చారు. 

Published : 27 Apr 2024 18:22 IST

దిల్లీ: తమ మేనిఫెస్టో గురించి వివరించేందుకు ప్రధాని మోదీతో భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవల సమయం అడిగిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలకు ఖర్గే ఘాటుగా బదులిచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే..?

అస్సాంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘‘నేను మోదీతో మాట్లాడాను. సీఎంతో కాదు. నేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతను. నేను లోక్‌సభకు కూడా ప్రాతినిధ్యం వహించాను. పార్లమెంటరీ వ్యవహారాలపై నాకు అవగాహన ఉంది. మరి అప్పుడు నా ప్రత్యర్థి మోదీనే కదా. నేను ఆయనతో మాట్లాడతాను. మధ్యలో ఈయన (హిమంత) ఎందుకు బాధ పడుతున్నారు. ఇక్కడ మా వాళ్లను ఎదుర్కొని, నా గురించి మాట్లాడితే బెటర్’’ అని ఖర్గే చురకలు అంటించారు.

ఇటీవల మోదీకి ఖర్గే లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే భేటీకి సమయం అడిగారు. దానిపై హిమంత స్పందిస్తూ..‘‘ ప్రధాని మోదీకి ఇంగ్లీష్ వచ్చు. మీరు మేనిఫెస్టోను హిందీ, ఇంగ్లీష్‌ల్లో విడుదల చేశారు. మరింక కలిసి మాట్లాడటం ఎందుకు..? ఈ సమయంలో ఖర్గే, భాజపా మధ్య సమావేశం ఎందుకు..? ఒకవేళ ఆయన భాజపాలో చేరాలనుకుంటే.. రావొచ్చు. నేను ఆయన ఇంటికి వెళ్లి, రక్షణగా ఉంటాను. లేకపోతే.. మోదీతో భేటీ అవసరం ఏముంది’’ అని ప్రశ్నించారు.

సంపద పునఃపంపిణీ, మంగళసూత్రం, వారసత్వ పన్ను.. తన ప్రసంగాల్లో ఈ పదాలను ఉపయోగించి ప్రధాని మోదీ (Modi) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హస్తం పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ సమయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మోదీకి లేఖ రాశారు. ‘‘మీ ప్రసంగాలకు మీ సొంత వ్యక్తులు కొట్టే చప్పట్లు చూసి, మోసపోకండి. మీ మాటలతో నిరాశకు గురైన కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలను మీ దరి చేరనివ్వడం లేదు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని