Hyderabad: రాజధాని క్యా కరేగీ!

అసఫ్‌జాహీలు, నిజాంషాహీల పాలన నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులను ఇముడ్చుకుని నిత్యనూతనంగా వికసిస్తున్న నగరం హైదరాబాద్‌.

Updated : 28 Nov 2023 08:24 IST

అసఫ్‌జాహీలు, నిజాంషాహీల పాలన నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులను ఇముడ్చుకుని నిత్యనూతనంగా వికసిస్తున్న నగరం హైదరాబాద్‌(Hyderabad). దీని చుట్టూ మహానగర రూపురేఖలతో బహుముఖంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఈ రెండు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలు 29. అంటే రాష్ట్రంలోని పావువంతు స్థానాలు ఇక్కడే ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఇందులో అత్యధికంగా 18 స్థానాలను భారాస గెలుచుకోగా.. 7 చోట్ల ఎంఐఎం, 3 చోట్ల కాంగ్రెస్‌, 1 స్థానంలో భాజపా విజయం సాధించాయి. ఇక్కడ పట్టు సాధించే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారి... అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు ఇవీ...

సికింద్రాబాద్‌

ఈ స్థానంలో నాలుగో విజయం కోసం డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు కృషి చేస్తున్నారు. తనయులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదం సంతోష్‌కుమార్‌కు రైల్వే ఉద్యోగులతో అనుబంధం ఉండటం ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఆయన భార్య ఉమాదేవి మెట్టుగూడ, బౌద్ధనగర్‌ల నుంచి కాంగ్రెస్‌ కార్పొరేటర్‌గా పనిచేశారు. భాజపా అభ్యర్థి మేకల సారంగపాణి.. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు ప్రకటనతో... ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్న ఆ వర్గం మద్దతు లభిస్తుందనే విశ్వాసంతో ఉన్నారు.


సనత్‌నగర్‌

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (భారాస), కోట నీలిమ (కాంగ్రెస్‌) మధ్య ప్రధాన పోరు నెలకొంది. మంత్రిగా... తాను చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయనే నమ్మకంతో తలసాని ఉన్నారు. కీలక సమస్యలను పరిష్కరించడం, నిత్యం ప్రజల్లో ఉండడం తన బలంగా చెబుతున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం సహా పలు కొత్త పథకాలను నగరంలో ఇక్కడి నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభించడం సానుకూలాంశం. ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జి పవన్‌ ఖేడా సతీమణి అయిన కోట నీలిమ... కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను ఓటర్లకు చేర్చడమే లక్ష్యమంటూ ప్రచారం చేస్తున్నారు. భాజపా తరఫున సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.


జూబ్లీహిల్స్‌

ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ (భారాస) హ్యాట్రిక్‌ విజయానికి శ్రమిస్తున్నారు. భారాస కార్పొరేటర్‌ ఒకరు పార్టీని వీడటం, సొంత క్యాడర్‌లో అసంతృప్తి వంటి ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. పీజేఆర్‌ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి భారాసలో చేరడం సానుకూలాంశం. కాంగ్రెస్‌ అభ్యర్థి, క్రికెటర్‌ అజహరుద్దీన్‌... మైనారిటీ ఓట్ల మద్దతుతో గెలుపు సిక్సర్‌ కొడతానని అంటున్నారు. భాజపా అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి.. అగ్రనేతల ప్రచారంతో హోరెత్తించారు. ఎంఐఎం అభ్యర్థిగా షేక్‌పేట కార్పొరేటర్‌ మహ్మద్‌ రషీద్‌ ఫజారుద్దీన్‌ పోటీ చేస్తున్నారు. మైనారిటీ ఓట్లను భాజపా మినహా మిగిలిన మూడు పార్టీలు చీల్చుకునే అవకాశముంది.


బహదూర్‌పుర

ఎంఐఎం తన అభ్యర్థులను మార్చిన స్థానాల్లో ఇదొకటి. మూడుసార్లు వరుసగా గెల్చిన మహ్మద్‌ మోజంఖాన్‌ స్థానంలో ఈసారి కార్పొరేటర్‌ మహ్మద్‌ మొబీన్‌ పోటీ చేస్తున్నారు. భారాస నుంచి అలీ బాక్రీ, కాంగ్రెస్‌ నుంచి రాజేశ్‌కుమార్‌ పులిపాటి, భాజపా నుంచి వై.నరేశ్‌కుమార్‌ పోటీలో ఉన్నారు.


చాంద్రాయణగుట్ట

1999 నుంచి వరుసగా  అయిదుసార్లు గెల్చిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ.. ఈసారి గెలిచి డబుల్‌ హ్యాట్రిక్‌ సాధిస్తానని గట్టి నమ్మకంతో ఉన్నారు. భాజపా నుంచి కౌడి మహేందర్‌, కాంగ్రెస్‌ నుంచి బోయ నగేశ్‌, భారాస నుంచి ముప్పిడి సీతారాంరెడ్డి పోటీలో ఉన్నారు.


కంటోన్మెంట్‌(ఎస్సీ)

భారాస నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, కవాడిగూడ మాజీ కార్పొరేటర్‌ లాస్యనందిత తొలిసారి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో పిలిస్తే పలికే నేతగా సాయన్నకు ఉన్న పేరు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన అకాల మరణంతో ఏర్పడిన సానుభూతి, ప్రభుత్వ అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయనే నమ్మకంతో నందిత ఉన్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ కుమార్తె వెన్నెల కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్నారు. భారాస పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. నియోజకవర్గంలో పేదల ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. భాజపా అభ్యర్థి శ్రీగణేశ్‌ నారాయణ సామాజిక కార్యక్రమాలతో సానుకూలత పెంచుకున్నారు.


 గోషామహల్‌ 

హిందుత్వ ఎజెండా, ఉత్తరాది ఓటర్ల మద్దతుతో మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొడతానని భాజపా ఎమ్మెల్యే   టి.రాజాసింగ్‌ అంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారంతో కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. భారాస టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ భాజపాలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భారాస నుంచి నందకిషోర్‌ వ్యాస్‌ పోటీ చేస్తున్నారు. రాజాసింగ్‌ను ఓడించాలనే పట్టుదలతో ఎంఐఎం ఉండటం తమకు కలిసివస్తుందని భారాస అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా.. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు బరిలో ఉన్నారు.


కార్వాన్‌ 

ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ హ్యాట్రిక్‌ విజయంపై దృష్టిపెట్టారు. భాజపా నుంచి అమర్‌సింగ్‌, భారాస అభ్యర్థిగా అయిందాల కృష్ణయ్య, కాంగ్రెస్‌ నుంచి ఉస్మాన్‌ బిన్‌ అల్‌ హాజ్రి పోటీ చేస్తున్నారు.


ఖైరతాబాద్

ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (భారాస) మరోసారి పోటీ చేస్తున్నారు. ఆరోగ్యం సహకరించక మధ్యలో కొద్దిరోజులు ప్రజల్లోకి రాకపోవడం కొంత ప్రతికూలాంశం. కాంగ్రెస్‌ తరఫున పీజేఆర్‌ కుమార్తె పి.విజయారెడ్డి బరిలో ఉన్నారు. గతంలో రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె, తండ్రి సెంటిమెంట్‌తో గెలుపు ధీమాతో ఉన్నారు. భాజపా అభ్యర్థి చింతల రాంచంద్రారెడ్డి 2014లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి చేపట్టిన కార్యక్రమాలతో కొంత సానుకూలత ఉంది. అయితే 2018లో ఓటమి తర్వాత నియోజకవర్గానికి కొంత దూరంగా ఉండటం ప్రతికూలతగా చెబుతున్నారు.


ముషీరాబాద్‌

భారాస ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం, స్థానికంగా జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటు, 3వేల రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు, డ్రైనేజీ సమస్యకు పరిష్కారం తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. కరోనా సమయంలో చేసిన సేవలు, నిత్యం ప్రజల్లో ఉండటం కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అంజన్‌కుమార్‌యాదవ్‌.. గతంలో రెండు పర్యాయాలు సికింద్రాబాద్‌ ఎంపీగా ఉన్నప్పుడు ముషీరాబాద్‌ కోసం చేసిన పనులను గుర్తుచేస్తున్నారు. భాజపా తరఫున కొత్త అభ్యర్థి పూసరాజు పోటీ చేస్తున్నారు.


అంబర్‌పేట

ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై 2018లో గెలుపుతో భారాస ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. మరోసారి బరిలో ఉన్నారు. నాయకుల అలకలు, మాజీ కార్పొరేటర్లు పార్టీ వీడటంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా.. సర్దుబాటు చేసుకోగలిగారు. మైనారిటీల మద్దతుతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. కిషన్‌రెడ్డి పోటీకి దూరంగా ఉండటంతో.. మాజీ మంత్రి కృష్ణయాదవ్‌కు భాజపా అవకాశం ఇచ్చింది. ఆయనకున్న పరిచయాలు, పార్టీ క్యాడర్‌తో బలమైన అభ్యర్థిగా మారారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి బరిలో ఉన్నారు. భారాస నుంచి మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడం కలిసి వస్తుందనే ధీమాతో ప్రచారం చేస్తున్నారు.


యాకుత్‌పుర

ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ప్రస్తుతం ఆ పార్టీ... ఎంబీటీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఇక్కడ కొన్ని దఫాలుగా ఎంఐఎం... అభ్యర్థులను మారుస్తూ వస్తోంది. ఈసారి కూడా ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రీ స్థానంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ను నిలబెట్టింది. ఎంబీటీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్‌ బరిలో ఉన్నారు. ఆయన ప్రజాదర్బార్‌ పేరిట సేవా కార్యక్రమాలను చేపడుతూ పేరు సంపాదించారు. భారాస నుంచి సామ సుందర్‌రెడ్డి, భాజపా నుంచి వీరేంద్రయాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి కె.రవిరాజు పోటీ చేస్తున్నారు.


నాంపల్లి

నియోజకవర్గం ఏర్పడిన 2009 నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎం... ఈసారి మాజీ మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌ను బరిలోకి దింపింది. ఫిరోజ్‌ఖాన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరోసారి తలపడుతున్నారు. తీవ్ర పోటీ ఉండడంతో.. తమ అభ్యర్థి గెలుపు కోసం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. భారాస నుంచి సీహెచ్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, భాజపా నుంచి రాహుల్‌చంద్ర బరిలో ఉన్నారు.


చార్మినార్‌

ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ను కాకుండా హైదరాబాద్‌ మాజీ మేయర్‌ జుల్ఫీకర్‌ను ఎంఐఎం రంగంలోకి దింపింది. న్యాయవాది అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి ముజిబుల్లా షరీఫ్‌ నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. భాజపా తరఫున మేఘారాణి బరిలో ఉన్నారు. వీరు ముగ్గురూ ఇక్కడ మొదటిసారి పోటీ చేస్తున్నారు. భారాస నుంచి సలావుద్దీన్‌ లోది పోటీ చేస్తున్నారు.


మలక్‌పేట

ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల నాలుగోసారి ఎంఐఎం నుంచి పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున భాగ్యనగర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ భాజపా తరఫున ఇద్దరు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి స్థిరాస్తి వ్యాపారి షేక్‌ అక్బర్‌ పోటీ చేస్తున్నారు. పార్టీ క్యాడర్‌ లేకపోవడం కొంత ప్రతికూలంగా ఉంది. భారాస అభ్యర్థిగా తీగల అజిత్‌రెడ్డి ఉన్నారు.


మహేశ్వరం

రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా  ఇంద్రారెడ్డి(భారాస) మొత్తంగా మూడోసారి మహేశ్వరంలో విజయం సాధించేందుకు కృషిచేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన, ఇంటర్‌, డిగ్రీ, న్యాయ కళాశాలల ఏర్పాటును ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కందుకూరు వరకు మెట్రోరైల్‌ వేస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీనియర్‌ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. తమ విజయం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు భాజపా అనుకూల పవనాలు తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఆ పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములుయాదవ్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు.


మేడ్చల్‌

కార్మిక శాఖ మంత్రి చామకూర  మల్లారెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించేందుకు నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. మేడ్చల్‌ పరిధిలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో భారాస నాయకులే ఛైర్మన్లుగా ఉన్నందున తన గెలుపు ఖాయమంటున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌యాదవ్‌... బీసీ, ఎస్సీ, మైనార్టీ ఓట్లతోపాటు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అండతో విజయం సాధిస్తానని చెబుతున్నారు. భాజపా అభ్యర్థి ఏనుగు సుదర్శన్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.పట్టణ ప్రాంతమూ అధికంగా ఉండడంతో పార్టీ సంప్రదాయ ఓట్లు తనకు పడతాయని
భావిస్తున్నారు.


చేవెళ్ల (ఎస్సీ)

అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తనను మళ్లీ గట్టెక్కిస్తాయని చేవెళ్ల భారాస ఎమ్మెల్యే కాలే యాదయ్య భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా భీంభరత్‌.. తొలిసారి బరిలో దిగినా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల్లో ఎమ్మెల్యేపై, భారాస ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, తాను విజయం సాధిస్తానని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.రత్నం... భారాస టికెట్‌ దక్కకపోవడంతో భాజపాలో చేరి పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ సంప్రదాయ ఓట్లు, తాను గతంలో చేసిన అభివృద్ధి పనులు  గెలిపిస్తాయని అంటున్నారు.


ఇబ్రహీంపట్నం

భారాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వరుసగా నాలుగోసారి విజయానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుతోపాటు చేసిన అభివృద్ధి పనులతో గెలుస్తానని చెబుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మరోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన, ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు మున్సిపాలిటీల ఛైర్మన్లు కాంగ్రెస్‌ వారే కావడం తనకు కలిసివస్తుందని రంగారెడ్డి నమ్ముతున్నారు. భాజపా అభ్యర్థిగా నోముల దయానంద్‌గౌడ్‌ పోటీ చేస్తున్నారు.


పరిగి

ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి (భారాస) రెండోసారి విజయానికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి పనులు తన గెలుపునకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. మహేశ్‌రెడ్డి ప్రజలకు ఏమీ చేయలేదని, అభివృద్ధి పనులు సక్రమంగా పూర్తికాలేదని కాంగ్రెస్‌ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపిస్తూ ఓట్లడుగుతున్నారు. భాజపా తరఫున కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతికిరణ్‌ బరిలో ఉన్నారు. భాజపా సంప్రదాయ ఓట్లపై నమ్మకంతో ఉన్నారు.


శేరిలింగంపల్లి

రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లిలో హ్యాట్రిక్‌ విజయానికి అరికెపూడి గాంధీ (భారాస) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  చేసిన అభివృద్ధి పనులు, అర్హులకు రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ... తన విజయంలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న   జగదీశ్వర్‌గౌడ్‌.. మాదాపూర్‌ కార్పొరేటర్‌. ఆయన భార్య హఫీజ్‌పేట్‌ కార్పొరేటర్‌. దీంతో ఈ రెండు డివిజన్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఎమ్మెల్యే గాంధీ వ్యవహారశైలిపై లోలోపల అసంతృప్తిగా ఉన్న ప్రజలు తనకే ఓట్లు వేస్తారని చెబుతున్నారు. భాజపాపై ప్రజల్లో ఉన్న నమ్మకం, తన తండ్రి భిక్షపతియాదవ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇక్కడ చేసిన అభివృద్ధి పనులతో విజయం సాధిస్తానని ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్‌యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


రాజేంద్రనగర్‌

ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ (భారాస) వరుసగా నాలుగోసారి గెలిచేందుకు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని పారిశ్రామికవాడలు, మురికివాడల్లోని ప్రజలు మరోసారి మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ ఛైర్మన్‌ కస్తూరి నరేందర్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలో మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌పై అంతర్గతంగా అసంతృప్తి ఉందని, అది తమకు కలసి వస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. భాజపా అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు. కార్వాన్‌ కార్పొరేటర్‌ స్వామియాదవ్‌ను ఎంఐఎం పోటీలో నిలిపింది.


ఎల్బీనగర్‌

అత్యధికంగా 48 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ఈ స్థానంలో వరుసగా రెండోసారి విజయం సాధించేందుకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (భారాస) కృషి చేస్తున్నారు. పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణంతో ట్రాఫిక్‌ చిక్కుల నుంచి ఉపశమనం కల్పించానని ప్రచారం చేస్తున్నారు. ఇతర అభివృద్ధి పనులనూ ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌     మధుయాస్కీగౌడ్‌ తొలిసారి ఈ స్థానంలో పోటీచేస్తున్నారు. నియోజకవర్గంలోని బీసీలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. భారాసపై అంతర్గతంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని, విజయం సాధిస్తానని మధుయాస్కీ నమ్ముతున్నారు. భాజపా అభ్యర్థి సామ రంగారెడ్డి.. పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని 9 డివిజన్లలో ఉన్న భాజపా కార్పొరేటర్ల సాయంతో ప్రచారం చేస్తున్నారు.


కూకట్‌పల్లి

మాధవరం కృష్ణారావు (భారాస) హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లిలోని అతి పెద్ద కాలనీ కేపీహెచ్‌బీ, సర్దార్‌పటేల్‌నగర్‌, వసంత్‌నగర్‌, కూకట్‌పల్లి మండలంలో భారాసకున్న బలమైన ఓటుబ్యాంకుపై నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడి అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పించానని చెబుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేష్‌ అనూహ్యమైన ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలపై దృష్టిసారించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భాజపాతో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రేమ్‌కుమార్‌.. గెలుపుపై నమ్మకంతో గట్టిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.


కుత్బుల్లాపూర్‌

హ్యాట్రిక్‌ విజయం సాధించేందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్‌ (భారాస) కష్టపడుతున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని విశ్వసిస్తున్నారు. పైవంతెనల నిర్మాణం, జీడిమెట్ల పారిశ్రామికవాడలో సమస్యల పరిష్కారం తదితరాలను ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కొలను హన్మంత్‌రెడ్డి  కాలనీలు, మురికివాడలు, పారిశ్రామిక వాడల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మూతపడిన ఫ్యాక్టరీల్లోని కార్మికులకు ఎమ్మెల్యే ఎలాంటి న్యాయం చేయలేదని చెబుతున్నారు. భాజపా అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు ఓడిపోయిన కూన శ్రీశైలంగౌడ్‌.. మరోసారి పోటీచేస్తున్నారు.


ఉప్పల్‌

భారాసకు రెండోసారి గెలుపు అందించాలన్న లక్ష్యంతో బండారు లక్ష్మారెడ్డి బరిలో దిగారు. నియోజకవర్గంలో బలహీనవర్గాల, మురికివాడల ప్రజల ఓట్లు తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి... లక్ష్మారెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తుండడం సానుకూలంగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి   ఎం.పరమేశ్వర్‌రెడ్డికి గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. భాజపా అభ్యర్థి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌... 2014 ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి చేసిన అభివృద్ధి పనులు ఈసారి తన విజయానికి దోహదపడతాయని చెబుతున్నారు.


మల్కాజిగిరి

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుబాటులో ఉండడం కలిసివస్తాయని నమ్ముతున్నారు. తనతోపాటు భారాసలో ఉన్న నాయకులు వెన్నంటి రావడం, కాంగ్రెస్‌ క్యాడర్‌ మద్దతుతో విజయం సాధిస్తానని భావిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ పోటీచేసిన అనుభవం, మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ ఇటీవల భారాసలో చేరికతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్‌ నేత ఎన్‌.రామచంద్రరావు తన వ్యక్తిగత గుర్తింపుతో ప్రచారం చేస్తున్నారు.


వికారాబాద్‌ (ఎస్సీ)

ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ (భారాస) వరుసగా రెండోసారి గెలవాలన్న లక్ష్యంతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధితోపాటు వికారాబాద్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం వంటి అంశాలు విజయాన్ని అందిస్తాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌.. గెలుపు కోసం పట్టుదలతో పనిచేస్తున్నారు. పార్టీ అగ్రనేతల పర్యటనల నేపథ్యంలో పోలింగ్‌శాతం పెరుగుతుందని నమ్ముతున్నారు. భాజపా అభ్యర్థి పెద్దింటి నవీన్‌కుమార్‌.. ఆ పార్టీ సంప్రదాయ ఓట్లపై నమ్మకం పెట్టుకున్నారు. ఎమ్మెల్యేపై ప్రజల్లో అంతర్గతంగా వ్యతిరేకత ఉందని, ఆ ఓట్లు తనకే పడతాయని చెబుతున్నారు.


తాండూరు

ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి (భారాస).. వరుసగా రెండోసారి ఎన్నికవ్వాలన్న లక్ష్యంతో  ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా తాను చేసిన పనులు గెలిపిస్తాయని అంచనా వేస్తున్నారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రచారం చేయడం సానుకూల అంశమని విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బి.మోహన్‌రెడ్డి విజయం సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న జనసేన పార్టీ తెలంగాణ బాధ్యుడు ఎన్‌.శంకర్‌గౌడ్‌.. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రచారం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాలు: 14
ఎస్సీ రిజర్వుడు: 02
2018లో ఫలితాలు
భారాస: 11
కాంగ్రెస్‌: 3


హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఈనాడు ప్రతినిధులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని