Hyderabad: ఆ చీటీలే కరెన్సీ.. చెల్లింపులకు నయా మార్గం

నగరంలో ప్రచారపర్వం ఉద్ధృతంగా సాగుతోంది. ర్యాలీలు, సభలకు భారీఎత్తున జనసమీకరణ జరుగుతోంది. ఎన్నికల అధికారులకు చిక్కకుండా.. పోలీసులకు పట్టుబడకుండా వీరికి చెల్లింపులు చేస్తున్నారు నాయకులు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాజధానిలో రోజూ కనీసం 100 ప్రాంతాల్లో వాహనతనిఖీలు చేపడుతున్నారు.

Updated : 29 Nov 2023 08:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ప్రచారపర్వం ఉద్ధృతంగా సాగుతోంది. ర్యాలీలు, సభలకు భారీఎత్తున జనసమీకరణ జరుగుతోంది. ఎన్నికల అధికారులకు చిక్కకుండా.. పోలీసులకు పట్టుబడకుండా వీరికి చెల్లింపులు చేస్తున్నారు నాయకులు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాజధానిలో రోజూ కనీసం 100 ప్రాంతాల్లో వాహనతనిఖీలు చేపడుతున్నారు. భారీఎత్తున నగదు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటువంటి క్లిష్ల పరిస్థితుల్లో నేతలు కొత్తదారులు వెతికారు. నగదు చెల్లింపులు.. మద్యం.. బిర్యానీ కోసం చీటీలు అందజేస్తున్నారు.

స్థానిక ఓటర్లకే అవకాశం.. నగరంలో బడా నేతలు హాజరయ్యే బహిరంగసభలు, ర్యాలీల్లో బలప్రదర్శనకు అడ్డాకూలీలను తీసుకొస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రచారం, సమావేశాలకు స్థానిక ఓటర్లకే ప్రాధాన్యతనిస్తున్నారు. వీళ్లను ప్రచారంలో వినియోగించటం వల్ల ఆ ఓట్లన్నీ తమ పార్టీకే పోలవుతాయని నాయకులు అంచనా వేసుకుంటున్నారు. పార్టీ గుర్తు కూడా వారి బుర్రల్లో నిలిచిపోతుందని భావిస్తున్నారు. ఈ ప్రణాళిక పోలింగ్‌ తేదీ నాడు తమకు మేలు చేస్తుందంటున్నారు. డివిజన్‌ వారీగా ప్రచారానికి వచ్చే మహిళలు, పురుషులు, యువతీ, యువకులకు వేర్వేరుగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. అక్కడ జరిగే పార్టీ కార్యకలాపాలు, గల్లీనేతల కదలికలను ఎప్పటికప్పుడు గ్రూప్‌లో పోస్టు చేస్తూ సమాచారం రాబడుతున్నారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల వెంట ఎవరెవరు ఉండాలనేది ముందుగానే నిర్ణయిస్తున్నారు. ప్రచారం పూర్తవగానే వచ్చిన వారి చేతికి నగదు వివరాలున్న చీటీలు చేతికిస్తున్నారు. వీటిని ఆయా పార్టీలు/అభ్యర్థులకు అనుకూలమైన మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌, పచారీ దుకాణాలు, హోటళ్ల వద్ద చూపితే వెంటనే నగదు ఇస్తున్నారు. ఈ స్లిప్పుల ఆధారంగా నిర్వాహకులు నగదు వివరాలు నమోదు చేసుకుంటారు. పోలింగ్‌ ముగిశాక సంబంధిత పార్టీల నాయకుల నుంచి తీసుకుంటారు. దీనికి ప్రతిఫలంగా చిరువ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులకు 2-3శాతం కమీషన్‌ కూడా ఇస్తున్నట్టు సమాచారం. గుట్టుగా జరిగే ఈ వ్యవహారంతో తమ పని తేలిక అవుతుందని, ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌కు దొరుతామనే భయం లేదంటూ ఖైరాతాబాద్‌కు చెందిన ఒక నాయకుడు వివరించారు. ఉదయం, సాయంత్రం 2-3 గంటలు సమయం కేటాయిస్తే రూ.300 వరకూ ఇస్తున్నారని ఆనంద్‌నగర్‌కాలనీకు చెందిన ఒక మహిళ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని