icon icon icon
icon icon icon

Malkajgiri: మల్కాజిగిరి సెంటిమెంట్‌.. మూడు ఎన్నికల్లో సంచలనాలు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం మూడు ఎన్నికల్లో సంచనాలు సృష్టించింది. ఇక్కడి నుంచి ఎన్నికైన లోక్‌సభ సభ్యులకు అదృష్టం కలిసివస్తుందన్న సెంటిమెంట్‌ రాజకీయ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.

Published : 06 Dec 2023 07:09 IST

సర్వే కేంద్ర మంత్రి, మల్లారెడ్డి రాష్ట్రమంత్రి, రేవంత్‌ సీఎం
లోక్‌సభ సభ్యులైన ముగ్గురినీ వరించిన అదృష్టం

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం మూడు ఎన్నికల్లో సంచనాలు సృష్టించింది. ఇక్కడి నుంచి ఎన్నికైన లోక్‌సభ సభ్యులకు అదృష్టం కలిసివస్తుందన్న సెంటిమెంట్‌ రాజకీయ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 3 ఎన్నికలు జరిగింది మూడుసార్లయినా ఇక్కడి నుంచి గెలిచిన సర్వే సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డిలు తమ రాజకీయ జీవితంలో కీలక మెట్టును అధిరోహించారు. మంత్రులు, ముఖ్యమంత్రి హోదాను పొందారు.

  • 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ ఆ లోక్‌సభ నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీచేసి 93వేల మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత 2012లో కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా తొలిసారిగా మల్కాజిగిరి నుంచే లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. తెలంగాణలో తెదేపా నుంచి గెలిచిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి మాత్రమే. రాజకీయ సమీకరణాలతో ఆయన 2016లో భారాసలో చేరారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తరువాత రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన రాజకీయ ఉన్నతికి మల్కాజిగిరి లోక్‌సభ ఒక మెట్టులాంటిదని మల్లారెడ్డి చెబుతుంటారు.
  • 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి ఓడిపోయిన రేవంత్‌రెడ్డి.. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. ఎంపీగా కొనసాగుతున్నప్పుడే రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు. సీఎల్పీ నాయకుడిగా ఎంపికై ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img