icon icon icon
icon icon icon

P Sravanthi: మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్‌.. పాల్వాయి స్రవంతి రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి రాజీనామా చేశారు.

Updated : 11 Nov 2023 14:24 IST

మునుగోడు: కాంగ్రెస్‌ పార్టీకి దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నాలుగు పేజీల లేఖను అధిష్ఠానానికి పంపారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని ప్రకటించడంతో ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలు అవాస్తవమని ఇటీవల పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi) కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. ఇంతలోనే ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం గమనార్హం. కాగా, మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 

ప్రెస్‌మీట్‌లో భావోద్వేగం

కాంగ్రెస్‌ పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో స్రవంతి భావోద్వేగానికి గురయ్యారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడారు. ‘‘నా రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించా. పార్టీని వీడేందుకు దారితీసిన పరిస్థితులు, నాయకత్వం తీరుపై లేఖలో వివరించాను. కొంతకాలంగా పదవులు, టికెట్లు కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడాల్సి రావడం బాధగా ఉంది. మా తండ్రి 60 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో ప్రయాణం చేశారు. వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ఆయన పాత్ర చాలా గొప్పది.

కాంగ్రెస్ కార్పొరేట్, బ్రోకర్‌ పార్టీగా మారిపోయింది

కాంగ్రెస్ కార్పొరేట్, బ్రోకర్‌ పార్టీగా మారిపోయింది. కాంగ్రెస్ చచ్చిపోయిందని పార్టీని వీడి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి మళ్లీ వస్తే కండువా కప్పారు. 24 గంటల్లో మునుగోడు టికెట్ ప్రకటించారు. ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న నాకు కనీసం మాట కూడా చెప్పలేదు. పీసీసీ అధ్యక్షుడు స్థానంలో ఉన్న వ్యక్తి అన్నీ తుంగలో తొక్కేశారు. ప్రజా పక్షాన నిలబడేది భారాస అని భావిస్తున్నా. మంత్రి జగదీశ్‌ రెడ్డి మా ఇంటికి వచ్చి భారాసలోకి ఆహ్వానించారు. దీనిపై రేపో మాపో నిర్ణయం వెల్లడిస్తా’’ అని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img