icon icon icon
icon icon icon

కోడ్‌ నీడలో కల్యాణాలు..!

కల్యాణాల నిర్వహణకు ఎన్నికల కోడ్‌ ఓ పరీక్ష పెడుతోంది. కట్నకానుకాల మాట దేవుడెరుగు కనీసం పెట్టుబడి చీరలు కూడా ఒకేసారి తీసుకెళ్లడానికి జంకుతున్నారు. 

Published : 12 Nov 2023 13:20 IST

మధిర పట్టణం, న్యూస్‌టుడే

 

కల్యాణాల నిర్వహణకు ఎన్నికల కోడ్‌ ఓ పరీక్ష పెడుతోంది. కట్నకానుకాల మాట దేవుడెరుగు కనీసం పెట్టుబడి చీరలు కూడా ఒకేసారి తీసుకెళ్లడానికి జంకుతున్నారు. పెళ్లిళ్లకు నగలు, వస్త్రాలు భారీ ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వాసులు ప్రధాన పట్టణాలతోపాటు సమీపంలోని పెద్ద నగరాలకు వెళుతుంటారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా పెట్టడంతో కొనుగోలు చేసిన వాటికి తగిన ఆధారాలు చూపేందుకు అవస్థలే పడాల్సి వస్తోందని ఆయా కుటుంబాలవారు వాపోతున్నారు. 

  • మధిర పురపాలకంలోని ఉపాధ్యాయ కాలనీకి చెందిన ఓ ఇంట్లో ఈనెల వివాహం ఉంది. పెళ్లి దుస్తులు, నగలు కొనేందుకు విజయవాడకు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వచ్చిందని ఆ కుటుంబీకులు వాపోయారు. పెద్దపెద్ద దుకాణాల్లో నగదునే చెల్లించాల్సి వస్తుంది. దీంతో విజయవాడలోని బంధువుల నుంచి నగదు  తీసుకుని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
  • నేలకొండపల్లిలోని ఓ కుటుంబ సభ్యుడి వివాహం ఖమ్మం కల్యాణమండపంలో పది రోజుల్లో జరుగనుంది. తమ బంధువులకు బహూకరించేందుకు వంద చీరలు వరకు కొనుగోలు చేసి స్వగ్రామంలోని ఇంట్లో ఉంచారు. ఇక్కడ నుంచి ఖమ్మం కల్యాణ మండపానికి చీరలు తీసుకెళ్లడం ప్రహసనంగా మారింది. బంధుమిత్రుల ద్వారా ద్విచక్రవాహనాలపై రోజూ కొన్ని తరలిస్తున్నామని సదరు వ్యక్తి తెలిపారు.
  • మధిర మండలం సిరిపురం గ్రామంలో ఈనెల 20న వివాహం జరుగనుండగా ఆ ఇంటి వారు నగలు, వస్త్రాలు కొనుగోలు చేసేందుకు అవస్థలు పడ్డారు. నేరుగా నగదుతో వెళ్లే అవకాశం లేక స్నేహితుల వద్ద నుంచి క్రెడిట్, ఏటీఎం కార్డులు తీసుకుని వెళ్లామని వారు తెలిపారు. 

నవంబరులో భారీగా వివాహాలు

ఈ నెల 16 నుంచి శుభముహూర్తాలుండటంతో ఉమ్మడి జిల్లాలో వందలాది వివాహాలు జరుగనున్నాయి. పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం తెలుగు సంప్రదాయం. ఇందుకోసం   రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేస్తుంటారు. ఒకరికంటే మరొకరు పోటీ పడుతూ హంగూఆర్భాటాలతో మూడు నుంచి ఐదు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు. రిటర్న్‌ గిఫ్ట్‌ల సంస్కృతి బాగా పెరిగింది. బంధుమిత్రులు భారీగా హాజరవుతుంటారు. వీటన్నింటిపైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.

నగలు, దుస్తుల రవాణాకు తిప్పలు

ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ కారణంగా రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద ప్రధాన రహదారుల్లో పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నగదు తరలింపు జరుగకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది. సాధారణంగా పెళ్లి దుస్తులు, నగలను హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, కొత్తగూడెంలలో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వంటతయారు చేసేవారికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. వంట తయారీకి అవసరమైన సరకులు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు అవుతున్నాయి. కల్యాణమండపం, డెకరేషన్స్, ఈవెంట్‌ నిర్వాహకులకు డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. దూరప్రాంతాలకు వెళ్లి అవసరమైన వాటిని కొనేందుకు ఇక్కట్లు పడుతున్నారు. సరైన ఆధారాలు చూపకుంటే   పట్టుబడిన నగదు వెంటనే చేతికి రావడంలేదు. శుభకార్యాలు   చేసుకుంటున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది.

ఆధారాలు చూపితే ఇబ్బందిలేదు-వసంత్‌కుమార్, మధిర సీఐ

వివాహ వేడుకలకు సంబంధించి తగు ఆధారాలుంటే ఇబ్బందిలేదు. ఎక్కువ మొత్తం నగదు పట్టుబడితే వాటికి సరైన ఆధారాలు చూపి తిరిగి పొందవచ్చు. కొనుగోలు చేసిన వాటి రసీదులు చూపి, ఎందుకోసం కొన్నారనే అంశాలు వివరించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img