icon icon icon
icon icon icon

JP Nadda: భాజపాకి, కుటుంబ పాలనకు మధ్యే ఈ ఎన్నికలు: జేపీ నడ్డా

ఈ ఎన్నికలు భాజపాకు, కుటుంబ పార్టీలకు మధ్య జరుగుతున్నాయని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

Updated : 19 Nov 2023 14:57 IST

నారాయణపేట: ఈ ఎన్నికలు భాజపాకి, కుటుంబ పార్టీలకు మధ్య జరుగుతున్నాయని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లోలాగానే తెలంగాణలో కూడా భాజపా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతోందని అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన భాజపా సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తుంటే కేసీఆర్‌ కుటుంబం దుర్వినియోగం చేస్తూ ప్రజలకు చేరనీయడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే కేసీఆర్‌ ఆ ప్రయోజనం ప్రజలకు అందకుండా చేశారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఓట్ల కోసమే ఇక్కడ ఉర్దూకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. భారాస అంటే భ్రష్టాచార్‌ రాక్షసుల సమితి అనే విషయాన్ని గుర్తించుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారింది. రూ.1.20లక్షలతో నిర్మించిన ఆ ప్రాజెక్టులోని ఓ బ్రిడ్జి ఇటీవల కుంగిపోయింది. భాజపా అధికారంలోకి రాగానే కేసీఆర్‌ అవినీతిపై విచారణ చేపట్టి జైలుకు పంపిస్తాం.

తెలంగాణ ప్రభుత్వం అవినీతిపరులమయంగా మారింది. మియాపూర్‌లో 4వేల కోట్ల భూ కుంభకోణం జరిగింది. సర్కారు భూములను అమ్మి అవినీతికి పాల్పడ్డారు. దళిత బంధు ఇచ్చి ఎమ్మెల్యేలు ఆ మొత్తంలో 30 శాతం కమీషన్‌ తీసుకున్నారు. ఈ 30 శాతం కమీషన్‌ ప్రభుత్వాన్ని ఈ నెల 30న సాగనంపాలి. భాజపా ప్రభుత్వాన్ని తీసుకురావాలి. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిధులు విడుదల చేస్తే ఆ మొత్తాన్ని పేదలకు చేరనీయలేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదు. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు. కేంద్రంలో మోదీ చెప్పిన పనులన్నీ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది. అక్కడ ఏ పథకాలూ అమలు కావడం లేదు. అక్కడ ఇచ్చిన ఒక్క గ్యారంటీని అమలు చేయలేదు. ఇక్కడ కూడా 6 గ్యారంటీలు ఇస్తామని ఆ పార్టీ చెబుతోంది. వాటిని నమ్మవద్దు’’ అని జేపీ నడ్డా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img