Prajwal Revanna: లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్‌ రేవణ్ణ ఇంటికి సిట్‌

Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) లుక్ అవుట్‌ నోటీసు జారీ చేసింది.

Published : 04 May 2024 14:08 IST

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ (Prajwal Revanna)లపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కర్ణాటక (Karnataka) సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు శనివారం హాసనలోని ప్రజ్వల్‌ ఇంటికి వెళ్లారు. అభ్యంతర వీడియోల దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నించనున్నారు.

మరోవైపు, ప్రజ్వల్‌పై రెండోసారి లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. ఆయన తండ్రి రేవణ్ణ కూడా విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నందున ఆయనకూ ఈ నోటీసులిచ్చినట్లు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌).. ఇటీవల వీరిద్దరినీ విచారణకు పిలిచింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ కోరారు. ఇందుకు తిరస్కరించిన అధికారులు.. ఆయనపై తొలిసారి లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేశారు. ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్‌ దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలు ఉంటుంది.

అంతేలేని ప్రజ్వల్‌ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు

సిద్ధరామయ్యకు రాహుల్‌ లేఖ..

ఈ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శనివారం లేఖ రాశారు. ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ప్రజ్వల్‌ కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో పారదర్శక విచారణ జరిగేలా మేం కృషి చేస్తాం’’ అని తెలిపారు. మరోవైపు దర్యాప్తు వివరాలను తెలుసుకునేందుకు సీఎం నేడు సిట్‌ అధికారులతో సమావేశమయ్యారు.

ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నుంచి పోటీ చేసిన ప్రజ్వల్‌పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడమే గాక.. బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ప్రజ్వల్‌పై అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని