David Warner: డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్‌ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్‌ ఫ్రేజర్

డేవిడ్ వార్నర్‌ మైదానంలో దూకుడుగా ఆడేస్తాడు. సోషల్ మీడియాలో వీడియోలతో అభిమానులను అలరిస్తాడు. భారత క్రికెట్‌ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో వార్నర్ ఒకడు.

Updated : 04 May 2024 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: డేవిడ్ వార్నర్‌ (David Warner).. తెలుగు క్రికెట్ అభిమానులకు సుపరిచితుడు. అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా తెలుసు. అలానే టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన పాటలు, డైలాగులకు తన హావభావాలను జోడించి సోషల్ మీడియాలో సందడి చేసేవాడు. ఇప్పుడు దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. తెలుగు చిత్రాలను మాత్రం వదలడం లేదు. అదేవిధంగా బాలీవుడ్‌కు చెందిన డైలాగులకూ వీడియోస్ చేస్తూ వైరల్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌పై దిల్లీ జట్టు సహచరుడు జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌తో జరిగిన సరదా సంభాషణ సందర్భంగా ఫ్రేజర్‌ మాట్లాడాడు. 

‘‘నేను ఇప్పటివరకు కలిసిన చాలామంది క్రికెటర్లలో నిస్వార్థ ఆటగాడు డేవిడ్ వార్నర్. ప్రతిఒక్కరి కోసం అతడు టైమ్‌ను కేటాయించేవాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. ప్రతీ హోటల్‌లో నాకు కేవలం రెండు గదుల దూరంలోనే ఉంటాడు. ప్రతీ రోజు ఉదయం అతడితో కలిసి కాఫీ తాగేవాడిని. ఒక్కోసారి అతడిని చూస్తుంటే.. ఆస్ట్రేలియా పౌరుడిగా కంటే భారతీయుడిగానే అనిపిస్తాడు. అందుకే, వార్నర్ 70 శాతం ఇండియన్‌.. 30 శాతం ఆస్ట్రేలియన్‌ అని చెబుతా. నేను వార్నర్‌ గురించి అనుకున్న తొలి రోజుల్లో చాలా పొడవుగా ఉంటాడేమోనని ఊహించుకున్నా. కానీ, అంత ఎత్తు లేడు. కానీ, అతడి మనసు చాలా గొప్పది. మేమిద్దరం క్యాప్‌ల కోసం గోల్ఫ్‌ ఆడేవాళ్లం. ఎవరు ఓడితే వాళ్లు గెలిచిన వ్యక్తికి క్యాప్‌ను కొనివ్వాలి. చాలాసార్లు తీవ్రమైన పోటీ ఉండేది. కానీ, టెక్నికల్‌గా నేను అతడి కంటే ఉత్తమమైన గోల్ఫర్‌ కావడంతో విజయం సాధించేవాడిని. వార్నర్‌ కూడా చాలా బాగా ఆడేవాడు. ఐపీఎల్‌ గురించి చాలా విన్నా. ఇక్కడ ప్రత్యక్షంగా పోటీని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నేను ఎప్పుడూ పెద్దగా అంచనాలు లేకుండానే ఆడేందుకు ప్రయత్నిస్తా’’ అని జేక్‌ తెలిపాడు. 

నా స్టోరీ అంతా వార్నర్‌కు తెలుసు: స్టబ్స్

‘‘డేవిడ్‌ వార్నర్‌ గురించి నాకేమీ తెలియదు. కానీ, నా స్టోరీ మొత్తం అతడికి తెలుసు. మంచి గోల్ఫర్. నేను ఐదు పాయింట్ల మీద ఉన్నప్పుడు కూడా నన్ను వెనక్కి నెట్టేసేవాడు. చాలా బాగా ఆడేవాడు. గోల్ఫ్ ఆడే సమయంలోనే కాకుండా.. మైదానం ఆవల కూడా చాలా ఫ్రీగా ఉంటాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌ను చాలా ఆస్వాదిస్తున్నా.  మన మీద చాలా అంచనాలు ఉంటాయి. వాటిని అందుకొనే క్రమంలో ఒత్తిడి తప్పదు. అధిగమించి పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉంటుంది’’ అని స్టబ్స్‌ వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని