India- US: ‘భారత్‌ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్‌ వ్యాఖ్యలపై జైశంకర్‌ కౌంటర్‌!

విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్‌ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఖండించారు. భిన్న సమాజాలకు చెందిన పౌరుల కోసం భారత్‌ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయన్నారు.

Published : 04 May 2024 16:19 IST

దిల్లీ: విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్‌ భయపడుతుందని అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) పేర్కొన్న విషయం తెలిసిందే. చైనా, రష్యా, జపాన్‌లదీ అదే పరిస్థితి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే బైడెన్‌ వ్యాఖ్యలను భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) తీవ్రంగా ఖండించారు. భిన్న సమాజాలకు చెందిన పౌరుల కోసం భారత్‌ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అదేవిధంగా దేశ ఆర్థికవ్యవస్థ కుంటుపడటం లేదని స్పష్టం చేశారు.

‘‘భారత్‌ చాలా ప్రత్యేకమైన దేశం. వాస్తవానికి ప్రపంచ చరిత్రలోనే ఎటువంటి దాపరికం లేని సమాజం. వివిధ దేశాల నుంచి వ్యక్తులు ఇక్కడికి వస్తారు. వారి కోసం దేశం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయి. వారికి సదా స్వాగతం పలుకుతున్నాయి’’ అని జైశంకర్‌ తెలిపారు. ఈసందర్భంగా ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA)’ ప్రస్తావిస్తూ.. వేరే దేశాల్లో కష్టాల్లో ఉన్న ప్రజలు భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ఈ చట్టం అవకాశం కల్పించిందని తెలిపారు. దేశ స్వాగతపూర్వక ధోరణిని ఇది చాటుతోందన్నారు.

భారత్‌పై బైడెన్‌కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం

అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల గురించి మాట్లాడుతూ.. పాశ్చాత్య మీడియాలోని ఓ వర్గం ఈ అంశం కవరేజీలో పక్షపాతం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇది సైద్ధాంతికపరమైన చర్యేనని, నిష్పాక్షిక రిపోర్టింగ్ కాదన్నారు. ప్రపంచ పరిణామాలను రూపొందించాలని ఈ వర్గం కోరుకుంటోందని, ఈ క్రమంలోనే దిల్లీని కూడా లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ఇదిలాఉండగా.. మిత్ర దేశాలైన భారత్‌, జపాన్‌లను తక్కువ చేసేలా బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం ఇప్పటికే వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయా దేశాలపై అమితమైన గౌరవం ఉందని, ఆ వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని