డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!

ఉద్యోగం కోసం అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకుంటుంటారు. రిక్రూటర్‌ మెప్పు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు.

Updated : 04 May 2024 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం సవాలుగా మారిపోయింది. ఆకట్టుకొనేలా రెజ్యూమెను రూపొందించడమే కాదు.. రిక్రూటర్‌ను మెప్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగార్థులు. కొందరైతే ఎంతోకొంత ‘ముట్టచెప్పేందుకూ’ వెనకాడటం లేదు. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వ్యవస్థాపకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

వింగిఫై సంస్థ వ్యవస్థాపకుడైన పరాస్‌ చోప్రాకు ఇటీవల ఓ ఉద్యోగ దరఖాస్తు వచ్చింది. అందులో వచ్చిన సందేశాన్ని చూసిన ఆయన అవాక్కయ్యారు. ‘‘నేను వింగిఫైలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మీకోసం ప్రత్యేకమైన ప్రతిపాదన తీసుకొచ్చాను. నన్ను నియమించుకుంటే 500 డాలర్లు (సుమారు రూ.40,000) ఇస్తాను. ఒక వారంలో నన్ను నేను నిరూపించుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగించండి. ఆ డబ్బు మీ వద్దే ఉంచుకోవచ్చు. మీ టీమ్‌ సభ్యుల సమయం వృథా చేయకూడదని ఇలా చెబుతున్నా’’ అని ఆ సందేశంలో రాసుంది. ‘మీ తిరస్కరణ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ తన దరఖాస్తును ముగించాడు.  

రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం

దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను చోప్రా ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. అందరి దృష్టినీ ఆకర్షించాడు అంటూ క్యాప్షన్‌ జోడించారు. దీనిపై నెటిజన్లు తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. కొందరేమో నిజంగా ఈ వ్యక్తి అందరి దృష్టి తనవైపు తిప్పుకొనేలా చేశారని చెబుతుంటే.. మరికొందరేమో ఇది సరైన పద్ధతి కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈఓకు ఇలాంటిదే ఓ లెటర్‌ వచ్చింది. తనను కంపెనీలో చేర్చుకోవాలంటూ సీవీతో పాటు పిజ్జాను కూడా పంపించాడు ఓ అభ్యర్థి. కాగా.. వింగిఫై భారత్‌కు చెందిన కంపెనీనే. 2009లో చోప్రా వింగిఫైను ప్రారంభించారు. ఈయన ఫోర్బ్స్-30, అండర్ 30 జాబితాలో రెండుసార్లు చోటు దక్కించుకున్నారు. వింగిఫైతో పాటు VWO స్థాపించింది కూడా ఈయనే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని