T20 WC 2024: టీ20ల్లో ‘యాంకర్‌’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్‌లో గేర్లు ఎక్కువే: మూడీ

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ  (Virat Kohli) మళ్లీ పొట్టి కప్‌ బరిలోకి దిగబోతున్నాడు. ఈసారైనా తన ప్రపంచ కప్‌ కలను నెరవేర్చుకోవాలంటే కీలకమైన మూడో స్థానంలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

Updated : 04 May 2024 16:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన టీమ్‌ను వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేసింది. రింకు సింగ్, శుభ్‌మన్‌ గిల్‌ను ట్రావెల్ రిజర్వ్‌ కేటగిరీలో ఉంచింది. సీనియర్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషిస్తాడనే ఆశాభావాన్ని కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు. అయితే, ఐపీఎల్ 17వ సీజన్‌లో కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ కోచ్ టామ్‌ మూడీ, భారత మాజీ ఆటగాడు శ్రీశాంత్ ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌కు ఏ స్థానంలో వస్తే బాగుంటుందనే అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమయంలో విరాట్‌ కీలకమైన మూడో స్థానంలో వచ్చి ‘యాంకర్‌’ పాత్రను పోషిస్తాడని శ్రీశాంత్ వ్యాఖ్యానించగా.. అసలు అలాంటి పదమే పొట్టి ఫార్మాట్‌లో లేదని మూడీ స్పష్టం చేశాడు. ప్రతి బ్యాటర్‌ దూకుడుగా ఆడాల్సిందేనని తెలిపాడు. 

‘‘శ్రీశాంత్‌ వాడుతున్న అలాంటి పదం తప్పు. టీ20 ఫార్మాట్‌లో దానికి చోటే లేదు. విరాట్ వాటిని పక్కన పెట్టేయాలి. అతడి బ్యాటింగ్‌లో చాలా గేర్లు ఉంటాయి. వాటిపై తీవ్రంగా శ్రమించాలి. ఓవర్‌కు కనీసం 9 నుంచి 11 పరుగులు చేయగల అనుభవం అతడి సొంతం. ఆ రన్‌రేట్‌ను కొనసాగించగల సత్తా ఉంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఓపెనర్‌గా వచ్చి హాఫ్ సెంచరీలతో అలరించాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ అతడి నుంచి ఇలాంటి ఆటను తప్పకుండా చూస్తామనే నమ్మకం ఉంది’’ అని మూడీ వెల్లడించాడు. 

పాండ్యను పక్కన పెట్టాలి..: డానిష్ కనేరియా

‘‘వరల్డ్ కప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో హార్దిక్‌ పాండ్య స్థానంలో రింకుసింగ్‌ను తీసుకుంటే బాగుండేది. నాణ్యమైన క్రికెటర్లను తయారుచేస్తున్న దేశంగా టీమ్ఇండియాకు మంచి పేరుంది. యశస్వి జైస్వాల్, రఘువంశీ, మయాంక్‌ యాదవ్, అభిషేక్ శర్మ.. ఇలా కుర్రాళ్లు వస్తున్నారు. రింకు సింగ్‌ కూడా ఇలాంటి క్రికెటరే. అతడిని పొట్టి కప్‌లో చూస్తామని ఆశించా. కానీ, అవకాశం ఇవ్వలేదు. దూబెను తీసుకోవడం మంచి నిర్ణయం. వీరిద్దరూ లోయర్‌ ఆర్డర్‌లో టీమ్‌ఇండియాకు బలంగా ఉండేవారు. హార్దిక్‌ను పక్కనపెడితే బాగుండేది. అతడి ఫామ్‌ కూడా గొప్పగా లేదు’’ అని పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్ డానిష్‌ కనేరియా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని