icon icon icon
icon icon icon

recruitment scam: ఆ కుంభకోణం గురించి పార్టీకి ముందే తెలుసు: టీఎంసీ మాజీ నేత సంచలన ఆరోపణలు

తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎన్నికల ముందు మరో పెద్దషాక్‌ తగిలింది. మొన్నటి వరకు పార్టీలో ఉన్న ఓ కీలక నేత తీవ్ర ఆరోపణలు చేశాడు. ఉద్యోగ నియామక కుంభకోణం పార్టీకి 2021లోనే తెలుసని తెలిపారు. 

Published : 02 May 2024 12:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమబెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఉద్యోగ నియామక కుంభకోణం గురించి టీఎంసీ (Trinamool Congress) సర్కారుకు ముందే తెలుసునని ఆ పార్టీ సస్పెండెడ్‌ నేత కునాల్‌ ఘోష్‌ సంచలన ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల క్రితం వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన్ను ఇటీవలే సస్పెండ్‌ చేసింది. 

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న వేళ కునాల్‌ ప్రకటన పార్టీకి ఇబ్బందికరంగా మారింది. పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి ఒకప్పుడు ఇతడు సన్నిహితుడిగా పేరుంది. కానీ, బుధవారం భాజపా లోక్‌సభ అభ్యర్థితో కలిసి వేదిక పంచుకోవడంతో పార్టీ ఆయనపై వేటు వేసింది.

‘‘ పాఠశాల విద్యాశాఖ ఉద్యోగ నియామకాల్లో భారీగా డబ్బు వసూళ్లు, అవినీతి చోటు చేసుకొంటోందన్న విషయం పార్టీకి బాగా తెలుసు. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికే టీఎంసీ నాయకులకు దీనిపై సమాచారం ఉంది. అందుకే ఆ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మంత్రి పార్థ చటర్జీని పాఠశాల విద్యాశాఖ నుంచి తప్పించి పారిశ్రామిక శాఖ అప్పగించారు’’ అని బెంగాల్‌కు చెందిన ఓ న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కునాల్‌ ఆరోపించారు.  

ఇటీవలే కోలకతా హైకోర్టు స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌-2016లో జరిగిన నియామకాలు చెల్లవని పేర్కొంది. దాదాపు 26 వేల మంది ఉద్యోగులు జీతాలు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు టీఎంసీ నాయకత్వం మాత్రం 2022లో చటర్జీ అరెస్టు జరిగే వరకు ఈ కుంభకోణం విషయం తెలియదని పేర్కొంది. 

2022 జులైలో పార్థ చటర్జీని ఈడీ అరెస్టు చేసింది. అతడి స్నేహితురాలి ఇంట్లో భారీగా సొమ్మును స్వాధీనం చేసుకొంది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ నాయకులు మానిక్‌ భట్టాచార్య, జిబాన్‌ క్రిష్ణ షాలను ఈ కేసులో అరెస్టు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img