Glass Bridge: అబ్బురపరిచే గాజువంతెనలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే?

గాజు వంతెనలు (స్కైవాక్‌ బ్రిడ్జి) విదేశాల్లోనే కాదు మన దేశంలోనూ ఉన్నాయి. మరి ఇలాంటి అబ్బురపరిచే గాజువంతెనలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే?

Published : 12 Apr 2022 19:49 IST

ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరిగినట్టుగా అనిపిస్తుంటుంది. మరి అంత ఎత్తైన ప్రదేశంలో గాజుపై నడవమంటే.. ఓ సాహసమనే చెప్పుకోవాలి. అలాంటి గాజు వంతెనలు (స్కైవాక్‌ బ్రిడ్జి) విదేశాల్లోనే కాదు మన దేశంలోనూ ఉన్నాయి. మరి అబ్బురపరిచే గాజువంతెనలు ఎక్కడెక్కడ ఉన్నాయో? వాటి విశేషాలేంటో తెలుసుకుందామా..


పెల్లింగ్‌, సిక్కిం

సిక్కిం రాష్ట్రంలోని పెల్లింగ్‌ నగరంలో నిర్మించిన గ్లాస్‌ స్కైవాక్‌ దేశంలోనే మొదటిది. దీన్ని 2018లో ప్రారంభించారు. సముద్ర మట్టానికి 7200 అడుగుల ఎత్తులో.. 137 అడుగుల ఎత్తైన చెన్రెజిగ్ విగ్రహానికి కుడివైపున ఈ గాజువంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అద్భుతమైన హిమాలయాల మధ్య గ్లాస్ స్కైవాక్‌పై నడిస్తే ఆ అనుభూతి వేరేలా ఉంటుందని సందర్శకులు చెబుతుంటారు. ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగానూ పరిఢవిల్లుతోంది. 


రాజ్‌గిర్‌, బిహార్‌

దేశంలో రెండో స్కైవాక్‌ బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉంది. భూమికి 250 అడుగుల ఎత్తులో 85 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో ఈ గాజువంతెనను నిర్మించారు. అయితే, ఈ బ్రిడ్జి ఇంకొక వైపు కనెక్ట్‌ ఉండదు. చివరన 360 డిగ్రీల వ్యూ చూసే విధంగా రూపొందించారు. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కూడా దీనిని సందర్శించారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైనా నేచర్‌ పార్క్‌, జూ సఫారీ వంటి వాటితో పాటు స్కైవాక్‌ బ్రిడ్జి కూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీనిని సందర్శించడానికి విదేశీ పర్యాటకులూ వస్తుంటారు.


ఒకటి కాదు చైనాలోనే రెండు..

ప్రపంచంలోనే  గాజుతో తయారుచేసిన స్కైవాక్‌ బ్రిడ్జిలకు చైనా ఎంతో ప్రసిద్ధి. ఆదేశంలో ఇప్పుడు ఇవే ప్రధాన పర్యాటక ప్రదేశాలుగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి వంతెనలు చైనాలో రెండు ఉన్నాయి. అందులో ఒకటి జాన్‌జియాజీ గ్రాండ్‌ కెన్‌యాన్‌ బ్రిడ్జి. చైనా రాజధాని బీజింగ్ లోని హునన్ ప్రావిన్స్ లో నిర్మించిన జాన్‌జియాజీ స్కైవాక్‌ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఎత్తయినది. ఇది భూమి నుంచి 300 మీటర్ల ఎత్తులో.. 430 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది.  దీనిపై ఒక కారు వెళ్లినా ఎలాంటి పగుళ్లు రాకుండా ఉండేత గట్టిగా దీన్ని నిర్మించారు. అలాగే.. చైనాకు నైరుతి దిశగా ఉన్న హుయాంగ్సు ప్రావిన్స్‌లో ‘బ్రేవ్‌ మెన్స్‌ బ్రిడ్జి’ పేరుతో మరొక స్కైవాక్‌ ఉంది. ఇది భూమికి 600 అడుగుల ఎత్తులో 900 అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. నేషనల్ జియోలాజికల్‌ పార్క్‌ సమీపంలో ఈ గాజువంతెన ఉండడం వల్ల పర్యాటకుల తాకిడి అధికంగానే ఉంటుంది. ఈ ప్రాంతం సుందరమైన జలపాతాలకు, సున్నపురాయి నిర్మాణాలకు ప్రసిద్ధి.


గ్లాసియర్ స్కైవాక్, కెనడా

కెనడాలోని జాస్పర్ నేషనల్ పార్క్‌ సమీపాన  గ్లాసియర్ స్కైవాక్‌ ఉంది. అక్కడి లోతైన లోయ సన్‌వప్తకు 280 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై నిల్చొని మంచుతో కప్పబడిన శిఖరాలు, హిమానీనదాలను వీక్షించవచ్చు.


డాచ్‌స్టెయిన్ గ్లాసియర్, ఆస్ట్రియా

ఆస్ట్రియా దేశంలో నిర్మితమైన డాచ్‌స్టెయిన్‌ గ్లాసియర్‌ కూడా ప్రముఖ గాజు వంతెనల్లో ఒకటి. ఇది పూర్తిగా మూసివేసినట్లు ఉండి అద్దాల గదిలా ఉంటుంది. కిందకి దిగడానికి 14 మెట్ల నిర్మాణం కూడా ఉంది. మెట్లపై నుంచి దిగుతుంటే లోయలోకి దిగుతున్నామేమో అన్న అనుభూతి కలుగుతోంది. ఇక్కడి నుంచి మంచుతో నిండిపోయిన పర్వతాలను వీక్షించడానికి సందర్శకులు పోటెత్తుతారు. 


సపా గ్లాస్ బ్రిడ్జ్, వియత్నాం

వియత్నాంలోని సపా నగరానికి 17కిలోమీటర్లలో సపా గ్లాస్‌ బ్రిడ్జ్‌ను నిర్మించారు. దీనిపై నుంచి 360 డిగ్రీల కోణంతో ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తుంటారు.


గ్రాండ్‌ కేన్యన్‌, అమెరికా

ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో గాజుతో నిర్మించిన స్కైవాక్‌ నిర్మాణం ఉంది. ఇది 70 అడుగుల పొడవుతో.. గుర్రపుడెక్క ఆకారంలో ఉంటుంది. దీనిపై నిల్చుంటే భూమి చివరి అంచున ఉన్నామేమో అన్న భావన కలుగుతోంది.


టవర్‌ బ్రిడ్జి, లండన్‌

లండన్‌లో నగరంలోనూ గాజుతో స్కైవాక్‌ను నిర్మించారు. దీన్నే టవర్‌ బ్రిడ్జి అని పిలుస్తారు. వీకెండ్‌లో ఫ్యామిలీతో సరదాగా గడపడానికి నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు. దీనిపై నుంచి కిందికి చూస్తే రహదారిపై వెళ్తున్న వాహనాలు, కిందనే నీటిలో ప్రయాణిస్తున్న పడవలను చూడవచ్చు.


చమోనిక్స్ స్కైవాక్, ఫ్రాన్స్‌

ఫ్రాన్స్‌ నగరంలో స్కైవాక్‌ బ్రిడ్జి లేదు కానీ, గాజుతో తయారు చేసిన స్కైరూమ్‌ లాంటి నిర్మాణం ఒకటి ఉంది. అద్దాల గదిలో నిల్చొని సుందరమైన పర్వత దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ గ్లాస్‌ రూమ్‌ని ‘స్టెప్‌ ఇన్‌ టూ ది వాయిడ్‌’అని పిలుస్తారు.


కాకినాడ, ఆంధ్రప్రదేశ్‌

వీటంతా పెద్దది కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో 45 అడుగుల పొడవుతో చిన్నపాటి స్కైవాక్‌ బ్రిడ్జి ఉంది. దీన్ని చిన్న వాగును దాటడానికి ₹2కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు