Archeological Discoveries : అపారమైన గుప్త నిధులు.. పెంపుడు శునకాలు తవ్వితీశాయి!

మానవులు అనేక చోట్ల చేపట్టిన తవ్వకాల వల్ల పురాతన నాగరికత (Civilization) ఆధునిక ప్రపంచానికి తెలిసింది. అలాగే కొన్ని దేశాల్లో శునకాలు (Dogs) తవ్విన చోట గుహ (Cave), అస్తిపంజరం (Skeleton), సమాధులు (Tombs), నిధులు (Treasure) ఇలా ఎన్నో ప్రత్యక్షమయ్యాయి. ఆ విశేషాలు తెలుసుకోండి.  

Updated : 24 May 2023 14:58 IST

శునకాలు (Dogs) విశ్వాసానికి మారుపేరు. వందల ఏళ్లుగా మానవులతో వాటి చెలిమి కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో శునకాలు చేసిన పనుల వల్ల పురాతన కట్టడాలు బయల్పడ్డాయి. అపారమైన నిధులు (Treasure) వెలుగు చూశాయి. ఆ సంగతుల గురించి చదివేయండి.

లాస్‌కాక్స్‌ కేవ్‌

ఫ్రాన్స్‌లో 1940 ప్రాంతంలో మార్సెల్‌ రావిడట్‌ అనే యువకుడు తన పెంపుడు శునకం ‘రోబోట్‌’తో కలిసి సరదాగా వాకింగ్‌ చేస్తున్నాడు. ఆ షికారు కొంతసేపు గడిచిన తరువాత రోబోట్‌ కనిపించలేదు. దాంతో మార్సెల్ కేకలు వేశాడు. దూరంగా దాని మూలుగు వినిపించడంతో పరిగెత్తుకుంటూ అక్కడకు వెళ్లాడు. తీరా చూస్తే సన్నని, ఇరుకైన 50 అడుగుల లోతు గొయ్యిలో అది కనిపించింది. ఎలాగోలా అందులోకి ప్రవేశించాడు. అది ఓ రాతి గుహ. లోపలి గోడలపై ప్రాచీన మానవులు గీసిన బొమ్మలు కనిపించాయి. మార్సెల్‌, తన పెంపుడు శునకం రోబోట్‌ కారణంగానే లాస్‌కాక్స్‌ కేవ్‌ గురించి ప్రపంచానికి తెలిసింది.

ప్లీసియోసార్‌ అస్తిపంజరం

ఇంగ్లాండ్‌లోని డోర్సెట్‌కు చెందిన ట్రేసీ బార్కీ తన పెంపుడు శునకం రఫేల్‌తో కలిసి బీచ్‌కు వెళ్లింది. స్నేహితులతో కలిసి కొంతసేపు నడక సాగించిన ఆమె అలసిపోయి ఓ చోట కూర్చుంది. ఇంతలో శునకం ఓ చోట ఇసుకలో తవ్వసాగింది. ఏంటా అని ఆమె దగ్గరకు వెళ్లి చూడగా ఓ భారీ వెన్నెముక కనిపించింది. ఆమె కూడా మరింత తవ్వగా ప్లీసియోసార్‌ అస్తిపంజరం బయటపడింది. ప్లీసియోసార్‌ అనే సరీసృపం కూడా డైనోసార్లలాగే ఎప్పుడో అంతరించిపోయింది. ట్రేసీ భర్తకు ఇటువంటి అంశాలపై ఆసక్తి ఎక్కువ. ఆయనకు సమాచారం ఇవ్వడంతో అధికారులను తీసుకొచ్చి మిగిలిన ఎముకలను సేకరించారు. సుమారు 16 సంవత్సరాలు కష్టపడి 200 మిలియన్‌ ఏళ్ల నాటి అస్తిపంజరాన్ని అతికించారు. దాన్ని చార్‌మౌత్ హెరిటేజ్‌ కోస్ట్ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ అస్తి పంజరానికి రఫేల్‌ అని పేరు పెట్టారు.

పోలండ్‌లో కుండ నిధి

పోలండ్‌ దేశానికి చెందిన వాల్‌బ్రిజ్‌ తన పెంపుడు శునకం కజ్టస్‌ ఓ చోట తవ్వడం చూశాడు. కొంత సేపటి తర్వాత అక్కడ ఓ మట్టి కుండ కనిపించింది. తెరిచి చూడగా అందులో బంగారు నాణేలున్నాయి. అవన్నీ 13వ శతాబ్దానికి చెందినవి.

కాంస్య యుగం అవశేషాలు

చెక్‌ రిపబ్లిక్‌లోని కోస్టలెకా హర్కీలో ఫ్రాంకోటా అనే వ్యక్తి తన పెంపుడు శునకం మోంటీని తీసుకొని వాకింగ్‌కు వెళ్లాడు. అది ఓ చోట తవ్వగా కొన్ని లోహపు బ్లేడ్లు కనిపించాయి. వాటితో తన శునకానికి హాని జరుగుతుందని భావించి అతడు దాన్ని పక్కకు తీసుకొచ్చాడు. అయితే వాటి రూపం చాలా పురాతనంగా ఉండటంతో అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి మరింతగా తవ్వి కొడవలి, గొడ్డలి, కంకణాలు, బల్లేలు వెలికితీశారు. పురాతన వస్తువులను కనుగొన్నందుకు ఫ్రాంకోటాకు 360 డాలర్లు బహుమతి అందజేశారు. 

యుద్ధ సమాధులు

కడావర్‌ జాగిలాలు.. ఇవి శవాలను గుర్తించడంలో అసాధారణ ప్రజ్ఞ కనబరుస్తాయి. పోలీసులు ఎక్కువగా వీటిని వాడుతుంటారు. జార్జియాలోని కెటిల్‌ క్రీక్‌ వద్ద అమెరికా, బ్రిటిష్‌ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. 250 ఏళ్లకు పూర్వం జరిగిన ఈ యుద్ధంలో అనేక మంది మరణించారు. వారిని పూడ్చిన సమాధులను కడావర్‌ డాగ్స్‌ కనిపెట్టాయట.

క్రొయేషియా సమాధులు

వెద్రానా గ్లావస్‌ క్రొయేషియాకు చెందిన పురావస్తుశాఖ ప్రొఫెసర్‌. ఆమె కొన్ని చోట్ల తవ్వకాలు జరిపి పురాతన సమాధులు కనుగొనింది. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఆ విషయంలో తనకు సహాయం చేయాలని కడావర్‌ డాగ్స్‌కు శిక్షణనిచ్చే ఆండ్రియా పింటర్‌ను కోరింది. వారిద్దరూ సాట్ట్వే, మాలి అనే రెండు శునకాలను తవ్వకాలు జరిపే ప్రాంతానికి తీసుకెళ్లారు. అవి మరో 6 పురాతన సమాధులను కనుగొనడంలో సహాయం చేశాయి. ఆ సమాధులు 3వేల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు.

ద్రాక్ష పాత్ర

జెరూసలెంకు చెందిన శౌల్‌ యోనా తన పెంపుడు శునకం జాచ్‌తో కలిసి ఓ అడవిలో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా శునకం ఓ గొయ్యిలో పడిపోయింది. శౌల్‌ వెంటనే అప్రమత్తమై దానిని రక్షించాడు. తరువాత ఆ గొయ్యిలోకి తలపెట్టి చూడగా అది ఓ భారీ పాత్ర అని తెలిసింది. దాంతో పురాతత్వ శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అది క్రీస్తుపూర్వం 1200-586 మధ్య కాలంలో నిర్మించిన పాత్ర అని తేల్చారు. అందులో భారీగా ద్రాక్ష పండ్లను పోసి.. రసం తీసి వైన్‌ తయారు చేసేవారట.

బంగారు నాణేలు

ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌పూల్‌కు చెందిన ఆడం క్లార్క్‌ తన కూతురు కోసం ఓ పప్పీని తీసుకొచ్చాడు. దానికి ఓల్లీ అని పేరు పెట్టాడు. పప్పీని ఇంటి దగ్గర అటూఇటూ తిప్పుతూ ఉండగా.. అది ఓ చోట తవ్వి 19వ శతాబ్దానికి చెందిన 15 బంగారు నాణేలను బయటకు తీసింది. ఆడం వాటిని ఓ డీలర్‌ వద్దకు తీసుకెళ్లగా 7380 డాలర్లు ఇస్తానని చెప్పాడట. ఇది కనిపెట్టేనాటికి ఆ పప్పీ వయసు కేవలం 10 వారాలు.

వెండి నాణేలు

చెక్‌ రిపబ్లిక్‌లో ఉస్తి అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మాసా అనే శునకం కొన్ని సెంటీమీటర్లు తవ్వగానే ఓ మట్టి పాత్ర బయటపడింది. ఇది చూసిన దాని యజమాని ఆ  పాత్ర చాలా పురాతనమైనదని గ్రహించి స్థానిక మ్యూజియానికి సమాచారం అందించాడు. పాత్రను తెరిచి చూడగా అందులో 14వ శతాబ్దానికి చెందిన 300 వెండి నాణేలున్నాయి. వాటి విలువ 90వేల డాలర్లట. దీంతో పురాతత్వ శాస్త్రవేత్తలు మరి కొన్ని చోట్ల తవ్వకాలు సాగించగా ఇంకేమీ దొరకలేదు. 

డబ్బాల నిండా బంగారం

కాలిఫోర్నియాకు చెందిన జాన్‌, మేరీ ఓ రోజు పెంపుడు శునకాన్ని తీసుకొని వాకింగ్‌కు వెళ్లారు. ఆ శునకం ఓ చోట మట్టిలో కూరుకుపోయిన తుప్పు పట్టిన డబ్బాను తవ్వ సాగింది. జాన్‌ దాన్ని బయటకు తీసేందుకు యత్నించగా బాగా బరువుగా అనిపించింది. తెరిచి చూడగా దాని నిండా బంగారు నాణేలు కనిపించాయి. తరువాత మెటల్ డిటెక్టర్‌ తీసుకొచ్చి శోధించారు. మరో 8 డబ్బాలు వెలుగు చూశాయి. వాటి విలువ సుమారు 10లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని