Assam-Arunachal dispute : ఈశాన్య రాష్ట్రాల మధ్య అమిత్‌ షా సయోధ్య.. తగాదా ఏంటంటే..!

ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం (Assam), అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal) మధ్య గత 50 ఏళ్లుగా సరిహద్దు వివాదం (Border dispute) కొనసాగుతోంది. దానికి ముగింపు పలికేందుకు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమిత్‌ షా (Amit shah) సమక్షంలో ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.

Published : 21 Apr 2023 14:10 IST

కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma), అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ (Prema Khandu) గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజా ఒప్పందంతో కొన్ని వివాదాస్పద గ్రామాలపై రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ కూడా ఇకపై కొత్త వాదనలు వినిపించడానికి వీల్లేదు. సర్వే ఆఫ్‌ ఇండియా సమగ్ర నివేదిక ఆధారంగా వాటికి కచ్చితమైన సరిహద్దుల్ని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య వివాదం ఏంటి? ఎలా మొదలైంది? తదితర విషయాలు తెలుసుకోండి.

ఎప్పుడు బీజం పడింది?

అస్సాం నుంచి కొంత భూభాగం విడదీసి అరుణాచల్‌ ప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాలు 804 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సరిహద్దు వివాదానికి బీజం బ్రిటిష్‌ హయాంలోనే ఏర్పడింది. 1873లో బ్రిటిష్‌ పాలకులు ‘ఇన్నర్‌ లైన్‌’ రెగ్యులేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ రెగ్యులేషన్‌ ద్వారా మైదానాలు, కొండ ప్రాంతాల మధ్య ఓ ఊహాత్మక సరిహద్దును నిర్ణయించారు. 1915 నాటికి ఆ రెగ్యులేషన్‌ను ‘ఈశాన్య సరిహద్దు ట్రాక్ట్స్‌’గా పేరు మార్చారు. సరిహద్దులో ఎక్కువగా కొండలున్న ప్రాంతం ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉంది.

ఆక్రమణలు.. పరస్పర ఆరోపణలు

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ‘ఈశాన్య సరిహద్దు ట్రాక్ట్స్‌’ను తన నియంత్రణలోకి తీసుకుంది. 1954లో దాన్ని ‘ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ’గా పేరు మార్చింది. 1972లో అరుణాచల్‌ ప్రదేశ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. 1987లో ఆ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హోదా కల్పించింది. అప్పటి నుంచి కాస్త సాఫీగానే సాగిన ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రయాణం 1990ల నాటికి వివాదం వైపు మళ్లింది. ఒక రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రంలోకి చొరబడి భూములను ఆక్రమించుకుంటున్నారని పరస్పరం ఆరోపించుకున్నారు. కేవలం ఆరోపణలతోనే ఆగలేదు.. కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ అంశంపై 1989 నుంచి ఓ వ్యాజ్యం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ భూభాగాన్ని ఆక్రమించిందంటూ అస్సాం ఆ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

సీఎం నివేదిక

ఈ వివాదానికి మరో ప్రధాన కారణం 1951లో అస్సాం ముఖ్యమంత్రిగా పని చేసిన గోపీనాథ్‌ బార్డోలోయ్‌ నేతృత్వంలో తయారు చేసిన ఒక కమిటీ నివేదిక. బలిపుర, సాదియా ఫుట్‌ హిల్స్‌లోని 3648 చదరపు కిలోమీటర్ల మైదాన ప్రాంతాన్ని అస్సాంలోని లఖింపుర్‌, దర్రాంగ్‌ జిల్లాలకు బదిలీ చేయాలని ఆ నివేదికలో సూచించారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయం సేకరించకుండానే ఆ బదిలీ జరిగిందని అరుణాచల్ ప్రదేశ్‌ వాదిస్తోంది. ఇప్పటికీ ఆ భూములపై హక్కులు తమవేనని అరుణాచల్‌ప్రదేశ్‌ ఘంటాపథంగా చెబుతోంది. అయితే 1951 నాటి నోటిఫికేషన్‌ రాజ్యాంగపరంగా రూపొందించారని, దానికి చట్టబద్ధత ఉన్నందున అరుణాచల్‌ ప్రదేశ్‌ వాదనను అస్సాం తోసిపుచ్చుతోంది.

ప్రభుత్వాలు ఏం చేశాయి?

ఈ రెండు రాష్ట్రాల మధ్య తగాదాను పరిష్కరించేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతంగా అరుణాచల్‌ప్రదేశ్‌ ఏర్పాటైన తరువాత ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఇరు పక్షాలతో చర్చలు జరపాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 

శాంతి స్థాపనకు అడుగులు

ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదం కొనసాగడం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఇష్టం లేదు. అందుకే చర్చల ద్వారా రెండు రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు 2021లోనే సూచించినట్లు సమాచారం. ఆ మేరకు గతేడాది జులైలో రెండు రాష్ట్రాలు నామ్‌సాయ్‌ డిక్లరేషన్‌పై సంతకాలుచేశాయి. ఆ ఒప్పందం ప్రకారం వివాదాస్పద గ్రామాలను 123 నుంచి 86కు తగ్గించారు. సరిహద్దు సమస్య పరిష్కారం కోసం 12 కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీకి ఓ మంత్రి నేతృత్వం వహిస్తారు. ఆ కమిటీ వివాదాస్పద ప్రాంతాలను సందర్శిస్తుంది. అక్కడి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. అలా అస్సాంలోని 12 రీజినల్‌ కమిటీలు చేసిన సిఫార్సులను బుధవారం ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని