Bathinda: సరిహద్దు భద్రతలో కీలకం.. బఠిండా సైనిక స్థావరం!

వరుస కాల్పుల ఘటనలతో పంజాబ్‌లోని (Punjab) బఠిండా సైనిక స్థావరం (Bathinda military station) వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో దాని చరిత్ర గురించి తెలుసుకోండి.

Published : 13 Apr 2023 21:47 IST

అత్యంత కీలకమైన పంజాబ్‌లోని (Punjab) బఠిండా సైనిక స్థావరంలో (Bathinda military station) కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో ఆగంతకులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు మృతి చెందారు. అదే రోజు సాయంత్రం మరో జవాను (Soldier) బుల్లెట్‌ గాయంతో మృతిచెందినట్లు ఆర్మీ (Army) అధికారులు వెల్లడించారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బఠిండా సైనిక స్థావరం గురించి కొన్ని ఆసక్తికర విషయాలివి..

చరిత్రలో ప్రత్యేక స్థానం

బఠిండా సైనిక స్థావరానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. పాక్‌ దాడులను అడ్డుకోవడంలో ఇది ఎంతో కీలకంగా ఉండేది. ఈ నగరం నడిబొడ్డునున్న కోట చారిత్రక గతాన్ని గుర్తు చేస్తుంటుంది. ‘క్విలా ముబారక్‌’ స్మారకం 6వ శతాబ్దంలో ‘హూణుల’ దండయాత్రను అడ్డుకునేందుకు నిర్మించినట్లు సమాచారం. తరువాత వచ్చిన పాలకులు దానికి అనేక మార్పులు, చేర్పులు చేశారు. బ్రిటిష్‌ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతం, సమీప ప్రాంతాలు వారి ఆధీనంలోనే ఉండేది. దాంతో మహారాజా రంజిత్‌సింగ్‌కు ఇక్కడ ఎలాంటి హక్కులు ఉండేవి కావు. 1900 ప్రారంభంలో బ్రిటిష్‌ పాలకులు దీన్ని ఓ కీలక సైనిక స్థావరంగా తీర్చిదిద్దారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ స్థావరం సైనికుల రిక్రూట్‌మెంట్ హబ్‌గా పని చేసింది. దాంతో ఎక్కువ మంది యువకులు బ్రిటిష్‌ సైన్యంలో చేరారు.

పాక్‌కు సరిహద్దులో..

బఠిండా సైనిక స్థావరం వ్యూహాత్మకంగా చాలా ప్రత్యేకమైనది. ఇది దాదాపు 50 ఎకరాల్లో విస్తరించింది. పాకిస్థాన్‌ సరిహద్దుకు దగ్గరలో ఉంది. ఏదైనా ఉద్రిక్తత తలెత్తితే ఈ స్థావరం నుంచి నిమిషాల వ్యవధిలో బలగాలు అక్కడకు చేరుకోగలవు. బఠిండా అనేక సైనిక విభాగాలకు కేంద్రంగా పనిచేస్తోంది. పశ్చిమ సరిహద్దు భద్రతలో ఈ స్థావరం ముఖ్య ప్రాత పోషిస్తోంది. ఈ స్థావరంలో ఆర్మీకి చెందిన ‘10వ కోర్‌’ ప్రధాన కార్యాలయం ఉంది. ‘సౌత్‌ వెస్ట్రన్‌ కమాండ్‌’లో భాగంగా ‘10వ కోర్‌’ను ఏర్పాటు చేశారు. దీన్నే ‘చేతక్‌ కోర్‌’ అని పిలుస్తుంటారు. 1971 యుద్ధం తర్వాత ఈ స్థావరం ఏర్పాటు ఆ దిశగా అడుగులు పడ్డాయి. జలంధర్‌లోని ప్రధాన కార్యాలయం ‘11వ కోర్‌’ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా 1979 జులై 1న బఠిండా సైనిక స్థావరం నెలకొల్పారు. అప్పటి నుంచి దక్షిణ పంజాబ్‌, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో జరిగే ముఖ్య సైనిక కార్యకలాపాలకు ఇక్కడి నుంచే ఆదేశాలు, ఆయుధ సామగ్రి వెళుతుంది.

అధునాతన శిక్షణ.. సౌకర్యాలు

గత కొన్నేళ్లలో ఈ సైనిక స్థావరం విస్తృతి బాగా పెరిగింది. ప్రధాన కార్యాలయంతోపాటు, సహాయక యూనిట్లు, సిగ్నల్‌ వ్యవస్థ, సాయుధ సామగ్రి, ఫిరంగులు, శతఘ్నులు ఇక్కడ నిల్వ చేశారు. పదాతిదళాలు, ఆర్మీ ఏవియేషన్‌, ఇంజినీర్లు.. ఇలా సిబ్బంది పెరిగిపోయారు. ఇందులో సైనికుల కోసం సిములేటర్‌ సెంటర్‌, ఫైరింగ్‌ రేంజ్‌ వంటి అన్ని రకాల సౌకర్యాలున్నాయి. అత్యాధునిక ఆయుధాల శిక్షణ వారికి లభిస్తుంది. యుద్ధరంగంలో ఉపయోగపడే సాంకేతిక శిక్షణ కూడా ఇక్కడ ఇస్తారు. దాంతో సైనికుల పోరాట పటిమను మెరుగు పరుస్తారు. 

ఇక్కడే ఓ లాజిస్టికల్‌ ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌లోనే భారీ మందుగుండు డంప్‌ ఉంది. తొలుత ఈ స్థావరానికి సమీపంలో ఎలాంటి నివాసాలు ఉండేవి కావు. కాలక్రమంలో పట్టణం విస్తరించింది. వివాహం చేసుకున్న అధికారులు, జవాన్లకు ఇక్కడ వసతి సౌకర్యం కల్పించారు. లోపల దుకాణాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, పార్క్‌లు వెలిశాయి. గత కొన్నేళ్లుగా స్థావరంలో అనేక నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ ఇంకా ఖాళీ స్థలం మిగిలి ఉందని చెబుతున్నారు. దాంతో అది అనేక వృక్ష, జంతుజాలానికి నివాసంగానూ కొనసాగుతోంది. ఇక జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఎల్లప్పుడూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పలు చోట్ల చెక్‌ పోస్టులు కన్పిస్తాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని