Vertical forest : నవలను స్ఫూర్తిగా తీసుకొని నిర్మించిన భవనాలివి.. ఎటు చూసినా పచ్చదనమే!

ఇటలీలోని (Italy) మిలాన్‌ నగరం ఓ కాంక్రీట్‌ జంగిల్‌లా ఉంటుంది. అలాంటి చోట అందమైన ‘వర్టికల్‌ ఫారెస్ట్‌’ను తీర్చిదిద్దారు. అదెలా సాధ్యమైందో చదివేయండి.

Published : 06 Jul 2023 10:08 IST

Image : Giuseppe Alletto Italian Artist

ఇటలీలోని (Italy) మిలాన్‌ నగరంలో ‘బాస్కో వర్టికల్’ నివాస సముదాయం ఉంది. ఇక్కడ 80, 112 మీటర్ల ఎత్తులో రెండు టవర్లున్నాయి. వాటిలోని ప్రతి అంతస్తులో చెట్లు, మొక్కలను ఏర్పాటు చేశారు. అందుకే దీనిని అంతా ‘వర్టికల్ ఫారెస్ట్‌’ (Vertical forest) అని పిలుస్తున్నారు. ఆ కృత్రిమ అడవి విశేషాలు తెలుసుకోండి.

జీవ వైవిధ్యం ఉట్టి పడేలా

‘బాస్కో వర్టికల్’ టవర్లను బోరి స్టూడియో అనే కంపెనీ డిజైన్‌ చేసింది. పోర్టా నువా ఐసోలా ప్రాంతంలోని ఈ నిర్మాణాలు కేవలం మనుషులకే కాదు పక్షులకు కూడా ఆవాసంగా ఉండాలనే ఉద్దేశంతో రూపొందించారు. అందుకోసం ఉద్యానవన నిపుణులు, వృక్ష శాస్త్రజ్ఞుల సాయం తీసుకున్నారు. అలా 2010లో ప్రారంభమైన ఈ టవర్ల నిర్మాణం 2014 కల్లా పూర్తయింది.

1957లో ఇటాలో కాల్వినో అనే రచయిత ‘ద బారన్‌ ఇన్‌ ద ట్రీస్‌’ అనే నవల రాశాడు. అందులో కథానాయకుడు నేలపై కాకుండా చెట్లపై నివాసం ఉండాలని నిశ్చయించుకుంటాడు. ఆ నవలను స్ఫూర్తిగా తీసుకొనే ఈ ప్రాజెక్టు చేపట్టామని ఆర్కిటెక్ట్‌ స్టెఫానో బోరి తెలిపారు.

ఎటు చూసినా మొక్కలు, చెట్లు

ఇక్కడి రెండు టవర్లలో కలిపి సుమారు 900 చెట్లున్నాయి. 550 దాకా ఒక భవనంలో,  350 దాకా మరో భవనంలో నాటారు. అవి మాత్రమే కాకుండా 15 వేల గ్రౌండ్‌ కవరింగ్‌, 5వేల పొద రకాల మొక్కలు వివిధ చోట్ల ఏర్పాటు చేశారు. అంటే దాదాపు 30వేల చదరపు మీటర్ల అటవీ ప్రాంతంలో ఉండాల్సిన వృక్ష సంపదను 3వేల చదరపు మీటర్ల పట్టణ ప్రాంతంలోనే తీర్చిదిద్దారు. ఫలితంగా ఒక ఏడాదిలోనే ఈ మొక్కలు, చెట్లన్నీ కలిసి 20 వేల కేజీల కార్బన్‌వాయువులను గ్రహిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

వేసవిలోనూ చల్లదనం

సాధారణంగా గాజు, రాతి, కాంక్రీటు నిర్మాణాలపై సూర్యరశ్మి ప్రభావం అధికంగా ఉంటుంది. కానీ, చుట్టూ మొక్కలు, పొదలతో ‘బాస్కో వర్టికల్’ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ ఇళ్ల లోపల నిత్యం చల్లగా ఉంటుందని బోరి స్టూడియో వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ భవనాల్లో చాలా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోందని.. దాంతో ఏసీల వాడకం కూడా తగ్గిందని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా మొక్కలు తేమను అదుపులో ఉంచుతున్నాయి. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తున్నాయి.

Image : stefanoboeriarchitetti.net
 

ఆహ్లాదకర వాతావరణం

మిలాన్‌ నగరం నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ, ఈ టవర్లలో నివసించే స్థానికులకు మాత్రం ఆ గజిబిజి వాతావరణం తెలియదు. ఎందుకంటే చుట్టూ ఉన్న మొక్కలు రణగొణ శబ్దాలను తగ్గించడమే కాకుండా దుమ్ము, ధూళిని ఇళ్లలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఎటు చూసినా పచ్చదనమే కన్పించడం వల్ల ఆహ్లాదకరంగా అనిపిస్తోందని వారు చెబుతున్నారు.

అనేక అవార్డులు

‘బాస్కో వర్టికల్‌’ ప్రాజెక్టును ఇప్పటి దాకా అనేక అవార్డులు వరించాయి. 2014లో ‘ఇంటర్నేషనల్ హై రైజ్‌ అవార్డు’ దక్కింది. రెండేళ్లకొక సారి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న నిర్మాణాలను గుర్తించి వాటిలోని ప్రత్యేకతల ఆధారంగా అవార్డుకు ఎంపిక చేస్తారు. 2015లో ‘కౌన్సిల్ ఆన్‌ టాల్‌ బిల్డింగ్‌ అండ్‌ అర్బన్‌ హాబిటట్‌’ అవార్డ్స్‌ జూరీ ‘బాస్కో వర్టికల్‌’ను ‘2015 బెస్ట్‌ టాల్‌ బిల్డింగ్‌ వరల్డ్‌ వైడ్‌’గా గుర్తించింది.

ఆ ప్రాజెక్టుల్లా కాదు

చుట్టూ గ్రీనరీ ఉండేలా నిర్మించిన భవనాలు చాలా చోట్ల ఉన్నాయి. కొలంబియా రాజధాని బొగొటాలోని ఎడిఫిసియో శాంటాలాయా, చైనా దేశం చెంగ్డూలోని క్యూయీ సిటీ ఫారెస్ట్‌ గార్డెన్‌ ఆ కోవకు చెందినవే. కానీ, అవేవీ అంత విజయవంతం కాలేదు. క్యూయీ సిటీ ఫారెస్ట్‌ గార్డెన్‌లో దోమల బాధ అధికంగా ఉందని ఇటీవల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో అది అంతర్జాతీయ స్థాయి వార్తగా మారింది. కానీ, ఇన్నేళ్లయినా ‘బాస్కో వర్టికల్‌’ గురించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు.

గ్రీన్‌ సైనికుల కృషి

‘బాస్కో వర్టికల్‌’ పచ్చదనం కొనసాగడం, దాని గురించి ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడం వెనుక ‘ప్లయింగ్‌ గార్డెనర్స్‌’ కృషి దాగి ఉంది. పర్వతారోహకుల తరహాలో వీరు ఈ భవనం చుట్టూ వేలాడుతూ పని చేస్తారు. అడ్డంగా పెరిగిన మొక్కలను అందంగా కత్తిరిస్తారు. నీటి సదుపాయం కల్పిస్తారు. డిజిటల్‌, ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మరమ్మతులు చేయాలో అవన్నీ చకచకా చేసేస్తారు.

ప్రస్తుతం ‘బాస్కో వర్టికల్’ మనుషులతో పాటు అనేక పక్షులు, కీటకాలకు నిలయంగా మారింది. ఇక్కడ దాదాపు 1600 రకాల పక్షులు, సీతాకోక చిలుకలు తిరుగుతున్నట్లు సమాచారం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని