Brazil : ఈ బ్రెజిల్ పట్టణాన్ని సముద్రం మింగేస్తోంది!

బ్రెజిల్‌లోని (Brazil) అటఫోనా పట్టణం ఒకప్పుడు పర్యాటకులతో (Tourist place) కళకళలాడేది. సముద్రపు (Sea) అలల తాకిడి కారణంగా ప్రస్తుతం అక్కడ ఎటు చూసినా శిథిలమైన కట్టడాలే దర్శనమిస్తున్నాయి. దాంతో మనుషుల కంటే రాబందుల సంచారం ఎక్కువగా కన్పిస్తోంది.

Updated : 12 Apr 2023 13:13 IST

(Image : Social media)

వాతావరణ మార్పులతో బ్రెజిల్‌లోని (Brazil) పలు సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. ఇక్కడ అట్లాంటిక్‌ మహా సముద్రం (Atlantic ocean) దూకుడు ఎక్కువగా ఉంది. దాంతో 1960 నుంచి ఇప్పటి దాకా ఒక్క అటఫోనా పట్టణంలోనే దాదాపు ఐదొందల ఇళ్లు సముద్రంలో కూరుకుపోయాయి. ఏడాదికి 6 మీటర్ల చొప్పున భూమి (Earth) సముద్రంలో కలిసిపోతోంది. దాంతో సుందరమైన ఈ పర్యాటక ప్రాంతం కాస్తా ఇప్పుడు శిథిలాలతో నిండిపోయింది. ఉన్న కొద్ది నివాసాలను స్థానికులు అపురూపంగా చూసుకుంటున్నారు. వాటితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ .. అవి ఎప్పుడు నీట మునుగుతాయోనని కలవరపడుతున్నారు.

రోజురోజుకీ తీవ్రమైన కోత

అటఫోనాలో దాదాపు 7వేల మంది నివసిస్తుండేవారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ సముద్రం కోత వేగం అధికంగా ఉంది. అందువల్ల 1984 నుంచి 2016 మధ్య కాలంలో 550 అడుగుల మేర భూమి కనుమరుగైపోయింది. ఈ పట్టణానికి సమీపంలోనే ‘ద పరైబా డొ సుల్’ నది ఉంది. 700 మైళ్ల పొడవైన ఈ నది 184 పట్టణాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేది. ఇబ్బడిముబ్బడిగా మైనింగ్‌ చేయడం వల్ల ఈ నదిలో నీరు తగ్గుముఖం పట్టింది. వ్యవసాయం, జీవన అవసరాల కోసం పరిమితికి మించి నీటిని తోడుకోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దాంతో అటఫోనాలో ఇసుక నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు భూమిని సముద్రానికి అప్పగించే ప్రక్రియ మొదలైంది. 2008-2009 మధ్య కాలంలో అయితే సముద్రం ఏకంగా 27 అడుగులు ముందుకొచ్చింది. నిజానికి తీరంలో నిర్మించిన కట్టడాలు కూడా ఈ పరిస్థితికి కారణం. వివిధ నిర్మాణాల కోసం బీచ్‌కు దగ్గరగా ఉండే ఇసుక దిబ్బలను తొలగించారు. సముద్రపు అలలను కట్టడి చేసే చెట్లను నరికేశారు. అందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు.

ప్రయత్నాలు కాగితాల్లోనే..

సముద్రం కోతకు అడ్డుకట్ట వేసేందుకు స్థానిక అధికారులు శతవిధాలా ప్రయత్నించారు. తీరంలో పెద్ద పెద్ద కట్టలు వేయాలని, ఇసుక దిబ్బలు పోగు చేయాలని ప్రణాళికలు రచించారు. నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, అమెరికా వంటి దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేశారు. కానీ, అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు నెలకు 230 డాలర్ల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంది. దాంతో కొందరు స్థానికులు పరిహారం తీసుకొని వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతంపై మమకారం ఉన్న కొద్ది మంది మాత్రం ఇంకా అక్కడే బతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని