Updated : 19 Apr 2021 12:15 IST

Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాగైనా బరువు తగ్గిపోవాలి.. నెల రోజుల్లో కనీసం 4 కేజీలైనా తగ్గాలి. ఇలా చాలా మంది అనుకుంటారు. వెంటనే డైటింగ్‌ అంటూ తమకుతాము ఆహార నిబంధనలు విధించుకుంటారు. చాలీచాలని ఆహారం తింటారు. మరీ ముఖ్యంగా సాయంత్రం 5 తర్వాత తినే వాటిపైనే దృష్టి పెడతారు. బరువు తగ్గడం మాటపక్కన పెడితే కష్టాలు కోరి తెచ్చుకుంటారు. బరువు తగ్గాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ, అది అంతసులభమేమీకాదు. నిరంతర శ్రమతోనే అది సాధ్యమవుతుంది. కానీ, ఆ క్రమంలో చాలా మంది తెలిసో? తెలియకో తప్పులు చేసేస్తుంటారు. అవేంటో చూద్దామా?

1. రాత్రిపూట తగినంత తినకపోవడం

అధిక బరువుకు రాత్రిపూట ఎక్కువగా తినడమే కారణమని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. దీంతో ఓవైపు ఆకలితో కడుపు మండిపోతున్నా.. సగంతోనే ముగిస్తారు. పోషకాహార నిపుణులు దీనిని ఏమాత్రం సమర్థించరు. రాత్రిపూట సరిపడినంత తిండి తినడం చాలా అవసరం. మరుసటి రోజు పని చేయడానికి కావాల్సిన శక్తి దీని ద్వారానే లభిస్తుంది. అయితే మనం తినే ఆహారంలో శరీరానికి అవసరమైన పిండిపదార్థాలతోపాటు ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.

2. రుచికరమైన భోజనం చేయకపోడం

నోటికి రుచిగా అనిపించినప్పుడు మనకు తెలియకుండానే కాస్తా ఎక్కువ తినేస్తాం. అందుకని బరువు తగ్గాలనుకునే వారు ఉప్పు, కారం వీలైనంత తక్కువగా ఉండేలా జాగ్రత్తపడతారు. అంతేకాకుండా స్పైసీ ఫుడ్స్‌కి దూరంగా ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారు మరీ అంత కఠిన నియమాలు పాటించనక్కర్లేదు. రాత్రి మీకు నచ్చిన ఆహారాన్ని మనసారా తినండి. కానీ, తిన్న వెంటనే పడుకోకుండా భోజనానికి, నిద్రకి కనీసం గంట సమయం ఉండేలా చూసుకోండి. అయితే.. నచ్చింది కదా అని మరీ ఎక్కువగా తినకూడదు సుమా!

3. స్వీట్స్‌ తింటే బరువు పెరిగిపోతాం 

సాధారణంగా రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా మంది ఐస్‌క్రీం, స్వీట్‌ లాంటివి తింటూ ఉంటారు. కానీ, బరువు తగ్గాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ చేసేది ముందుగా స్వీట్స్‌ మానేయడం. అలాగని గీతగీసుకొని మరీ తినడం మానక్కర్లేదు. అలవాటుకు తగ్గట్లుగా వేరే వాటిని చూసుకోవడం మంచిది. ఉదాహరణకు ఐస్‌క్రీం స్థానంలో స్వీట్‌పాన్‌ లాంటివి వాడుకోవచ్చు. రాత్రిపూట తినడం తగ్గించాలనుకుంటే.. సాయంత్రం ఏవైనా స్నాక్స్‌ తీసుకోవడం మంచిది.

4. సరిపడినంత నిద్రలేకపోవడం

పనులన్నీ ముగించుకున్నాక.. చాలా మంది కొద్దీ టీవీ చూస్తూనో, ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేస్తూనో గంటల కొద్దీ సమయం గడిసేస్తారు. రాత్రి ఎప్పటికో నిద్రపోతారు. ఉదయం లేవడమూ ఆలస్యమే. దీంతో శరీరంలో హార్మోన్ల స్థాయి అదుపు తప్పుతుంది. ఫలితంగా అధికబరువుకు అవకాశాలు చాలా ఎక్కువ. అందువల్ల వీలైనంత వరకు నిర్ణీత సమయంలో నిద్రపోయేలా చూసుకోవాలి. మరికొందరు రోజంతా బాగా కష్టపడి అలిసిపోతారు. రాత్రి కాస్త తిన్న వెంటనే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. తిన్న వెంటనే నిద్రపోతారు. దీనివల్ల కూడా బరువుపెరిగే అవకాశముంది.

శరీరానికి అవసరమైన సమతులాహారాన్ని తీసుకుంటూ.. రోజుకు కనీసం గంటపాటు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఏవైనా ఆహార నియమాలు పాటించే ముందు డాక్టరును సంప్రదించి వాళ్ల సూచన మేరకు ఆచరించడమే ఉత్తమం.
 

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని