Companies Reinvented: మీరు చూస్తున్న ఈ కంపెనీలు ఒకప్పుడు ఇలా లేవు తెలుసా?
వ్యాపారం చేయడం అంత సులువేం కాదు. పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉన్నా.. ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి? మార్కెట్లో ఏ వస్తువులకు డిమాండ్ ఉంది తదితర అంశాలను బాగా అధ్యయనం చేయాలి. వాటికి అనుగుణంగా వ్యాపారంలో మార్పులు చేసుకుంటూ వృద్ధి చెందాలి.
వ్యాపారం చేయడం అంత సులువేం కాదు. పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉన్నా.. ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి? మార్కెట్లో ఏ వస్తువులకు డిమాండ్ ఉంది తదితర అంశాలను బాగా అధ్యయనం చేయాలి. వాటికి అనుగుణంగా వ్యాపారంలో మార్పులు చేసుకుంటూ వృద్ధి చెందాలి. శాంసంగ్ (Samsung), నోకియా (Nokia), ఎల్‌జీ (LG) సంస్థలు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో దిగ్గజ సంస్థలనేది తెలిసిందే. కానీ.. ఈ రంగంలోకి రాకముందు శాంసంగ్ కూరగాయలు, వంటింటి సరకులు విక్రయించిందని, నోకియా కంపెనీ పేపర్ మిల్‌గా, ఎల్‌జీ ఒక కెమికల్ కంపెనీగా ఉండేదని తెలుసా? ఇవే కావు.. ఇప్పుడు ఒక్కో రంగంలో ప్రఖ్యాతి సాధించిన కొన్ని సంస్థలు కూడా ప్రస్తుతానికి భిన్నంగా గతంలో వేరే వ్యాపారాలు నిర్వహించాయి. మరి ఆ కంపెనీలు ఏవి? అవి ఏయే వ్యాపారాలు చేశాయో తెలుసుకుందామా?
శాంసంగ్
ఎలక్ట్రానిక్ రంగంలో అతిపెద్ద సంస్థ శాంసంగ్. ఇది దక్షిణ కొరియాకు చెందినది. టీవీ, ఫ్రిజ్, ఏసీ.. ఒక్కటేంటి.. ఇంట్లో కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ తయారు చేస్తుంటుంది. అయితే, వీటికన్నా ముందు శాంసంగ్ అనేక వ్యాపారాలు చేసింది. బ్యాంగ్ చుల్ లీ అనే వ్యక్తి 1938లో ఈ సంస్థను ప్రారంభించి.. మొదట్లో కూరగాయలు, పండ్లు, ఎండుచేపలను చైనా రాజధాని బీజింగ్, మంచూరియా ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఆ తర్వాత శాంసంగ్ పేరుతో పిండిమర, మిఠాయిలు తయారు చేసే యంత్రాలను తయారు చేయడం మొదలుపెట్టారు. వ్యాపారాల్లో మంచి లాభాలు రావడంతో శాంసంగ్.. టెక్స్‌టైల్, ఇన్సూరెన్స్ రంగాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అయితే, 1960 దశాబ్దం ద్వితీయార్ధంలో శాంసంగ్ దశ.. దిశ మారింది. ఆ సమయంలో దక్షిణ కొరియా ప్రభుత్వం దేశీయ సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. సంస్థలకు సులభంగా ఆర్థిక సాయం, రుణాలు అందేలా.. మార్కెట్లో పోటీ నుంచి రక్షణ కల్పించేలా అనేక విధానాలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో శాంసంగ్ 1969లో ఎలక్ట్రానిక్ రంగంలోకి ప్రవేశించింది. మరుసటి ఏడాది అంటే 1970లో తొలిసారి బ్లాక్ అండ్ వైట్ టీవీని తయారు చేసింది. అదే దశాబ్దంలో టీవీలతోపాటు ఫ్రిజ్, వాషింగ్ మిషన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటితోపాటు షిప్‌బిల్డింగ్, భారీ పరిశ్రమల్లోకి అడుగుపెట్టింది. కెమికల్, పెట్రో కెమికల్ పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. రాబోయేది స్మార్ట్‌యుగమేనని గుర్తించిన శాంసంగ్ 1974లో ఓ సెమికండక్టర్(చిప్) తయారీ సంస్థను సొంతం చేసుకుంది. ప్రస్తుతం యాపిల్‌తోపాటు, అనేక స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్ చిప్‌లనే వినియోగిస్తున్నాయి. అలా ఎలక్ట్రానిక్ రంగంలో ఒక్కోమెట్టు ఎక్కుతూ అగ్రగామిగా అవతరించింది.
ఎల్‌జీ
మొబైల్‌ఫోన్, టీవీ, ఫ్రిజ్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే ఎల్‌జీ బ్రాండ్ అందరికీ సుపరిచితమే. కానీ, రెండు సంస్థల కలయికతో ఈ కంపెనీ ఆవిర్భవించిందన్న విషయం తెలుసా?దక్షిణ కొరియాకు చెందిన కూ ఇన్ హ్వోయి అనే ఆయన 1947లో లాక్ హూయి పేరుతో ఓ కెమికల్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఫేస్ క్రీమ్‌లు ఉత్పత్తి చేసి విక్రయించేవారు. అయితే.. కాస్మొటిక్ తయారీలో ప్లాస్టిక్ అవసరం ఏర్పడటంతో 1952లో ప్లాస్టిక్ సంస్థను ప్రారంభించారు. అదే దశాబ్దంలో గోల్డ్‌స్టార్ పేరుతో మరో కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీ కొరియాలోనే తొలిసారి దేశీయ రేడియోను తయారు చేసింది. ఆ తర్వాత టెలిఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌ల తయారీ రంగంలోనూ అడుగుపెట్టింది. మరోవైపు లక్కీ పేరుతో టూత్‌పేస్ట్, లాండ్రీ పౌడర్లు ఉత్పత్తి చేసేవారు. అలా ఒకే యజమాని ఉన్న ఈ రెండు కంపెనీలు కలిసిపోయి లక్కీ అండ్ గోల్డ్‌స్టార్(ఎల్‌జీ) సంస్థగా మారింది. ఈ కంపెనీ ప్రపంచ ఎలక్ట్రానిక్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది.
నోకియా
ఫిన్లాండ్‌కు చెందిన ఫ్రెడ్రిక్ ఇడెస్టామ్ అనే మైనింగ్ ఇంజినీర్ 1871లో నోకియా ప్రాంతంలోని నోకియన్ విర్టా నది ఒడ్డున తన వ్యాపారం కోసం రెండో పేపర్ మిల్లు స్థాపించారు. కాగా.. 1898లో తన కంపెనీకి కొత్తగా నోకియా ఏబీ అని పేరు పెట్టారు. అదే సమయంలో ఫిన్నిష్ రబ్బర్ వర్క్స్ అనే సంస్థ టైర్లు, రబ్బరు బూట్లు తయారు చేసేది. ఈ రెండు కంపెనీలు 1912లో ఫిన్నిష్ కేబుల్ వర్క్స్ అనే సంస్థతో కలవడంతో నోకియా కార్పొరేషన్ ఏర్పడింది. నోకియా బ్రాండ్‌తో కొత్త డిజైన్లు, రంగు రంగుల రబ్బర్ బూట్లు తయారు చేసేవాళ్లు. ఈ వ్యాపారంలో నోకియా బాగా రాణించింది.
అలా కొన్ని దశాబ్దాలు గడిచాక.. 1963లో నోకియా కంపెనీ తొలిసారి ఎలక్ట్రానిక్ రంగంలో అడుగుపెట్టింది. మిలటరీ, ఎమెర్జెన్సీ సర్వీసుల కోసం రేడియో ఫోన్లను తయారుచేసింది. 1980ల్లో కమర్షియల్ రేడియో ఫోన్లు, కార్‌ఫోన్లు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఈ రంగంలోనే భవిష్యత్తును వెతుక్కున్న నోకియా.. 1990ల్లో రబ్బర్, పేపర్ కంపెనీలను విక్రయించేసి పూర్తిగా మొబైల్‌ఫోన్ల తయారీపై దృష్టిపెట్టింది. 1998 నుంచి 2012 వరకు ప్రపంచంలో ఏ మొబైల్ కంపెనీ విక్రయించలేనన్ని మొబైల్ ఫోన్లను విక్రయించిందంటే అతిశయోక్తి కాదు. అయితే, 2014 తర్వాత స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రావడంతో నోకియా ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది.
విప్రో
‘మా వాడికి విప్రో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందోయ్’ అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటుంటారు. నిజమే మరి, విప్రో సంస్థ సాదాసీదా కంపెనీ కాదు కదా! ప్రపంచంలోని గొప్ప ఐటీ కంపెనీల్లో ఒకటి. భారత ఐబీఎం సంస్థగా గుర్తింపు పొందిన ఈ కంపెనీలో దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులున్నారు. రూ.వేల కోట్ల ఆదాయం ఉన్న ఈ విప్రో ఐటీకి మరికొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. 1945లో మహమ్మద్ ప్రేమ్‌జీ వెస్ట్రన్ ఇండియా ప్రొడక్ట్స్(విప్రో) పేరుతో మొదట వంటనూనె ఉత్పత్తి ప్రారంభించారు. రెండు దశాబ్దాల తర్వాత ఈ సంస్థ సబ్బులు, వాషింగ్ పౌడర్, ఫేస్ పౌడర్, బల్బులు, ఇతర ఇంటి సామగ్రిని తయారు చేయడం ప్రారంభించింది.
కాగా.. 1966లో మహమ్మద్ ప్రేమ్‌జీ మృతి చెందడంతో ఆయన కుమారుడైన 21 ఏళ్ల అజీమ్ ప్రేమ్‌జీ విప్రో బాధ్యతలు స్వీకరించారు. అయితే, 1970, 1980ల్లో భారత్‌లో అప్పుడప్పుడే ఐటీ రంగం మొదలైంది. ఈ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అజీమ్ ప్రేమ్‌జీ తన సంస్థ ప్రధాన కార్యాలయాన్ని భారత సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరుకు మార్చారు. ఆ తర్వాత కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్ తయారు చేసే సంస్థను నెలకొల్పారు. అలా విప్రో ఐటీ కంపెనీ మొదలైంది. విప్రోకు ఎక్కువ భాగం ఆదాయం అమెరికా నుంచే వస్తుంటుంది. ఇప్పటికీ ఈ సంస్థ విప్రో ఎంటర్‌ప్రైజెస్ పేరుతో బాత్‌రూమ్‌కు సంబంధించిన వస్తువులు, బల్బులు, ఇతర ఇంటి సామగ్రిని ఉత్పత్తి చేస్తుండటం విశేషం.
షెల్
ప్రపంచంలోనే భారీ ఆదాయం పొందుతున్న పెద్ద ఇంధన సంస్థ షెల్. ఈ సంస్థ యజమానులకు మొదట్లో లండన్‌లో పురాతన వస్తువులను విక్రయించే చిన్న దుకాణం ఉండేది. ఇది 1830 నాటి సంగతి. మార్కస్ శామ్యూల్ అనే వ్యక్తి అప్పట్లో వివిధ దేశాల నుంచి రకరకాల షెల్స్(నత్తగుల్లలు)ను దిగుమతి చేసుకొని అమ్మేవారు. దీనికితోడు, వారి కుమారులు ఎగుమతుల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. లండన్ నుంచి ఓడల్లో భారీ యంత్రాలు, పనిముట్లను ఎగుమతి చేస్తూ.. జపాన్, చైనా నుంచి బియ్యం, సిల్క్ తదితర వస్తువులను దిగుమతి చేసుకునేవారు. కాగా.. 19వ శతాబ్దం చివర్లో అంతర్జాతీయంగా రవాణా వ్యవస్థలో వాహనాలు ప్రవేశించడంతో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. దీంతో శామ్యూల్ అండ్ సన్స్ ఇంధన రంగంలోకి దిగారు. 1892లో ప్రపంచంలోనే తొలిసారి ఇంధన ట్యాంకర్‌ను నిర్మించారు. యూరప్‌కు ఇంధనం దిగుమతి చేసుకోవడం కోసం పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. అలా ఆ రంగంలో శామ్యూల్ కుటుంబం పట్టు సాధించింది. 1897లో వారి షిప్పింగ్ కంపెనీ పేరును షెల్ ట్రాన్స్‌పోర్టు అండ్ ట్రేడింగ్ కంపెనీగా మార్చారు.
20వ శతాబ్దంలో ఈ షెల్ కంపెనీ పోటీదారులను తట్టుకోవడం కోసం రాయల్ డచ్ పెట్రోలియంలో విలీనమైంది. ఆ తర్వాత కొత్త పేరు.. కొత్త లోగోతో ప్రస్తుత షెల్ సంస్థగా ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి 44వేల ఇంధన స్టేషన్లు ఉన్నాయి.
రిగ్లీ
చూయింగ్ గమ్‌లో ఫేమస్ బ్రాండ్ రిగ్లీ. కానీ ఒకప్పుడు దీన్ని సబ్బులు, బేకింగ్ సోడాలు కొంటే ఉచితంగా ఇచ్చేవారు వ్యాపారవేత్త విలియమ్ రిగ్లీ. 1891లో ఆయన సబ్బులు, బేకింగ్ సోడాలు విక్రయించేవారు. వీటిని కొనుగోలు చేసిన వారికి చూయింగ్ గమ్‌ను ఉచితంగా ఇచ్చేవారు. అయితే, విలియమ్ అమ్మే ఉత్పత్తుల కన్నా ఉచితంగా ఇచ్చే చూయింగ్ గమ్ బాగా ప్రసిద్ధి చెందింది. దీంతో సబ్బులు, బేకింగ్ సోడాల ఉత్పత్తి నిలిపేసి, కేవలం చూయింగ్ గమ్‌ను విక్రయించడం ప్రారంభించాడు. అలా రిగ్లీ స్పియర్‌మింట్ మార్కెట్లోకి వచ్చింది.
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Temjen Imna Along: నిద్రపోవట్లే..ఫోన్ చూస్తున్నా: మంత్రి ఛలోక్తి
-
World News
Japan: పితృత్వ సెలవులు ఇస్తామంటే.. భయపడిపోతున్న తండ్రులు
-
Politics News
Gali Janardhan: రాజకీయాల్లో.. ఇక ‘ఫుట్‌బాల్’ ఆడుకుంటా..!
-
Sports News
Sanjay Manjrekar: ఐపీఎల్ 2023..బౌలింగ్‌లో ఆర్సీబీ ఉత్తమంగా రాణించగలదు: సంజయ్ మంజ్రేకర్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్ టాప్ 10 వార్తలు @ 9 PM
-
India News
Rahul Gandhi: మీ బంధం బయటపడినా.. మళ్లీ వారి డబ్బు అదానీకేనా? మోదీకి రాహుల్ ప్రశ్న