Covid Mortality: ఈ సంకేతాలతో ముప్పు గుర్తింపు

కొవిడ్‌ బాధితుల్లో కనిపించే కొన్ని రకాల సంకేతాలను బట్టి ప్రాణాపాయాన్ని ముందే పసిగట్టవచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు.

Published : 25 May 2021 23:34 IST

అమెరికా పరిశోధకుల అధ్యయనం

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి లక్షల మందిని పొట్టనబెట్టుకుంటోంది. అయితే, కొవిడ్‌ బాధితుల్లో కనిపించే కొన్ని రకాల సంకేతాలను బట్టి ప్రాణాపాయాన్ని ముందే పసిగట్టవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా శ్వాసక్రియ రేటు, ఆక్సిజన్‌ స్థాయిలను బట్టి ప్రాణాపాయాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా కొవిడ్‌ నిర్ధారణ అయిన బాధితులు ఇంటివద్దే వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకొని అప్రమత్తం కావచ్చని సూచిస్తున్నారు.

కొవిడ్‌ సోకిన చాలా మందిలో స్వల్ప లక్షణాలతోనే త్వరగా కోలుకుంటున్నారు. కానీ, కొందరిలో మాత్రం కొన్ని రోజుల వ్యవధిలోనే తీవ్ర అనారోగ్యానికి గురై పరిస్థితి విషమిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మరణాలు సంభవించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ఆసుపత్రితో పాటు రష్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో కొవిడ్‌తో చేరిన 1095 బాధితుల సమాచారాన్ని విశ్లేషించారు. గతేడాది (2020) మార్చి 1 నుంచి జూన్‌ 8 మధ్య కాలంలో చేపట్టిన ఈ అద్యయన సమయంలో.. ఆసుపత్రిలో చేరిన వారిలో 197 మంది మృత్యువాతపడినట్లు గుర్తించారు. ఆక్సిజన్‌ స్థాయిలు సాధారణంగా ఉండి ఆసుపత్రిలో చేరిన వారితో పోలిస్తే హైపోక్సేమియా (రక్తంలో తగినంత ఆక్సిజన్‌ లేని స్థితి) బాధితుల్లో మరణాల ముప్పు 1.8 నుంచి 4రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక శ్వాసక్రియ రేటు మామూలుగా ఉన్న బాధితులతో పోలిస్తే టాచీప్నియా (వేగంగా శ్వాస తీసుకునే స్థితి) బాధితుల్లో మరణం ముప్పు 1.9 నుంచి 3.2రెట్లు అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా, శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం, రక్తపోటు వంటి అంశాలతో కరోనా మరణాలకు సంబంధం లేదని వైద్య నిపుణులు గుర్తించారు. ఆక్సీమీటర్‌తో పాటు రక్తపోటును తెలుసుకునే పరికరాలను ఉంచుకోవాలని వారు సూచించారు.

ఇలా హైపోక్సేమియా, టాచీప్నియాతో బాధపడిన రోగులందరికీ అదనపు ఆక్సిజన్‌తో పాటు ఊపిరితిత్తుల్లో వాపును తగ్గించే గ్లూకో కార్టికాయిడ్స్‌ అవసరం అయినట్లు వైద్యులు గుర్తించారు. ఆక్సిజన్‌ స్థాయిలను 92%నుంచి 96% పొందినవారు మాత్రమే గ్లూకో కార్టికాయిడ్స్‌ ప్రయోజనాలను పొందుతారని వైద్య నిపుణులు గుర్తుచేశారు. ఇలా కొవిడ్‌తో అనారోగ్యం బారినపడిన వ్యక్తులు ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి, ఆరోగ్య పరిస్థితి ఏంటనే ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ రెండు సంకేతాలతో అప్రమత్తం కావచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ చెందిన డాక్టర్‌ నియల్‌ ఛటర్జీ పేర్కొన్నారు.

ఆక్సీమీటర్‌తో పర్యవేక్షణ..

కొవిడ్‌ నిర్ధారణ అయిన బాధితులు వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పల్స్‌ ఆక్సీమీటర్‌తో పర్యవేక్షించుకోవడం మంచిదని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్‌ సొతూదేహ్నియా సూచించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడిగా అనిపించడం వంటి సంకేతాలు కనిపించినప్పుడు వైద్యున్ని సంప్రదించాలని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) సూచిస్తోంది. కానీ, ఒక్కోసారి శ్వాసక్రియ రేటు, ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు కనిపించకపోవచ్చు. దాంతో పరిస్థితి విషమంగా మారుతోంది. అందుచేత ఆయా ప్రభుత్వాలు కొవిడ్‌ నిబంధనల్లో వీటిని కూడా చేర్చాలని డాక్టర్‌ నియల్‌ ఛటర్జీ సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని