Bird drones : మరణించిన పక్షులతో డ్రోన్లు.. అమెరికాలో సరికొత్త ప్రయోగం!

అమెరికాలో (America) మరణించిన పక్షులను (Birds) వినియోగించి డ్రోన్‌లు (Drones) సృష్టించే ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు పూర్తి స్థాయిలో విజయవంతమైతే లోహ విహంగాల (Flights) ఇంధనం కూడా ఆదా చేసే మార్గం కనిపెట్టొచ్చట. 

Published : 22 Apr 2023 11:50 IST

(Image : Mostafa Hassanalian face book)

అమెరికాలోని (America) న్యూ మెక్సికోలో కొందరు సరికొత్త పరిశోధనకు తెరతీశారు. చనిపోయిన (టాక్సిర్‌డెర్మీ) పక్షులను (Birds) డ్రోన్‌లుగా (Drones) మార్చే ప్రక్రియ గురించి విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. సాధారణ డ్రోన్‌లకు హెలికాప్టర్‌ తరహాలో అమర్చిన చక్రాలు తిరుగుతూ ఉంటాయి. కానీ, వీరు రూపొందిస్తున్న డ్రోన్‌లకు పక్షిలాగ రెక్కలు మాత్రమే ఉంటాయి. అవి అల్లార్చుతూనే డ్రోన్‌ ఎగరాల్సి ఉంటుంది. జీవం ఉండే పక్షి తన రెక్కల సహాయంతో సులభంగా గాల్లో ప్రయాణిస్తుంది. అదే విధానంలో డ్రోన్‌ను ఎగరేయడం అసాధ్యం. సకొర్రోలోని ‘న్యూ మెక్సికో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ అండ్‌ టెక్నాలజీ’లో కొందరు బృందంగా ఏర్పడి ఇందు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.

చనిపోయిన పక్షులను డ్రోన్‌లుగా రూపాంతరం చెందిస్తే అది విమానాల (Flights) అధ్యయనానికి కూడా ఉపకరిస్తుందని వారు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మెకానికల్ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ముస్తఫా హసన్ అలియన్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన తొలుత కృత్రిమ, యాంత్రికంగా తయారు చేసిన పక్షులతో పరిశోధన చేశారు. అవి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో నిజమైన పక్షుల శరీరాలతో పరిశోధన ప్రారంభించారు. ఈ ఐడియా ఫలిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ‘చనిపోయిన పక్షులను డ్రోన్‌లుగా మారుస్తున్నాం. పక్షుల్లో ఎప్పటి నుంచో ఎగిరే శక్తి ఉంది. అందుకే మేము రివర్స్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నామని’ ముస్తఫా వివరించారు.

టాక్సిర్‌డెర్మీ పక్షులను యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పంజరంలో ఉంచారు. రెక్కలు కొట్టుకునే తీరు, ఎగిరే ఎత్తు, వేగం అన్నింటినీ అక్కడ రికార్డు చేస్తున్నారు. తద్వారా గాల్లో ఎగురుతున్న విమానాల తీరులో ఎలాంటి మార్పులు చేయొచ్చో పరిశోధిస్తున్నారు. ఒక వేళ తమ ప్రయోగాలు ఫలిస్తే ఆ సాంకేతికతను విమానాలకూ వర్తింప జేసి ఎంతో శక్తిని, ఇంధనాన్ని ఆదా చేయొచ్చని ప్రొఫెసర్‌ ముస్తఫా అభిప్రాయపడుతున్నారు. న్యూ మెక్సికో టెక్‌లోని పీహెచ్‌డీ విద్యార్థి బ్రెండన్‌ హెర్కన్‌హాఫ్ పక్షి డ్రోన్‌ రంగులు, ఎగిరే సామర్థ్యంపై పరిశోధన సాగిస్తున్నారు. పక్షుల రంగులు వాటి సహచరులను ఆకర్షించడానికి, శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడతాయని చాలా మంది అభిప్రాయం. అయితే పక్షులు ఎగిరే సామర్థ్యంలో రంగుల పాత్ర ఎంత వరకు ఉంటుందనే విషయంపై బ్రెండన్‌ అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం టాక్సిర్‌డెర్మీ నమూనా పక్షులు 20 నిమిషాల వరకు ఎగురుతున్నాయి.

ఏంటీ టాక్సిర్‌డెర్మీ?

‘టాక్సిర్‌డెర్మీ’ అనేది గ్రీకు పదం. ఇందులో ‘టాక్సిర్‌’ అంటే ‘అమరిక’.. ‘డెర్మా’ అంటే చర్మం అని అర్థం. ‘టాక్సిర్‌డెర్మీ’ చనిపోయిన జంతువులు, పక్షులను భద్రపరిచే విధానం. అలా భద్రపరిచిన వాటిని పరిశోధనలు, ప్రదర్శనలకు వినియోగిస్తారు. ‘టాక్సిర్‌డెర్మీ’లో దాదాపు ఐదు రకాల పద్ధతులను అనుసరిస్తారు. అందులో ‘మౌంటింగ్‌’ ఒకటి. ఈ విధానంలో పక్షి లేదా జంతువు చర్మాన్ని మాత్రం తొలగించి దాన్ని ఒక కృత్రిమ శరీరానికి అతికిస్తారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని