ఈ దేశాలూ నోట్ల రద్దు చేశాయి.. కానీ!

నోట్ల రద్దుతో భారత్‌ తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరగలేదు. కానీ, గతంలో కొన్ని దేశాలు నోట్ల రద్దు చేసి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. 

Published : 02 Jan 2023 20:53 IST

దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఆరేళ్లు దాటింది. ఈ నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిస్తూ డిమానిటైజేషన్‌ను సమర్థించింది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. కానీ, గతంలో కొన్ని దేశాలు ఇదే పని చేసి ఆర్థిక సంక్షోభాన్ని కొనితెచ్చుకున్నాయి. ఆ దేశాలేవో తెలుసుకుందామా..

నైజీరియా
ఆఫ్రికా ఖండంలోని నైజీరియాలో 1984లో నోట్లను రద్దు చేశారు. అప్పటి  ప్రభుత్వం కొత్త నోట్లను ప్రవేశపెట్టి.. పాత నోట్లను రద్దు చేసింది. కానీ, ఈ మార్పును దేశం స్వీకరించలేకపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 

ఘనా
దేశీయ మార్కెట్లో అదనపు ద్రవ్యాన్ని తొలగించడానికి, పన్ను ఎగవేతల్ని అరికట్టేందుకు ఘనా ప్రభుత్వం 1982లో స్థానిక కరెన్సీలో 50 సెడిస్‌ నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలు బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహించారు. స్థిరచరాస్తులు కూడబెట్టుకున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. 

పాకిస్థాన్‌
పొరుగుదేశం పాకిస్థాన్‌లో పాత నోట్లను రద్దు చేసి కొత్త డిజైన్‌ నోట్లను 2016లో ప్రవేశపెట్టారు. పాత నోట్లు 2016 డిసెంబర్‌ 1 తర్వాత చెల్లవని ప్రకటించారు. కానీ, వాటి చలామణీని 2022 డిసెంబర్‌ 31 వరకు పొడిగించారు. ఇకపై పాత నోట్లు పాక్‌లో చెల్లుబాటు కావు. 

జింబాబ్వే
దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడానికి 2008లో 100 ట్రిలియన్‌ డాలర్‌ నోటును ప్రవేశపెట్టారు. కానీ, ఆ నిర్ణయం మంచి ఫలితానివ్వలేదు. మరుసటి ఏడాదే ఆ దేశాధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే వాటిని రద్దు చేశారు. దీంతో ఆ నోటు విలువ 0.5 డాలర్‌కి పడిపోయింది. ఆ నోట్లను కొందరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి కూడా పెట్టారు.

ఉత్తర కొరియా
ఈ దేశ అప్పటి అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ 2.. 2010లో ఆకస్మికంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. దేశంలో చలామణిలో ఉన్న నోట్ల విలువలో రెండు సున్నాలు తొలగించారు. అంటే వంద విలువ ఒకటికి పడిపోయింది. పాత నోట్లను మార్పిడి చేసుకోవాలని ప్రజలను ఆదేశించారు. అధ్యక్షుడి నిర్ణయంతో ప్రజలు మరింత పేదవాళ్లయ్యారు. 

సోవియట్‌ యూనియన్‌
సోవియట్‌ అధ్యక్షుడు మిఖైల్‌ గోర్బచేవ్‌ నల్లధనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 1991లో పెద్దనోట్ల(50, 100 రుబెల్స్‌)ను రద్దు చేశారు. కానీ, ఆ నిర్ణయం ప్రజలకు ప్రతికూలంగా మారింది.

ఆస్ట్రేలియా
ఆసీస్‌ ప్రభుత్వం నకిలీ నోట్లను తొలగించడానికి పేపర్‌ నోట్ల స్థానంలో ప్లాస్టిక్‌ నోట్లను తీసుకొచ్చింది. నోట్లను రద్దు చేయలేదు కానీ.. క్రమంగా నోట్ల మార్పిడి జరిగిపోయింది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సమస్యలు రాకపోవడం విశేషం. 

మయన్మార్‌
దేశంలో నల్లధనం, అవినీతిని నిర్మూలించాలని అక్కడి మిలటరీ.. చలామణిలో ఉన్న డబ్బు విలువలో 80శాతం కోత విధించింది. దీంతో ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనల్లో అనేకమంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి.

కాంగో
ఈ దేశంలో 1887-1967 వరకు అక్కడి కరెన్సీగా ఫ్రాంక్స్‌ చలామణిలో ఉండేవి. ఆ తర్వాత జెయిర్‌గా మార్చారు. తిరిగి 1997లో జెయిర్‌ స్థానంలో ఫ్రాంక్స్‌ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో అక్కడి కరెన్సీ విలువలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. లక్ష న్యూ జెయిర్స్‌ ఒక ఫ్రాంక్‌తో సమానమైంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని