Wi Fi: వైఫై సృష్టి వెనుక అందాల హాలీవుడ్‌ తార! 

ప్రస్తుతం మన జీవితాలు ఆన్‌లైన్‌తో ముడిపడి ఉన్నాయి. షాపింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్నీ.. ఆన్‌లైన్‌లో చకచకా చేసుకోగలుతున్నాం. జీపీఎస్‌ ద్వారా కావాల్సిన ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇంటర్నెట్‌.. వైఫై సదుపాయం ఉండాలి

Updated : 08 Nov 2021 12:43 IST

ప్రస్తుతం మన జీవితాలు ఆన్‌లైన్‌తో ముడిపడి ఉన్నాయి. షాపింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్నీ.. ఆన్‌లైన్‌లో చకచకా చేసుకోగలుతున్నాం. జీపీఎస్‌ ద్వారా కావాల్సిన ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇంటర్నెట్‌.. వైఫై సదుపాయం ఉండాలి. అందుకే ఇంట్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పెట్టించుకొని కుటుంబసభ్యులంతా వైఫైతో మొబైల్‌/ల్యాప్‌ట్యాప్‌ వంటి డివైజ్‌లు వినియోగిస్తుంటారు. కేఫ్‌, రైల్వేస్టేషన్‌ వంటి పలుచోట్ల కూడా తప్పనిసరిగా వైఫై సదుపాయం ఉంటుంది. ఇదే లేకపోతే చాలా పనులు ఆగిపోయే పరిస్థితి. మరి ఇలాంటి సాంకేతికతను కనిపెట్టిందెవరో తెలుసా?ఏ శాస్త్రవేత్తనో కనిపెట్టి ఉంటారనుకుంటే పొరపాటే. దీన్ని కనిపెట్టింది ఓ సినీతార. హాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతూనే.. మరోవైపు ఈ వైఫై టెక్నాలజీని కనిపెట్టారామె. కానీ, వెండితెర వెలుగుల్లో ఆమె సృష్టిని ఎవరూ గుర్తించలేకపోయారు. 

ఎవరా సినీతార?

హెడీ లామర్‌.. హాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. వెండితెరపై ఆమె అందం.. అభినయం ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకునేది. అందుకే ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి. కానీ, ఆమె ధ్యాసంతా సాంకేతికత మీద.. కొత్త ఆవిష్కరణలు చేయడంపై ఉండేది. ఆస్ట్రియాలో 1914లో జన్మించిన హెడీ 16 ఏళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించారు. 1933లో చెక్‌ రిపబ్లిక్‌ సినిమా ‘ఎక్‌స్టసీ’ చిత్రంలో నటించి స్టార్‌డమ్‌ సంపాదించారు. 1938లో ‘అల్జీర్స్‌’ చిత్రంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. హాలీవుడ్‌తోపాటు ఆస్ట్రియన్‌, జర్మన్‌, చెక్‌ భాషల సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా మారిపోయారు. అయినా ఏదో ఒకటి కనిపెట్టాలన్న కోరిక ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.

ఆలోచన పుట్టిందలా..

వ్యక్తిగత జీవితంలో హెడీ ఆరుగురిని వివాహం చేసుకుంది. మొదటి భర్త మాండిల్‌ ఆయుధాల తయారీ కంపెనీ యజమాని. దీంతో యుద్ధం.. ఆయుధాలకు సంబంధించిన అంశాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది. కాగా.. హెడీ హాలీవుడ్‌లో తొలి సినిమా విడుదలైన మరుసటి ఏడాదే రెండో ప్రపంచయుద్ధం మొదలైంది. జర్మనీ, జపాన్‌, ఇటలీ ఒక కూటమిగా.. సోవియట్‌ యూనియన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సహా అనేక దేశాలు మరో కూటమిగా.. యుద్ధంలోకి దిగాయి. అమెరికా ఆలస్యంగా యుద్ధంలో పాల్గొంది. అయితే యుద్ధం మొదలైన సమయంలో ఆమెకు హాలీవుడ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయుధాల తనిఖీ అధికారి అయిన జార్జ్‌ అంథీల్‌తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య యుద్ధానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చకు వచ్చేవి. ఈ క్రమంలోనే యుద్ధంలో రేడియో కమ్యూనికేషన్‌ ఎంత ముఖ్యమైందో గుర్తించిన హెడీ.. శత్రువులపై దాడుల్లో టర్పిడోలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా లక్ష్యాన్ని నిర్దేశించడం కోసం ‘ఫ్రీక్వెన్సీ హోపింగ్‌’ టెక్నాలజీని ఆవిష్కరించారు.

ఏ విధంగా పనిచేస్తుంది?

టర్పిడోలలో రేడియో తరంగాల మధ్య ఈ ‘ఫ్రీక్వెన్సీ హోపింగ్‌’ కమ్యూనికేషన్‌ను ఉపయోగిస్తే, ట్రాన్స్‌మీటర్‌, రిసీవర్‌కి చెందిన రేడియో తరంగాలు ఇతర తరంగాల నుంచి జోక్యం/అంతరాయం లేకుండా క్యారియర్‌ ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ గమ్యానికి చేరుతాయి. ఈ కమ్యూనికేషన్‌ వ్యవస్థకు హెడీ.. అంథీల్‌తో కలిసి పేటెంట్‌ హక్కులను సైతం సంపాదించారు. అయితే ఈ టెక్నాలజీని యుద్ధంలో ఉపయోగించమని హెడీ.. అమెరికా నేవీకి అందజేశారు. కానీ దీన్ని నేవీ ఉపయోగించలేదు. అయితే 1950లో సైన్యం సబ్‌మెరైన్‌లను గుర్తించడం కోసం ఈ కమ్యూనికేషన్‌ వ్యవస్థను వినియోగించింది. 1962 నుంచి నౌకల్లోనూ దీన్ని వినియోగించడం మొదలుపెట్టింది.

ఇప్పుడెలా ఉపయోగపడుతుంది?

కంప్యూటర్‌.. ఇంటర్నెట్‌ వినియోగం పెరగడంతో వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. అదే వైఫై. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఒక నెట్‌వర్క్‌ నుంచి వివిధ డివైజ్‌లకు వైఫై రూపంలో అనుసంధానం అవుతుంది. ఈ క్రమంలో రేడియో తరంగాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఫ్రీక్వెన్సీ హోపింగ్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థే ఉపయోగపడుతోంది. ఈ టెక్నాలజీతోనే కాలక్రమంలో లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌(లాన్‌), వైర్‌లెస్‌ లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌, వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌ వ్యవస్థలు ఆవిష్కృతమయ్యాయి. 1998లో తొలిసారి వైఫైను ఉపయోగించగా.. 2005 నుంచి ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హెడీ 85 ఏళ్ల వయసులో 2000 జనవరి 19న కన్ను మూశారు. ‘ఫ్రీక్వెన్సీ హోపింగ్‌’ కమ్యూనికేషన్‌ వ్యవస్థను రూపొందించినందుకుగానూ 2014లో హెడీ-అంథీల్‌ పేర్లను నేషనల్‌ ఇన్వెంటర్స్‌ హాల్‌ ఫేమ్‌లో ఉంచారు.  

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని