Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ vs పోర్న్‌ స్టార్‌.. ఓ ‘టోర్నమెంట్‌’ కథ..!

అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై  (Donald Trump) ఓ పోర్న్‌స్టార్‌ చేసిన ఆరోపణల వివాదం అక్కడి న్యాయస్థానంలో కొనసాగుతోంది.  ప్రాథమికంగా అవి ధ్రువీకరణ కావడంతో ట్రంప్‌ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గతంలో వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది ఓసారి పరిశీలిస్తే..

Published : 31 Mar 2023 17:16 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్య (America) చరిత్రలో నేరాభియోగాలు ఎదుర్కొన్న ఓ మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిలిచారు. తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన ఓ పోర్న్‌స్టార్‌ (Stormy Daniels)ను డొనాల్డ్‌ ట్రంప్‌ డబ్బుతో ప్రలోభపెట్టారనేవి ఆరోపణలు. తాజాగా న్యాయస్థానంలో ఆ అభియోగాలు ధ్రువీకరణ కావడంతో.. ఈ నేరారోపణలపై విచారణ జరగనుంది. ఈ క్రమంలో ట్రంప్‌ అరెస్టు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు డొనాల్డ్‌ ట్రంప్‌- పోర్న్‌స్టార్‌ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..

టోర్నమెంట్‌లో తొలిచూపు..

స్టార్మీ డానియల్‌ అసలు పేరు స్టిఫనీ క్లిఫర్డ్‌ (44). లూసియానాకు చెందిన ఆమె పలు చిత్రాల్లో నటించారు. 2006 జులైలో జరిగిన ఓ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో అమెరికా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డొనాల్డ్‌ ట్రంప్‌ను తొలిసారి కలుసుకున్నట్లు ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు. ‘ఆ టోర్నమెంట్‌ సమయంలో ట్రంప్‌ బాడీగార్డ్‌ ఆహ్వానం మేరకు.. ట్రంప్‌తో కలిసి భోజనం చేశా. ఆ సమయంలో తన కవర్‌ ఫొటోతో ఉన్న ఓ గోల్ఫ్‌ మ్యాగజైన్‌ను ట్రంప్‌ చూపించారు. అప్పట్లో ఓ పాపులర్‌ టీవీ షో(Celebrity Apprentice)ను నిర్వహిస్తున్న ట్రంప్‌.. అందులో కనిపించేందుకు ఆసక్తి ఉందా? అని అడిగారు. అనంతరం మేమిద్దరం ఏకాంతంగా గడిపాం’ అని 2018లో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కార్యక్రమంలో డానియల్‌ వెల్లడించారు.

2007లో మరోసారి..

అనంతరం కొంతకాలం ట్రంప్‌ తనతో టెలిఫోన్‌లో టచ్‌లో ఉన్నారని ఆమె తెలిపింది.  రియాలిటీ షోలో పాల్గొనే అంశంపై చర్చించేందుకు 2007లోనూ లాస్‌ ఏంజెల్స్‌లో ఇద్దరు కలుసుకున్నారట. అయితే, ఆ సమయంలోనూ ఏకాంతంగా గడపాలని ట్రంప్‌ కోరినప్పటికీ తాను అంగీకరించలేదని డానియల్‌ తెలిపారు. ఇది జరిగిన నెల తర్వాత ట్రంప్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని.. సెలబ్రిటీ షోలో తీసుకోలేకపోతున్నామని చెప్పినట్లు వివరించారు.

అప్పట్లో ఆమె వయసు 27 ఏళ్లు కాగా ట్రంప్‌ వయసు 60 సంవత్సరాలు. అప్పటికే మెలానియాను ట్రంప్‌ మూడో పెళ్లి చేసుకొని ఏడాది అయ్యింది. మెలానియా తన కుమారుడు బారెన్‌కు జన్మనిచ్చిన నాలుగు నెలలకే ట్రంప్‌- డానియల్‌ కలుసుకున్నట్లు సమాచారం. 2018లో విడుదలైన ఓ పుస్తకం (Full Disclosure)లో ట్రంప్‌ను కలిసిన విషయాన్ని డానియల్‌ ప్రస్తావించారు. అయితే, ట్రంప్ మాత్రం డానియల్‌ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. కేవలం డబ్బు కోసమే ఆమె ఇవన్నీ ఆరోపణలు చేస్తోందని.. ఆమెతో ఎన్నడూ శృంగారంలో పాల్గొనలేదని ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ స్పష్టం చేశారు.

వివాదానికి కారణమైన ఒప్పందం..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా 2016లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా  బరిలో దిగిన ట్రంప్‌ అందులో విజయం సాధించారు. ఆ సమయంలోనే.. లైంగిక సంబంధాలను బయటకు పొక్కనీయకుండా డానియల్‌ను డబ్బుతో ప్రలోభపెట్టారనేది ఆరోపణ. ఈ వ్యవహారంలో ట్రంప్‌ లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ఆమెకు 1.30 లక్షల డాలర్లు సమకూర్చి ఆమెతో (ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో) ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇది చెల్లదంటూ డానియల్‌ కోర్టును ఆశ్రయించారు కూడా. తాజాగా ఇవే ఆరోపణలను న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌ న్యాయస్థానం ధ్రువీకరించింది. దీంతో ఈ అభియోగాలపై ట్రంప్‌ విచారణ ఎదుర్కోనున్నారు. ఈ క్రమంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని