Viral: అరే..సముద్రానికి నిప్పంటుకుంది..!

ప్రశాంతంగా ఉండే సముద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిపర్వతం నుంచి లావా బుసలు కొడుతున్నట్లు అప్పటికప్పుడే ఎర్రని మంటలు వ్యాపించాయి. ఈ ఘటన మెక్సికోలోని యుకటాన్‌  ద్వీపకల్పానికి పశ్చిమ సముద్రతీరంలో..

Updated : 03 Jul 2021 19:04 IST

మెక్సికో: ప్రశాంతంగా ఉండే సముద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిపర్వతం నుంచి లావా బుసలు కొడుతున్నట్లు అప్పటికప్పుడే ఎర్రని మంటలు వ్యాపించాయి. ఈ ఘటన మెక్సికోలోని యుకటాన్‌ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్రతీరంలో చోటు చేసుకుంది. ఇదేంటి సముద్రంలో మంటలు చెలరేగడం ఏంటి అనుకుంటున్నారా? పెమెక్స్‌ ఆయిల్‌ రిగ్గింగ్‌ సంస్థకు చెందిన పైప్‌లైన్‌ పగిలిపోవడంతో ఈ ఘటన జరిగింది.

సముద్రం లోపల రిగ్గింగ్‌ చేసి, అంతర్భాగంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ల ద్వారా ముడిచమురును బయటకు తీసుకొస్తారు. తాజాగా సముద్రం మధ్యలో పైప్‌లైన్‌ పగిలిపోవడంతో ముడి చమురు ఒక్కసారిగా లీకైంది. అయితే మంటలు ఎలా వ్యాపించాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. విషయం తెలుసుకున్న పెమెక్స్‌ సంస్థ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి  చేరుకుని దాదాపు 5 గంటలపాటు కష్టపడి మంటలు అదుపు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5.15 గంటలకు ఘటన జరగ్గా.. 10.30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి.

విషయం తెలిసిన వెంటనే ఉత్పత్తిని నిలిపివేసినట్లు పెమెక్స్‌కు చెందిన ‘కు మలూబ్‌ జాప్‌’ వెల్లడించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఆయిల్‌ ఉత్పత్తిపైనా ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కు మలూబ్‌ జాప్‌ పెమెక్స్‌కు చెందిన అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి సంస్థ. పెమెక్స్‌ ఉత్పత్తిలో ఇక్కడి  నుంచే దాదాపు 40 శాతం వెళ్తుంది. రోజుకు 1.7 మిలియన్‌ బారెల్స్‌ ముడిచమురును ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని