James wilson-Budget : బ్రిటిష్ ఖజానాకు గండి .. బడ్జెట్ రూపకల్పనకు జేమ్స్ విల్సన్ నాంది
భారత్‌లో తొలిసారి బ్రిటిష్ వలస పాలకులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సిపాయిల తిరుగుబాటు అందుకు కారణమైంది. బడ్జెట్ రూపకల్పన చేసేందుకు అప్పటి ఆర్థిక నిపుణుడు జేమ్స్ విల్సన్ ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో తెలుసుకోండి.
స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి భారత్‌లో బడ్జెట్(Budget) ప్రవేశపెడుతున్నారు. అయితే బ్రిటిష్ హయాంలో(british rule) దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని రూపకర్త ఎవరు? ఆయన ఎలాంటి విధానాలతో భారత తొలి బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారో చదివేయండి మరి.
1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. సాఫీగా సాగిపోతున్న బ్రిటిష్ పాలనకు అదో కంటగింపు చర్యగా మారింది. ఆ తర్వాత నుంచి తిరుగుబాటుదారులను అణచివేయడానికి బ్రిటిష్ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయానికి బాగా గండి పడింది. ఈ నేపథ్యంలో భారత(india) ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి 1859వ సంవత్సరంలో క్వీన్ విక్టోరియా(queen victoria).. జేమ్స్ విల్సన్(james wilson) అనే ఆర్థిక నిపుణుడిని నియమించింది. అప్పటికే ఆయన ఎకనామిస్ట్ పత్రికను నడిపేవాడు. ఆర్థిక సిద్ధాంతాలు, పాలసీలపై ఆయనకు బాగా పట్టు ఉండేది. వాణిజ్య వ్యవహారాలపై విల్సన్‌కు అపార జ్ఞానం ఉందని ఇంగ్లాండ్(england) విశ్వసించేది. కారల్ మార్క్స్ తాను రచించిన ‘క్యాపిటల్’ గ్రంథంలో విల్సన్‌ను ‘యాన్ ఎకనామిక్ మాండరిన్ ఆఫ్ హై స్టాండింగ్’గా అభివర్ణించాడు.
ఎవరీ జేమ్స్ విల్సన్?
జేమ్స్ విల్సన్ స్కాట్లాండ్‌లోని హావిక్ పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. కుటుంబం మొత్తం టోపీలు తయారు చేసి విక్రయించేవారు. జేమ్స్‌కు న్యాయశాస్త్రం చదవాలని ఆసక్తి ఉండేది. కానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా టోపీల వ్యాపారానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తూనే జేమ్స్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. వ్యాపార నిమిత్తం 1824లో లండన్‌కు మకాం మార్చాడు. అక్కడ వ్యాపారులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ.. కార్న్ చట్టాలను తొలగించాలని కరపత్రాల ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించేవాడు. స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అడ్డంకులు ఉండకూడదని అనేక వ్యాసాలను రచించాడు. ఆ క్రమంలోనే ఎకనామిస్ట్ పత్రికను స్థాపించాడు. వ్యాపారాన్ని వీడి పూర్తి సమయం పత్రికను నడిపేందుకు కేటాయించాడు. తరువాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు. హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎంపికయ్యాడు. జేమ్స్ పనితీరు నచ్చడంతో బ్రిటిష్ ప్రధాని జాన్ రస్సెల్ ఆయన్ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సెక్రటరీగా నియమించారు. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగాడు.
భారత్‌లో ఆర్థిక పరిస్థితులు గతి తప్పిన నేపథ్యంలో జేమ్స్ విల్సన్‌ను వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆర్థిక సభ్యుడిగా నియమించారు. దాంతో అయిష్టంగానే విల్సన్ భారత్‌లోకి అడుగుపెట్టాడు. కోల్‌కతా నుంచి లాహోర్ వరకు ప్రయాణించి రెవెన్యూ అధికారులతో సమీక్ష చేసి భారత పరిస్థితులను అవగతం చేసుకున్నాడు. ఆర్థిక రంగం పురోగతి సాధించి.. పరిపాలన సాఫీగా సాగాలంటే ఐదు సంస్కరణలు చేయాలని భావించాడు.
అవేంటంటే.. 1. వ్యాపార వర్గాలపై పన్ను(tax) వేయడం 2. పేపర్ కరెన్సీ తీసుకురావడం 3. బడ్జెట్, అంచనాలను సిద్ధం చేయడం 4. సివిల్ పోలీసుల నియామకం 5. ప్రజా పనులు, రోడ్లు వేయడం. ఇవే కాకుండా మిలిటరీ ఫైనాన్స్ కమిషన్, సివిల్ ఫైనాన్స్ కమిషన్‌లను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని.. దాంతో నిధుల కేటాయింపు, ఖర్చులపై ఓ స్పష్టత వస్తుందని ఆశించాడు.
అప్పుడే తొలి బడ్జెట్
భారత దేశ వైవిధ్యం, ప్రజలు, ప్రాంతాల అవసరాలపై పట్టు సాధించిన జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో వివిధ డ్యూటీలను హేతుబద్ధీకరణ చేశాడు. ఇన్‌కమ్ ట్యాక్స్, లైసెన్స్ ట్యాక్స్, టొబాకొ డ్యూటీ ఉంటాయని చెప్పాడు. ఐదేళ్లపాటు ట్యాక్సుల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. అయితే జేమ్స్ ప్రతిపాదనలను అప్పటి మద్రాస్ గవర్నర్ ఛార్లెస్ ట్రెవెలియన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దాంతో లైసెన్స్ ట్యాక్స్, టొబాకొ డ్యూటీలపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
అలా భారత్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విల్సన్ 1860 ఆగస్టు 11వ తేదీన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు. కోల్‌కతాలోని ముల్లిక్ బజార్లోనే ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. భారత్‌లో ఆయన ఉన్నది ఎనిమిది నెలలే అయినప్పటికీ అంత్యక్రియలకు జనం భారీగా హాజరయ్యారు. విల్సన్ సేవలను కీర్తిస్తూ కోల్‌కతాలోని వ్యాపార వర్గాలు డల్హౌసీ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత తొలి ఆర్థిక మంత్రి షణ్ముఖం శెట్టి బడ్జెట్‌ను రూపొందించారు. 1947 నవంబర్ 26న ఆయన బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. రూ.197 కోట్లతో బడ్జెట్ తయారు చేయగా.. దాదాపు రూ.92.74 కోట్లను రక్షణ రంగానికి కేటాయించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
TikTok: టిక్‌టాక్ బ్యాన్‌తో నాకూ లాభమే: జస్టిన్ ట్రూడో
-
Politics News
సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను శిక్షించాలి: ఏక్నాథ్ శిందే
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Movies News
Avatar 2 OTT Release Date: ఓటీటీలో అవతార్ 2.. ప్రీబుకింగ్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే!
-
Politics News
YSRCP: అన్నీ ఒట్టి మాటలేనా?.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ
-
Sports News
Ashwin: మాది బలమైన జట్టు..విమర్శలపై ఘాటుగా స్పందించిన అశ్విన్