Floating post office : నీటిపై తేలియాడే పోస్టాఫీసు గురించి ఎప్పుడైనా విన్నారా?

నీటిపై తేలియాడే పోస్టాఫీసు! వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఈ పోస్టాఫీసు ఎప్పుడు ప్రారంభించారు? అందులో ఎలాంటి సేవలు అందుతున్నాయో తెలిస్తే తప్పకుండా అవాక్కవుతారు. 

Published : 24 Jan 2023 11:45 IST

ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. వాటిని చూసినప్పుడు, వాటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోతుంటాం. అలాంటి కోవకు చెందినదే ఈ తేలియాడే పోస్టాఫీసు(post office). ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంది. అది కూడా మన దేశంలోని శ్రీనగర్‌(srinagar)లో ఉంది. నిత్యం పోస్ట్‌మ్యాన్‌ ఇక్కడ ఉత్తరాలు సేకరించి షిఖారాలపై తిరుగుతూ దాల్ సరస్సు(dal lake)లోనే నివాసం ఉంటున్న వారికి వాటిని అందజేస్తూ ఉంటాడు. ఆ పోస్టాఫీసు విశేషాలేంటో తెలుసుకుందామా..!

ఎప్పుడు ప్రారంభమైంది?

ఈ పోస్టాఫీసు బ్రిటిష్‌(british era) కాలంలోనే ప్రారంభమైంది. దీనికి దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. చివరి మహారాజు హరి సింగ్‌ పాలనలో కూడా ఇక్కడ నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. 2011లో జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన ఒమర్‌ అబ్దుల్లా(Omar Abdullah) ఈ తేలియాడే పోస్టాఫీసును మరిన్ని సౌకర్యాలతో పునః ప్రారంభించారు. ఈ పోస్టాఫీసు ప్రాంగణంలోనే అరుదైన స్టాంపుల మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో ఎన్నో రకాల తపాల బిళ్లలు ఉంటాయి. ఆ పక్కనే ఉన్న దుకాణంలో పోస్టుకార్డులు, స్టాంపులు, స్థానికంగా దొరికే వస్తువులు, గ్రీటింగ్‌ కార్డులు విక్రయిస్తారు. దీనికి సమీపంలోనే  తేలియాడే మసీదు, మార్కెట్ కూడా ఉన్నాయి.

షికారాపైనే నిర్మాణం

కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో.. చుట్టూ సహజత్వం ఉట్టిపడే కొండల మధ్య ఉండే దాల్‌ సరస్సు అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. ఆ సరస్సులోనే ఈ తేలియాడే పోస్టాఫీసును ఏర్పాటు చేశారు. దీని నిర్మాణ శైలి చాలా వైవిధ్యంగా ఉంటుంది. తొలిసారి చూసిన వారు దీనిని పోస్టాఫీసు అని గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే అక్కడ ఎన్నో షికారాలు(పడవలు) తిరుగుతూ ఉంటాయి. ఈ పోస్టాఫీసు కూడా ఇంచుమించు వాటిలాగే ఉంటుంది. కాబట్టి పర్యాటకులు(tourist) ఎవరైనా సరే దీనిని ప్రత్యేకంగా చూసి గుర్తు పట్టాల్సి ఉంటుంది. అక్కడ షికారాలు నడిపే వాళ్లు కూడా దీని విశేషాల గురించి కొత్తవారికి చెబుతుంటారు. భారతీయ పోస్టాఫీసుల ఎదుట ఉండే లోగోలానే ‘ఫ్లోటింగ్‌ పోస్టాఫీస్‌-దాల్‌ లేక్‌’ అనే అక్షరాలు దానిపై రాసి ఉంటాయి. 

ఇంటర్నెట్.. అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌

స్థానికులు ఈ పోస్టాఫీసు సేవల(services)ను నిత్యం వినియోగించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న సమాచార యుగంలో ఈ పోస్టాఫీసు గురించి తెలుసుకున్న యాత్రికులు తప్పకుండా దీనిని సందర్శిస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన వారికి ప్రేమతో ఓ లేఖ పంపి ఇక్కడి ప్రత్యేకతను తెలియజేస్తుంటారు. ఈ పోస్టాఫీసులో ‘దాల్‌ లేక్‌’ ప్రత్యేకతను చాటుతూ ముద్రితమైన స్టాంపులు(stamps) కూడా లభిస్తాయి. ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంటుంది. మొబైళ్లలో సిగ్నల్‌ సరిగా రాని సందర్భంలో పలువురు ఇక్కడకు వచ్చి ఆ సేవలను వినియోగిస్తుంటారు. అంతే కాదండోయ్‌.. అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం ఇక్కడి మరో ప్రత్యేకత. 

ఈ సారి ఎప్పుడైనా మీరు శ్రీనగర్‌ను సందర్శిస్తే.. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పోస్టాఫీసు నుంచి మీకు ప్రియమైన వారికి ఓ లేఖ పంపించడానికి ప్రయత్నించండి. ఆ అనుభూతిని జ్ఞాపకంగా మలుచుకోండి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు