Published : 13/11/2021 09:53 IST

Music: విధి కాటేసినా.. కళ్లతో సంగీతం సమకూరుస్తున్నాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతడో సంగీత కళాకారుడు. ఫ్రాన్స్‌లోని పాపులర్‌ ర్యాప్‌బ్యాండ్‌లో సభ్యుడు. తన సంగీతంతో ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకునేవాడు. కానీ, అతడి ప్రతిభ, ఎదుగుదలను చూసి విధి ఈర్ష్య పడిందేమో. ఎంతో చురుగ్గా ఉండే అతడిని ఓ అరుదైన వ్యాధి రూపంలో కాటేసింది. దీంతో పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. అయినా, చెదరని సంకల్పంతో విధిని సైతం ఎదిరించి కేవలం కళ్లతోనే సంగీతం సమకూర్చడం ప్రారంభించాడు. ఇటీవల అతడు రూపొందించిన ఆల్బమ్‌ విడుదలై.. అందరితో ఔరా అనిపించుకుంటోంది.

ఫ్రాన్స్‌కు చెందిన 46 ఏళ్ల గిల్‌హెమ్‌ గలెర్ట్‌ అలియాస్‌ పోనె.. ఫొంకీ ఫ్యామిలీ ర్యాప్‌బ్యాండ్‌లో సంగీత కళాకారుడిగా ఉండేవాడు. ఎన్నో ప్రదర్శనలు చేసి రాక్‌స్టార్‌గా పేరు సంపాదించాడు. అయితే, 2014లో అతడికి అమియోట్రొఫిక్‌ లేటరల్‌ స్ల్కేరోసిస్‌(ఏఎల్‌ఎస్‌) వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధి వల్ల కండరాలు రోజుకురోజుకు క్షీణించి శరీరం పనిచేయకుండా పోతుంది. ఈ క్రమంలో పోనెకు పక్షవాతం వచ్చింది. కాళ్లూ చేతులు పడిపోయి మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. చివరికి శ్వాస తీసుకోవడం, తినడం కష్టమైపోయింది. దీంతో అతడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రాణవాయువు నేరుగా ఊపిరితిత్తులకు అందేలా గొంతులో ట్రాకియోటమీ, ఆహారం నేరుగా కడుపులోకి పంపించడానికి జీ-ట్యూబ్‌ అమర్చారు.

టెక్నాలజీ సాయంతో..

ఎన్నో వేదికలపై సంగీతం వినిపించిన పోనెను ఇకపై సంగీత వాయిద్యాలను పట్టుకోలేకపోతాననే బాధ వెంటాడేది. అయితే కొన్నాళ్ల కిందట ఆధునిక టెక్నాలజీ సహాయంతో కళ్లతో మ్యూజిక్‌ కంపోజ్‌ చేయొచ్చని విషయం అతడికి తెలిసింది. ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్‌లో కళ్ల కదలికను గుర్తించే సెన్సార్లు ఉంటాయి. కంప్యూటర్‌లో వివిధ వాయిద్యాలపై ఎక్కడ కంటిచూపును నిలిపితే అక్కడ ధ్వని వినపడుతుంది. దీంతో పోనె ఆశలు మళ్లీ చిగురించాయి. సంశయాలన్నీ పక్కన పెట్టి కంప్యూటర్‌ను తెప్పించుకొని సంగీత సాధన ప్రారంభించాడు. మొదట తన అభిమాన కళాకారుడి సంగీతాన్ని తిరిగి సమకూర్చే ప్రయత్నం చేశాడు. వాయిద్యాలపై దృష్టి నిలపడం.. కంప్యూటర్‌కు సరైన కమాండ్‌ ఇవ్వడంపై ఎంతో శ్రమించాడు.

కళ్లతోనే ఆల్బమ్‌ రూపకల్పన 

పోనెకు భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారంతా పోనెకు మద్దతుగా నిలిచారు. అలా కుటుంబ ప్రోత్సాహం, పట్టుదల, ఆత్మస్థైర్యంతో కళ్ల కదలికతో సంగీతంపై పట్టు సాధించిన పోనె.. ఈ ఏడాది జనవరిలో మంచంపై పడుకొనే కదలకుండా కేవలం తన కళ్లతోనే ఒక ఆల్బమ్‌ రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు. ఆరు నెలలపాటు కష్టపడి మూడు పాటలు రూపొందించాడు. వాటిని ‘పోనె లిసన్‌ అండ్‌ డొనేట్‌’ పేరుతో ఒక ఆల్బమ్‌గా మార్చి గత నెలలో విడుదల చేశాడు. ఈ ఆల్బమ్‌ ద్వారా వచ్చే డబ్బును తనలా ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారి సంక్షేమానికి ఖర్చు చేయనున్నట్లు పోనె వెల్లడించాడు. మళ్లీ సంగీతం సమకూర్చే అవకాశం దక్కడం.. తను తాజాగా రూపొందించిన ఆల్బమ్‌కు ఆదరణ లభిస్తుండటంతో పోనె ఎంతో సంతోషంగా ఉన్నాడు.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని