
సింహాలను విమానంలో ఎక్కడకు తీసుకెళ్లారు?
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం : ఆగస్టు 5, 2018.. దక్షిణాఫ్రికాలోని ఒక విమానాశ్రయం.. 24 సింహాలు అచేతనంగా పడివున్నాయి.. చూసేవాళ్లకి ఎవరైనా వేటగాళ్లు వాటిని చంపేశారా అని అనుమానాలు వస్తున్నాయి... అయితే అవన్నీ ప్రాణాలతో ఉన్నవే.. దక్షిణాఫ్రికా 24 సింహాలను మొజాంబిక్ అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న కబెలా ఫాండేషన్, ఇవాన్ కార్టర్ సంస్థలు వీటికి మత్తుమందిచ్చి విమానాల్లో మొజాంబిక్‌లోని జాంబేజీ నదీ తీరప్రాంతానికి తరలించారు.
వేల ఎకరాల్లో అభయారణ్యం..
మొజాంబిక్ ప్రభుత్వం జాంబెజీ నదీ తీరప్రాంతంలోని వేలాది ఎకరాల భూములను సింహాల కోసం కేటాయించింది. సమీపంలోని గ్రామమైన సొసెనెలోని తోజ్ ప్రజలు నివసిస్తున్నారు. వీరికి సింహాలతో సాన్నిహిత్యం ఎక్కువ. సింహాలను పూజిస్తారు. ఏ విధంగానూ హాని చెయ్యరు. దీంతో ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు. గ్రామస్థుల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు అక్రమ వేటగాళ్లను ఎలా అడ్డుకోవాలన్న అంశంపై శిక్షణ ఇచ్చారు.
దీంతో పాటు వారికి అవసరమైన ఆహారపదార్థాలతో పాటు మాంసం కూడా సరఫరా చేశారు. ఫలితంగా సింహాలు కొత్తప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగాయి. వీటికి రేడియో కాలర్స్ ఏర్పాటు చేయడంతో జీపీఎస్ ద్వారా ప్రతిరోజు వాటి పరిస్థితిని తెలుసుకున్నారు. వేటగాళ్ల బెడద లేకపోవడంతో సింహాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు దాదాపు 60కి చేరిందని సంస్థల ప్రతినిధులు తెలిపారు.
అప్పట్లో రెండు లక్షల సింహాలు..
ఆఫ్రికాలో 20వ శతాబ్ధి ప్రారంభంలో దాదాపు రెండు లక్షల సింహాలు ఉండేవి. అయితే వలస పాలనలు, అంతర్యుద్ధాలు, జాతుల ఘర్షణ కారణంగా ప్రస్తుతం కేవలం మూడువేలు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా దక్షిణాఫ్రికా, కెన్యా.. తదితర దేశాల్లోనే ఉన్నాయి. జీవవైవిధ్యంలో మృగరాజు కీలకపాత్ర పోషిస్తుంది. మృగరాజును పరిరక్షిస్తే అటవీప్రాంతాలను కాపాడుకోవచ్చు. ఈ లక్ష్యంతోనే ఈసంస్థలు పనిచేస్తున్నాయి.