
బగ్స్ కనిపెట్టారు.. రూ.లక్షలు సంపాదించారు!
కరోనా వైరస్ వ్యాప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాప్‌లో భద్రతపరంగా లోపాలు ఉంటే కనిపెట్టి చెప్పాలంటూ ‘బగ్ బౌంటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లోపాలను కనిపెట్టినవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రివార్డు ప్రకటించింది. దీంతో ఔత్సాహికులు ఈ యాప్‌లో లోపాలు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది.. అనేక సంస్థలకు చెందిన సాఫ్ట్‌వేర్స్‌లో లోపాలను గుర్తించి.. రూ.లక్షల్లో నగదు బహుమతులు గెలుపొందారు. వారిలో మన భారతీయులూ ఉన్నారు. వారెవరు? ఎంత నగదు బహుమతి గెలుచుకున్నారు? తెలుసుకుందాం పదండి..
యాపిల్‌లో లోపం.. ₹56లక్షల రివార్డు
ఓ పరిశోధకుడు యాపిల్ సంస్థ నుంచి ఏకంగా 75 వేల అమెరికన్ డాలర్లు (రూ.56.50లక్షలు) రివార్డు గెలిచాడు. యాపిల్ సంస్థకు చెందిన సఫారీ బ్రౌజర్‌లో ర్యాన్ పికెన్ అనే వ్యక్తి ఏడు బగ్స్ కనుగొన్నాడు. వీటిలో ఒక బగ్ సైబర్ నేరగాళ్లు వెబ్‌క్యామ్‌ను యాక్సెస్ చేసే విధంగా హానికరమైన వన్ క్లిక్ జావా స్క్రిప్ట్‌ను అనుమతిస్తుందని తేలింది. వీటిని యాపిల్ సరిచేసింది.
సీడీఎంలో బగ్.. రూ. 23.66లక్షల నగదు
గూగుల్ నిర్వహించిన బగ్ బౌంటీ కార్యక్రమంలో ఉరుగ్వేకి చెందిన విద్యార్థి 31 వేల డాలర్లు గెలుచుకున్నారు. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఎజిక్వియల్ పెరీరా గూగుల్‌కు చెందిన క్లౌడ్ డెవలప్‌మెంట్ మేనేజర్‌లో భద్రతపరమైన లోపాన్ని గుర్తించారు. సైబర్ నేరగాళ్లు వేరో చోట నుంచే ఆపరేట్ చేసే అవకాశం కల్పించే బగ్‌ను కనిపెట్టడంతో గూగుల్.. పెరీరాకి 31,337 డాలర్లు (రూ.23.61లక్షలు) రివార్డుగా ఇచ్చింది.
మెయిల్‌లో బగ్.. ₹7.5లక్షలు విన్
రష్యాకి చెందిన ఈమెయిల్ ప్లాట్‌ఫాం mail.ruలో భద్రతపరమైన ఓ లోపాన్ని ఓ పరిశోధకుడు గుర్తించాడు. ఇందుకుగాను mail.ru అతడికి 10వేల డాలర్లు (రూ.7.5లక్షలు) నగదు బహుమతి ఇచ్చింది.
బగ్స్‌ను గుర్తించిన భారత కుర్రాళ్లు
ఇన్‌స్టాతో రూ. 22.65 లక్షలు
ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బగ్‌ను చెన్నైకి చెందిన లక్ష్మణ్ ముతియా కనిపెట్టాడు. ఆ బగ్ వల్ల ఎవరి ఇన్‌స్టా అకౌంట్‌నైనా హ్యాక్ చేయొచ్చని నిరూపిస్తూ ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేశాడు. ఈ బగ్‌ను పరిశీలించిన ఫేస్‌బుక్ బృందం సమస్యను పరిష్కరించడంతోపాటు లక్ష్మణ్‌కు 30 వేల డాలర్లు (రూ. 22.65లక్షలు) నగదు బహుమతి అందజేసింది.
ఫేస్‌బుక్‌తో రూ. 15 లక్షలు
ఏప్రిల్‌లో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌లో ఓ లోపాన్ని గుర్తించి భారత్‌కు చెందిన వినోత్ కుమార్ భారీ మొత్తంలో రివార్డు పొందాడు. లాగిన్ విత్ ఫేస్‌బుక్ బటన్‌లో ‘XSS’ బగ్‌ను వినోత్ కనిపెట్టాడు. ఈ బగ్ వల్ల ఫేస్‌బుక్ నుంచి థర్డ్ పార్టీ వెబ్‌సైట్లోకి వెళ్లే క్రమంలో సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నాడు. ఇందుకుగానూ వినోత్ 20వేల డాలర్లు (రూ.15.10లక్షలు) నగదు బహుమతి అందుకున్నాడు.
గూగుల్‌తో రూ. 7.6లక్షలు
కేరళకు చెందిన ప్రతీశ్ నారాయణన్ ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి. ఇటీవల గూగుల్ ప్రకటించిన బగ్ బౌంటీ కార్యక్రమంలో పాల్గొని ఓ బగ్‌ను గుర్తించాడు. సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో శాశ్వతంగా దాడి చేసేందుకు వీలుగా ఏర్పడ్డ బగ్‌ను ప్రతీశ్ కనిపెట్టి గూగుల్‌కు నివేదిక పంపించాడు. దీంతో ప్రతీశ్‌కు గూగుల్ 10వేల డాలర్లు (రూ. 7.5లక్షలు) నగదు బహుమతి ఇచ్చింది. ఇది తొలిసారి కాదు.. ప్రతీశ్ గత రెండు మూడేళ్లలో 13 బగ్‌లు కనిపెట్టి రూ.లక్షలు సంపాదించాడు. ఇప్పటి వరకు ప్రతీశ్.. వాట్సాప్‌లో 9, గూగుల్‌లో 3, మైక్రోసాఫ్ట్‌కు చెందిన గిట్ హబ్‌లో ఒక బగ్‌ను కనిపెట్టాడు.
ఏడాదిలో రూ. 93 లక్షలు
23 ఏళ్ల శివమ్ విశిష్ఠ్ ఓ ప్రొఫెనల్ హ్యాకర్. ఏడాదిలో కాలంలో స్టార్‌బక్స్, ఇన్‌స్టాగ్రామ్, గోల్డ్‌మన్ సాచ్, ట్విటర్, జొమాటో, వన్ ప్లస్ తదితర కంపెనీ చెందిన ప్రొడక్ట్స్‌లో లోపాలు కనిపెట్టి 1,25,000 డాలర్లు (రూ.93 లక్షలు) గెలుచుకున్నాడు.
వాట్సాప్‌తో రూ. 3.5 లక్షలు
కోట్ల మంది యూజర్స్ ఉన్న వాట్సాప్‌లో భద్రతకు సంబంధించిన ఓ లోపాన్ని మన కుర్రాడు కనిపెట్టాడు. మణిపూర్‌కి చెందిన సివిల్ ఇంజినీర్ జోనెల్ సౌగైజామ్ కనిపెట్టిన లోపం ఏంటంటే.. వాట్సాప్ వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి తెలియకుండానే వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్‌కు మారేలా వీలు కలుగుతుందట. వ్యక్తిగత భద్రత విషయంలో కీలకమైన లోపాన్ని గుర్తించిన జోనెల్‌కు వాట్సాప్ యాజమాని అయిన ఫేస్‌బుక్ 5వేల డాలర్లు (రూ. 3.7లక్షలు) రివార్డు ఇవ్వడంతోపాటు ఫేస్‌బుక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో అతడికి చోటు కల్పించింది.
చిన్న మొత్తమే.. కానీ కీలక లోపం
కేరళకు చెందిన 19 ఏళ్ల అనంతకృష్ణన్ వాట్సాప్‌లో ఒక కీలక లోపాన్ని గుర్తించి ఫేస్‌బుక్‌ను హెచ్చరించాడు. వాట్సాప్‌లో ఓ బగ్ యూజర్ వాట్సాప్‌లో ఫైల్స్ అన్నింటిని యూజర్‌కి తెలియకుండానే హ్యాకర్ చోరీ చేసుకొనేందుకు అనుమతించేలా ఉందని గుర్తించాడు. వీలైనంత తర్వగా ఈ లోపాన్ని సరిచేయాలని కోరాడు. దీనిపై రెండు నెలలపాటు పరిశోధన చేసిన ఫేస్‌బుక్ సమస్యలను పరిష్కరించడంతోపాటు అనంతకృష్ణన్‌కు 500 డాలర్లు (సుమారు రూ. 37వేలు) రివార్డు ఇచ్చింది.
ఎంత మొత్తమో తెలియదు.. గానీ పెద్ద లోపం
40 కోట్ల మంది మైక్రోసాఫ్ట్ యూజర్ల డేటా హ్యాకింగ్ గురయ్యే ప్రమాదాన్ని కేరళకు చెందిన ఎన్‌కే సాహద్ ముందుగానే గుర్తించాడు. సెక్యూరిటీ రీసెర్చర్‌గా పనిచేస్తున్న సాహద్ తన సహచరులతో కలిసి మైక్రోసాఫ్ట్‌లోని పలు లోపాలను గుర్తించి సంస్థకు తెలిపాడు. సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్‌కు ఐదు నెలలు పట్టింది. అనంతరం సాహద్‌కు రివార్డు ప్రకటించింది. అయితే ఎంత నగదు ఇచ్చిందో తెలపలేదు.
మే నెలకు సంబంధించి బగ్ బౌంటీ విశేషాల కోసం క్లిక్ చేయండి
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.