కరోనా కాలం: సురక్షిత ఆహారానికి 5 సూత్రాలు

చైనాలో పుట్టి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ఎప్పుడు పోతుందా అని ప్రపంచం ఎదురుచూస్తోంది. ఎక్కడికి వెళ్తాదమన్నా భయం...

Updated : 06 Jun 2020 15:43 IST

కలుషిత ఆహారంతో ఏటా 4,20,000 మంది మృతి
జూన్‌ 7న ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం
డబ్ల్యూహెచ్‌వో పంచ సూత్రాలు

చైనాలో పుట్టి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ఎప్పుడు పోతుందా అని ప్రపంచం ఎదురుచూస్తోంది. ఎక్కడికి వెళ్తాదమన్నా భయం. ఏది ముట్టుకుందామన్నా ఆందోళన. కడుపారా ఏదైనా ఆరగిద్దామన్నా చింతే. ఎందుకంటే కొవిడ్‌-19కు ముందు లేదు. కసరత్తులు చేయడం. సరిపడా విశ్రాంతి తీసుకోవడం. సానుకూలంగా ఆలోచించడం. సురక్షితమైన ఆహారం తీసుకోవడంతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మొదటి మూడూ మన చేతుల్లోనే ఉన్నా సురక్షిత ఆహారం మాత్రం కష్టం. ఎందుకంటే క్రిమి సంహారకాలు లేకుండా పంటలు పండించే పరిస్థితి లేదు. కలుషితం అయ్యాయో లేదో చాలాసార్లు గుర్తించలేం. అందులోని పోషకాల విలువలను లెక్కగట్టలేం. ఈ ఆదివారం (జూన్‌ 7) ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం. అందుకే కలుషిత ఆహారంతో నష్టాలు ఏంటి? సురక్షిత ఆహారం కోసం ఏం చేయాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. అవేంటో తెలుసుకుందామా!!


200 రోగాల భయం

మీకో విషయం తెలుసా? కలుషిత ఆహారం తినడం వల్ల ఏటా ప్రతి పది మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. ఫలితంగా 4,20,000 మంది చనిపోతున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఈ ముప్పు మరీ ఎక్కువ. ఏటా కలుషిత ఆహారంతో సంక్రమించే రోగాలతో 1,25,000 మంది చిన్నారులు మృతి చెందుతున్నారు. సరైన పద్ధతుల్లో ఆహారం వండితే 200 రోగాలను అడ్డుకోవచ్చు.

రోగాలు మెయిన్‌టెన్‌ చేయాలి

కలుషిత ఆహారం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. ప్రమాదకర లోహాలు కలవడం వల్ల ఆహారం విషతుల్యం అవుతుంది. దీంతో క్యాన్సర్‌, నరాల సంబంధమైన దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. అంటే జీవితాంతం వాటిని మెయిన్‌టెన్‌ చేయాల్సిందే. తరుచూ జబ్బుపడే వారు, వృద్ధులు, గర్భిణులు, శిశువులకు కలుషిత ఆహారంతో మరిన్ని సమస్యలు వస్తాయి. ఇవి ఊహించని విధంగా ఉంటాయి.

కలుషిత మార్గాలెన్నో?

ఈ రోజుల్లో ఆహారం కలుషితం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆహారం ఎన్నో దశలు దాటి మన చేతికి వస్తుంది. విత్తు నాటడం, పంట కోయడం, ప్రాసెస్‌ చేయడం, నిల్వ, రవాణా, పంపిణీ వంటి దశలు ఉంటాయి. మాంసాహారానికీ ఇలాగే ఉంటాయి. ఇవన్నీ కలుషితానికి దారితీస్తున్నాయి. పెరుగుతున్న ప్రపంచీకరణ సైతం కలుషిత ఆహార ఉత్పన్న రోగాలకు కారణం అవుతోంది.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఆహారం మరింత సురక్షితంగా ఉంచేందుకు బహుళ వ్యవస్థలు కలిసి పనిచేయాలి. శాస్త్ర, సాంకేతిక పద్ధతులు అవలంభించాలి. ప్రభుత్వంలోని వేర్వేరు శాఖలైన వ్యవసాయం, విద్య, వాణిజ్యం, ప్రజారోగ్యం, పౌర సరఫరాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. ఆహారం కలుషితం అవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థకు సైతం నష్టమే. ఎగుమతులు, దిగుమతులు, పర్యాటకం, ఆర్థిక అభివృద్ధిపై ప్రభావం పడుతుంది.

బ్యాక్టీరియా, వైరస్‌లకు నిరోధకశక్తి

కొన్ని ఔషధాలకు బ్యాక్టీరియా, వైరస్‌లు లొంగకపోవడం నేడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. వ్యవసాయం, పశు సంవర్థకం (మాంసాహారం)లో అతిగా యాంటీ మైక్రోబయల్స్‌ను ఉపయోగించడం, వైద్యం కోసం మనుషులు వాడటంతో బ్యాక్టీరియా, వైరస్‌కు వాటిని నిరోధించే శక్తి పెరుగుతోంది. ఇది మాంసాహారం ద్వారా మనుషులకు కలుగుతోంది. ఫలితంగా ఔషధాలు పనిచేయడం లేదు. ప్రభుత్వాలు సురక్షిత ఆహారంపై అవగాహన కల్పించాలి.


ఐదు సూత్రాలతో ఆహారం సురక్షితం

శుభ్రత: వంటగదిలోకి వెళ్లగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఆహారాన్ని వండుకోవాలి.
వేర్వేరుగా నిల్వ: వండిన, వండని ఆహార పదార్థాలను వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. అప్పుడు కలుషితమయ్యే అవకాశాలు తగ్గుతాయి.
పూర్తిగా ఉడికించండి: ఆహారాన్ని చక్కగా ఉడికించి వండిన తర్వాతే వడ్డించాలి. అప్పుడే క్రిములు పూర్తిగా నశిస్తాయి. పోషకాల స్థాయి పెరుగుతుంది.
ఉష్ణోగ్రత: వేర్వేరు ఆహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేసుకోవడం ఎంత ముఖ్యమో సరైన ఉష్ణోగ్రతల వద్ద వాటిని ఉంచడం అంత శ్రేయస్కరం.
శుభ్రమైన నీరు: కూరగాయాలు, వండని ఆహార పదార్థాలను కడిగేందుకు పరిశుభ్రమైన నీటిని ఉపయోగించాలి. నిర్దేశిత సమయం వరకు కడగాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని