Kerala : అక్కడ దెయ్యాలు సంచరిస్తున్నాయనేవారు.. ఇప్పుడదే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం!

కేరళలోని మట్టాన్‌చెర్రీ ఇప్పుడు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది. అక్కడి యూదుల పురాతన నివాసాలు క్రమంగా ఆతిథ్యం పలికే హోటళ్లుగా మారుతున్నాయి. 

Published : 01 Mar 2023 11:13 IST

(Image : A.B.Salem House facebook)

కేరళ(kerala) రాష్ట్రం కొచ్చిన్‌లో టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో అక్కడి మట్టాన్‌చెర్రీలోని(Mattancherry) జూ స్ట్రీట్‌లో 350 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ ఇంటిని హోటల్‌గా మార్చారు. అది ‘యూదుల గాంధీ’గా(Jewish Gandhi) పేరొందిన అబ్రహం బెన్‌ బరాక్‌ అలియాస్‌ ఏబీ సేలం(AB Salem) నివసించిన ఇల్లు కావడం విశేషం. ఆయన లాయర్‌గా పనిచేసేవారు. భారత స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఇంటికి ఇప్పుడు కొన్ని హంగులు అద్ది అందమైన హోటల్‌గా రూపొందించారు.

ఇదే తరహాలో 17వ శతాబ్దానికి చెందిన వ్యాపారి(businessman) రబ్బీ రెహాబీ ఎహెజ్కేల్‌ ఇంటిని కూడా బోటిక్‌ హోటల్‌గా మార్చే పనులు జరుగుతున్నాయి. లైలా మంజిల్‌గా దీన్ని పిలుస్తుంటారు. ఈ ఏడాదిలోనే ఆ పనులు పూర్తి కానున్నాయి. రబ్బీ రెహాబీ  ఇల్లు ఉండే వీధి చివర్లోనే ప్రసిద్ధ యూదుల ప్రార్థనాలయం ఉంది. ఎలియాస్‌ కోడర్‌ అనే ప్రముఖ వ్యాపారి నివసించిన మరో ఇంటిని కూడా 8 గదులతో ఓ హోటల్‌గా సిద్ధం చేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి కంటే ముందు నుంచే ఈ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా పూర్తి కానున్నాయి. ఏబీ సేలం, ఎహెజ్కేల్‌ రెండింటినీ జోస్‌ డొమినిక్‌ కొనుగోలు చేశాడు. 2017, 18 సంవత్సరాల్లో అవి అమ్మకానికి వచ్చాయి. ఈ ప్రాంతానికి మళ్లీ యూదుల కాలం నాటి కళ తీసుకురావాలని డొమినిక్‌ సంకల్పించాడు. అందుకే రెండు ఇళ్లను ఆతిథ్యానికి చిరునామాగా మార్చేందుకు యత్నిస్తున్నాడు.

(Image : A.B.Salem House facebook)

యూదుల వారసత్వానికి ప్రతీకలు..

మట్టాన్‌చెర్రీలోని జూ స్ట్రీట్‌లో ఇళ్లన్నీ సెఫార్డిక్‌ యూదులు నివసించినవి. స్పెయిన్‌ నుంచి వారు 15, 16వ శతాబ్దాల కాలంలో భారత్‌కు వచ్చారు. కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లోని సినాగోగ్‌ లేన్‌ ప్రాంతాన్ని నివాస ప్రాంతంగా ఎంచుకొని మనుగడ సాగించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1958లో వీరిలో చాలా మంది ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. అప్పటి నుంచి ఈ యూదుల నివాసాలు వారి వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇళ్ల కట్టడాలు, పై కప్పులు, విద్యుద్దీపాలు, కుర్చీలు ఇతర వస్తువుల్లో యూదుల సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది. దాదాపు 90వ దశకం వరకు ఇక్కడ ఎలాంటి మార్పులూ రాలేదనే చెప్పొచ్చు. ఆ తరువాత క్రమంగా స్థానిక వ్యాపారులు  ఇళ్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరం నాటికి దాదాపు ప్రతి ఇంటి యాజమాన్య హక్కులు వేరొకరి బదిలీ అయ్యాయి. కొన్ని మాత్రమే అలాగే ఉండిపోయాయి. 

మారుతున్న రూపురేఖలు

కొచ్చిన్‌లో పర్యాటకం ఊపందుకోవడంతో కొనుగోలు చేసిన ఇళ్లను చాలా మంది అద్దెకిచ్చారు. కశ్మీర్‌కు చెందిన వ్యాపారులు సైతం ఇక్కడకు వచ్చి అద్దెగదుల్లో ఉంటూ తమ చేతివృత్తులను విక్రయించారు. కొచ్చిన్‌ మార్కెట్‌లో సుగంధ ద్రవ్యాలు, పురాతన వస్తువుల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. దాంతో ఈ యూదుల పట్టణం కాస్తా పురాతన వస్తువులు, సుగంధ ద్రవ్యాల మార్కెట్‌గా మారిపోయింది. అయితే సాయంత్రం దుకాణాలు మూసిన తరువాత ఈ వీధుల్లో దెయ్యాలు సంచరిస్తున్నాయనే వదంతులు వచ్చాయి. మరణించిన యూదుల్లో కొందరు దెయ్యాలుగా మారారని.. రాత్రిపూట వారి ఏడుపులు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్పేవారు. కానీ, క్రమంగా ఆ వదంతులు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడి యూదుల ప్రార్థనాలయం కూడా పర్యాటకుల రాకపోకలకు కారణమైంది. రోజుకు దాదాపు వెయ్యిమంది దీనిని సందర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం పర్యాటకులను ఆకర్షించేందుకు ‘కొచ్చిన్‌ స్మార్ట్‌ మిషన్‌ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూరోపియన్ సంస్కృతి ప్రతిబింబించేలా కాలువలు, పాదబాటలు, వీధి దీపాలు, కుర్చీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ మార్పులను చూసి స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కారణంగా ఈ ప్రాంతంలో భూమి ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో అక్కడి వ్యాపార సముదాయాల అద్దెలు కూడా భారీగా పెరిగాయి. రోజురోజుకీ సుగంధ ద్రవ్యాల వ్యాపారం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆతిథ్యరంగం ఇక్కడ మరింత ఊపందుకుంటుందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు