Spy pigeon : పావురాలు వర్తమానం మోసుకెళ్లలేదు .. గూఢచర్యంతో యుద్ధాల్ని నడిపాయి!

ఇటీవలి కాలంలో కొన్ని అనుమానాస్పద పావురాల(Pigeon)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి కెమెరాలు, ట్యాగ్‌లు ఉండటంతో కలకలం రేగుతోంది.

Published : 10 Mar 2023 09:51 IST

కెమెరా, మైక్రోచిప్‌లు అమర్చిన ఓ పావురాన్ని ఒడిశా(Odisha) జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలోని పారాదీప్‌ సముద్ర(Sea)తీరంలో తాజాగా గుర్తించారు. ఈ పక్షిని గూఢచర్యం(Spy) కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు పావురాలకు గూఢచర్యం చేసే తెలివితేటలున్నాయా? ఇప్పటి వరకు వివిధ దేశాలు పావురాలను ఏ విధంగా వినియోగించాయో తెలుసుకోండి.

క్రీస్తు పూర్వం నుంచే..

పావురాలను గూఢచర్యం కోసం ఉపయోగించడం పూర్వం రోజుల నుంచే జరుగుతోంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే పర్షియా రాజు సైరస్‌ తన రాజ్యంలోని వివిధ ప్రదేశాలకు పావురాలను పంపేవాడు. జూలియస్‌ సీజర్‌ కూడా తన భూభాగమైన గౌల్‌కు పావురాల ద్వారా వర్తమానం పంపించినట్లు కొందరు చరిత్రకారులు తమ రచనల్లో పేర్కొన్నారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో జరిగిన ఫ్రాన్సో-(ప్రష్యన్‌)జర్మనీ యుద్ధంలోనూ పావురాలు వాడారు. ఫ్రాన్స్‌ సైనికులు గూఢచర్యం కోసం పావురాలను వినియోగించగా.. వాటిని కట్టడి చేసేందుకు జర్మనీ గద్దలను ఉసిగొల్పింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో..

హోమింగ్‌ జాతి పావురాలను మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఎక్కువగా వినియోగించారు. ఫ్రాన్స్‌ 72 పావురాల గూళ్లను తమ ఆర్మీ బలగాలతో పంపించింది. యూఎస్‌ (America)ఆర్మీ సిగ్నల్ క్రాప్స్‌ 600 పావురాలను గూఢచర్యం కోసం వినియోగించింది. అందులో ఒక పావురమైన ‘ఛెర్‌ అమి’ సేవలను గుర్తిస్తూ దానికి ‘క్రోయిక్స్‌ దె గ్యూరె అవార్డు’ ఇచ్చారు. ‘బ్యాటిల్‌ ఆఫ్‌ వెర్డన్‌’లో ఈ పావురం 12 ముఖ్యమైన సందేశాలను తీసుకెళ్లింది. చివరిసారిగా ఓ ముఖ్యమైన సందేశం చేరవేస్తున్న సమయంలో అది గాయపడింది. అయినప్పటికీ విజయవంతంగా ఆ సందేశాన్ని చేరవేయడంతో 194 మంది అమెరికా సైనికులు తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు. యుద్ధ సమయంలో విమానం గాల్లో ఉండగా పావురాలను బయటకు పంపించి తమ ముఖ్య స్థావరాలకు సందేశాలను పంపించేవారు.

రెండో ప్రపంచ యుద్ధంలో..

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూకే అత్యధికంగా 2.50లక్షల పావురాలను వినియోగించింది. వాటి సేవలను గుర్తిస్తూ 32 పావురాలకు అవార్డులు కూడా ప్రదానం చేసింది. అందులో అమెరికాకు చెందిన జీఐ జో, ఐరిష్‌ పావురం ప్యాడీ కూడా ఉన్నాయి. వాయుసేనలో పావురాలకు ప్రత్యేక విభాగాన్ని కూడా యూకే ఏర్పాటు చేసింది. పావురాల్లో కొన్నింటికి చిన్నపాటి పేలుడు పదార్థాలు, జీవాయుధాలు మోసుకెళ్లే విధంగానూ శిక్షణనిచ్చారనే వదంతులు అప్పట్లో వచ్చాయి. యుద్ధ సమయంలో వినియోగించుకున్న పావురాలకు ప్రత్యేకంగా మొక్కజొన్న, ఇతర గింజలు పెట్టేవారట.

ఇప్పుడూ కపట కపోతాలు!

రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసిన తరువాత నుంచి పావురాల గూఢచర్యం గురించి అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తున్నాయి. 2010లో ఓ పావురం పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చినట్లుగా అనుమానించి దానిని బంధించారు. 2015లో దొరికిన మరో పావురాన్ని ‘అనుమానాస్పద గూఢచారి’గా రికార్డులో నమోదు చేశారు. 2020 మేలో జమ్మూకశ్మీర్‌లో మరో కపోతాన్ని కనుగొన్నారు. అయితే దాని వద్ద అనుమానాస్పద వస్తువులేవీ దొరకకపోవడంతో వెనక్కి వదిలారు. గతేడాది ప్రకాశం జిల్లాలోనూ ఓ పావురం కనిపించింది.

‘హోమింగ్‌’ రయ్‌రయ్‌

పావురాలు సుదూర ప్రయాణం చేయగలవు. వాటిలో కొన్ని ఎంత దూరం వెళ్లినా తాము బయలుదేరిన ప్రదేశానికి తిరిగి చేరుకోగలవు. అటువంటి పావురాలను ‘హోమింగ్’ పావురాలుగా పిలుస్తారు. ఇవి గంటకు 97 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అలా రోజుకు దాదాపు వెయ్యికిలోమీటర్లు సునాయాసంగా వెళతాయి. అందుకే వాటి కాళ్లకు చిన్నపాటి డబ్బాలను కట్టి అందులో మందుగుండ్లు, సందేశాలు పంపించేవారు. ఇటీవలి కాలంలో కెమెరాలు, ట్యాగ్‌లు అమర్చిన పావురాలు దొరుకుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని