Lemon melon : ‘లెమన్‌ మెలన్’ రుచి చూస్తారా.. పేరుకు తగ్గ పండు!

పులుపు, తీపి కలబోతగా ఉండే సరికొత్త పండు ‘లెమన్‌ మెలన్‌’ (lemon melon) జపనీస్‌ మార్కెట్లలోకి వచ్చింది. ఈ సరికొత్త ఫలాన్ని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకోండి. 

Updated : 11 Jul 2023 14:16 IST

Image : suntory

నిమ్మకాయ పుల్లగా.. పుచ్చకాయ తియ్యగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఈ రెండూ కలిపి తింటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు ‘లెమన్ మెలన్’ను (lemon melon) రుచి చూడాల్సిందే. జపాన్‌ (Japan) దేశంలో ఈ సరికొత్త రుచిగల పండును కనుగొన్నారు. ఇప్పుడిప్పుడే అక్కడి మార్కెట్లోకి వస్తున్న ఆ పండును కొనుగోలు చేయడానికి చాలామంది ఉత్సాహం కనబరుస్తున్నారు. దాని విశేషాలేంటో తెలుసుకోండి.

ఐదేళ్లు కొనసాగిన పరిశోధన

జపనీస్ హార్టికల్చర్ కంపెనీ సన్‌టోరీ ఫ్లవర్స్ ఈ పండును అభివృద్ధి చేసింది. ఉద్యానవన నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతులు కలిసి సుమారు ఐదేళ్లు అనేక పరిశోధనలు చేసిన తర్వాత ‘లెమన్ మెలన్’ సృష్టి జరిగింది. ఈ పండును అభివృద్ధి చేసేందుకు వినియోగించిన పుచ్చకాయలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలి రోజుల్లో అనేక రకాల ప్రయోగాలు చేసి విఫలమయ్యారు. కానీ, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ సుమారు ఐదేళ్లు శ్రమించిన తర్వాత ఎట్టకేలకు ‘లెమన్ మెలన్‌’ను ప్రపంచానికి పరిచయం చేయగలిగారు. ఈ పరిశోధనా కాలంలో ఉద్యానవన నిపుణులు ఆ పండులోని పోషకాల రుచిని అనేక రకాలుగా పరిశీలించి చూశారు. ఈ పంటను పండించే పద్ధతులు. కాపు రావడానికి పట్టే సమయం తదితర ముఖ్యమైన వివరాలను నమోదు చేశారు. అలా ఈ కొత్త రకం పండ్ల సాగు చివరికి విజయవంతమైంది.

ఆహా ఏమి రుచి!

ఇక పండు రుచి విషయానికి వస్తే ఒక నిమ్మకాయ ఎలాంటి పుల్లదనం ఇస్తుందో ఈ పండులోనూ అలాంటి పులుపు లభిస్తుంది. అలాగే వేసవికాలంలో మనం ఇష్టంగా తినే పుచ్చకాయ రుచి ఎంత తీయగా నోటికి తగులుతుందో ఇది కూడా అలాంటి అనుభూతినిస్తుంది. అందుకే ఇది వేసవికాలంలో అందరూ ఇష్టంగా తినదగిన పండని దాని తయారీదారులు చెబుతున్నారు. ఇక ఆకారం విషయానికి వస్తే ఇది చూడటానికి గుండ్రంగా కనిపిస్తోంది. మామూలు పుచ్చకాయలాగా దీనిపై చారలు లేవు. లోపల గుజ్జు మాత్రం తెల్లగా ఉంటుంది. ఇది ఇంచుమించు పియర్ పండులాగే కనిపిస్తుందని చాలామంది చెబుతున్నారు. లెమన్‌ మెలన్‌ పండితే చాలా మెత్తగా మారుతుందట.

ఖరీదైన పండ్ల జాబితాలోకి..

ప్రస్తుతం హొక్కాయ్‌డో ప్రాంతానికి చెందిన ఐదుగురు రైతులు మాత్రమే ‘లెమన్ మెలన్’ పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ముగిసేలోగా 3,800 పండ్లను వారు పండించనున్నారు. జపాన్‌లోని చాలా సూపర్ మార్కెట్లలో ఇప్పటికే లెమన్ మెలన్లు కన్పిస్తున్నాయి. ఒక్కో పండును 22 డాలర్లకు విక్రయిస్తున్నారు. అయినా సరే అవి దొరికితే చాలని చాలా మంది ఎగబడి మరీ కొంటున్నారు. ఈ అద్భుతమైన పండును ఒక్కసారైనా తిని చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ‘ఇది నిమ్మకాయ లాంటి పుల్లదనం పుచ్చకాయ వంటి తీయదనం కలిగి ఉంది. తినడానికి చాలా రుచిగా ఉందని’ ఓ కొనుగోలుదారుడు పేర్కొన్నాడు. ‘ఈ పండులో తీయదనం, పుల్లదనం సమపాళ్లలో ఉంది. వేసవిలో తినడానికి ఇది చాలా మంచి పండు’ అని మరొకరు చెప్పారు. జపాన్ లగ్జరీ ఫ్రూట్ మార్కెట్లలో ఇప్పటికే చాలా ఖరీదైన పండ్లు లభిస్తున్నాయి. వాటి జాబితాలోకి తాజాగా లెమన్ మెలన్ వచ్చి చేరింది. జపాన్ మార్కెట్లలో ప్రపంచంలోనే ఖరీదైన చదరపు ఆకృతి పుచ్చకాయలు, ద్రాక్ష, తెల్లని స్ట్రాబెరీలు విరివిగా దొరుకుతాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని