Raccoon dog : జపాన్‌లో రాకూన్‌ జాతి కుక్కల ‘ఎపిసోడ్‌’.. అలా మొదలైంది!

రాకూన్‌ జాతి కుక్కలు (Raccoon dog) జపాన్‌కు (Japan) చెందినవి కాదు. అయినా వాటి సంతతి అక్కడ గణనీయంగా అభివృద్ధి చెందింది. అందుకు కారణం ఓ యానిమేటెడ్‌ సిరీస్‌ (Anime series).

Published : 13 Apr 2023 15:39 IST

ఇటీవల చైనా(China)లోని వుహాన్‌(wuhan)లో హువానాన్‌ టోకు చేపల మార్కెట్ నుంచి డేటా సేకరించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రాకూన్‌ జాతి కుక్కల (Raccoon dog) జన్యుపదార్థంలో కొవిడ్‌(Covid) కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని తేల్చింది. అయితే, కరోనా వ్యాప్తికి ఈ కుక్కలే కారణమని ఆ పరిశోధన పూర్తిస్థాయిలో నిరూపించలేకపోయింది. ఈ కుక్కలు చైనాలో మాత్రమే కాకుండా కొరియా, అమెరికా, జపాన్‌లోనూ (Japan) ఉన్నాయి. జపాన్‌లో ఈ జాతి కుక్కలు విస్తరించడానికి వెనకున్న ఆసక్తికర విషయం తెలుసుకోండి.

వెర్రెత్తించిన ఎపిసోడ్లు!

అమెరికాకు చెందిన రచయిత స్టెర్లింగ్‌ నార్త్‌ 1963లో ‘రాస్కెల్‌ : ఎ మెమోయిర్‌ ఆఫ్‌ బెటర్‌ ఎరా’ అనే పుస్తకాన్ని విడుదల చేశాడు. అది ఓ బాలుడు ‘రాస్కెల్‌’ పేరుతో ఉన్న రాకూన్‌తో కలిసి చేసిన సాహసాలను చెబుతుంది. ఆ పుస్తకానికి మంచి ఆదరణ రావడంతో డిస్నీ దాన్ని యాక్షన్‌ చిత్రంగా రూపొందించాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ఆ పుస్తకం ఆధారంగా జపాన్‌లో 52 ఎపిసోడ్లతో యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించారు. దాని పేరు ‘రాస్కెల్‌ ది రాకూన్‌’. జపనీస్‌లో ‘అరైగుమ రసకరు’. 1977లో ఒక సంవత్సరంపాటు ఈ ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. దాంతో రాకూన్‌లను పెంపుడు జంతువులుగా చేసుకోవాలని జపాన్‌ చిన్నారులు ఉబలాటపడ్డారు. కానీ, అప్పటికి జపాన్‌లో ఆ జీవులు లేవు. అందువల్ల అమెరికా నుంచి వేల సంఖ్యలో రాకూన్‌ కూనలను దిగుమతి చేసుకున్నారు.

వదిలితే బీభత్సం

వాస్తవానికి రాకూన్‌ కథ చివరిలో దాన్ని ఒక వైల్డ్‌ యానిమల్‌ అని స్పష్టంగా పేర్కొన్నారు. అవి మనుషులు పెంచుకోవడానికి పనికి రావని తెలిసి కథలోని బాలుడు దాన్ని అడవిలో వదిలి పెట్టేస్తాడు. కానీ, జపాన్‌లో మాత్రం వాటిని పెంచుకోవడానికి ఆసక్తి చూపించడంతో సమస్య మొదలైంది. కొందరు ఎపిసోడ్లలో చూపించిన విధంగానే పెరిగి పెద్దవైన వాటిని అడవిలో వదిలిపెట్టారు. ఒక్కసారిగా బయటకు వెళ్లిన రాకూన్‌లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. తొందరగా తమ సంతతిని వృద్ధి చేయడం వాటి సహజ లక్షణం. అందువల్ల రాకూన్‌ల మంద విపరీతంగా పెరిగిపోయింది. అవి పంటలను నాశనం చేశాయి. పవిత్రమైన దేవాలయాలు, ఇళ్లలోకి చొరబడి గందరగోళం సృష్టించాయి. అప్పట్లోనే లక్షల డాలర్ల నష్టం వాటిల్లింది. అమెరికాలో రాకూన్‌లు ఉన్నప్పటికీ వాటిని తోడేళ్లు, ఇతర జంతువులు వేటాడి తినేసేవి. దాంతో ఆ జంతువుల సంఖ్య రెట్టింపు కాలేదు.

కొనసాగుతున్న ఆదరణ

జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు జపాన్‌ ప్రభుత్వం రాకూన్‌ల దిగుమతిపై నిషేధం విధించింది. ఉన్న వాటిని అధికారులు కట్టడి చేయాలని ప్రయత్నించినా అప్పటికే అవి వేల సంఖ్యలో ఉన్నాయి. పైగా కొన్ని రాకూన్‌లు ఊర్లలోకి ప్రవేశించి ఆహారం కోసం చెత్తకుండీలను వెతకడం ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని మనుషులపైనా దాడికి దిగాయి. దాంతో స్థానిక ప్రభుత్వాలు వాటిని నిర్మూలించాలని నిర్ణయానికి వచ్చాయి. ఆ దిశగా చర్యలు చేపట్టడంతో జంతుహక్కుల కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. అందువల్ల వాటి సంఖ్యను మాత్రమే తగ్గించగలిగారు. ప్రస్తుతం జపాన్‌లో రాకూన్‌ జాతి కుక్కల బీభత్సం అడపాదడపా కొనసాగుతున్నప్పటికీ ఆ యానిమేటెడ్‌ సిరీస్‌ను మాత్రం ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు.

-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని